ప్రజా గాయకుడు గద్దర్‌ మరణంతో తెలుగు ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. ఆయన ఇక లేరనే వార్త ప్రజల్ని శోకసంద్రంలో ముంచింది. 74 ఏళ్ళ వయసున్న గద్దర్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్ను మూశారు. గద్దర్ గాయకుడు మాత్రమే కాదు... ఆయన గేయ రచయిత. ఆయనలో సహజ నటుడు కూడా ఉన్నారు.


గద్దర్ ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే కాకుండా తన పాటలతో అందరినీ ఉత్తేజ పరిచేవారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 'అమ్మ తెలంగాణమా...', 'పొడుస్తున్న పొద్దుమీద...' (జై బోలో తెలంగాణ సినిమాలో) వంటి గద్దర్ పాటలు ఉద్యమాలకు మరింత ఊపిరి పోశాయి. 'మా భూమి' సినిమాలో 'బండి వెనుక బండికట్టి...' పాటలో కూడా ఆయన వెండితెరపై కనిపించారు. పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి పలు చిత్రాలకు గద్దర్ పాటలు రాశారు. 'ఒరేయ్ రిక్షా'లో 'మల్లెతీగకు పందిరి వోలే...' పాటలో కనిపించారు కూడా!


'గద్దర్' చివరి సినిమా ఇంకా విడుదల కాలేదు
గద్దర్ పాటలు రాయడంతో పాటు ఓ పాత్రలో నటించిన సినిమా ఇంకా విడుదల కాలేదు. ఆ సినిమా పేరు 'ఉక్కు సత్యాగ్రహం'. విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో రూపొందుతోంది. సత్యారెడ్డి కథానాయకుడిగా నటిస్తూ... స్వీయ దర్శక నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. 


గద్దర్ మరణ వార్త తమను ఎంతగానో కలచి వేసిందని దర్శక నిర్మాత సత్యారెడ్డి తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''మా చిత్రంలో ప్రజా గాయకుడు గద్దర్‌ గారు చాలా ముఖ్యమైన పాత్ర చేశారు. ఆయన నటించిన చివరి చిత్రమిదే. డబ్బింగ్ పనులు పూర్తి అయ్యాయి. ఇటీవల రీ రికార్డింగ్‌ పనుల్లో కూడా ఆయన పాల్గొన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మా చిత్ర బృందం తరఫున కోరుకుంటున్నాం'' అని చెప్పారు.


Also Read : 'బ్రో' శాంపిలే, 'ఉస్తాద్'లో సెటైర్స్ సునామీ - టార్గెట్ వైసీపీ!


స్టీల్‌ ప్లాంట్‌ సాధన కోసం జరిగిన పోరాటం, ఈనాడు పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటాల ఇతివృత్తంతో 'ఉక్కు సత్యాగ్రహం' రూపొందుతోందని చిత్ర బృందం తెలియజేసింది. స్టీల్‌ ప్లాంట్‌ యూనియన్‌ లీడర్లు, ఉద్యోగులు, నిర్వాసితులు ఈ చిత్రంలో నటించడం విశేషం. గద్దర్‌, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్‌ తేజ, సత్యా రెడ్డి, మజ్జి దేవిశ్రీ ఈ సినిమాలో పాటలు రాశారు.


Also Read ఆగ్రహంతో ఊగిపోతున్న అల్లు అర్జున్ అభిమానులు - మైత్రికి మాస్ వార్నింగ్!



'ఉక్కు సత్యాగ్రహం' సినిమాతో 'పల్సర్‌ బైక్‌' పాటతో పాపులర్ అయిన గాజువాక కండక్టర్ ఝాన్సీ కథానాయికగా పరిచయం అవుతున్నారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యానారాయణ, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఇంకా మేఘన, స్టీల్‌ ప్లాంట్‌ పోరాట కమిటీ నాయకులు అయోధ్య రామ్‌, ఆదినారాయణ, వెంకట్రావు, ప్రసన్న కుమార్‌, కేయస్‌ఎన్‌ రావ్‌, మీరా, పల్నాడు  శ్రీనివాసరెడ్డి, రమణారెడ్డి, హనుమయ్య, అప్పికొండ అప్పారావ్‌, బాబాన్న తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. 'ఉక్కు సత్యాగ్రహం' చిత్రానికి నృత్య దర్శకత్వం : నందు - నాగరాజు, కూర్పు : మేనగ శ్రీను, ఛాయాగ్రహణం : వెంకట్ చక్రి, సహ నిర్మాతలు శంకర్ రెడ్డి - కుర్రి నారాయణరెడ్డి, సంగీత దర్శకత్వం : కోటి,  సమర్పణ : సతీష్ రెడ్డి, కథ - స్క్రీన్ ప్లే - మాటలు - నిర్మాత - దర్శకత్వం : సత్యారెడ్డి.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial