'బ్రో' సినిమా విడుదలైన తర్వాత రాజకీయ రగడ మొదలైంది. తాను చేసిన నృత్యాన్ని (ఆనంద తాండవం అని వర్ణించారనుకోండి) అవహేళన చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీకి చెందిన నేత, ఏపీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. 


'బ్రో' (Bro Movie) అట్టర్ ఫ్లాప్ అన్నారు అంబటి. కలెక్షన్స్ రావడం లేదన్నారు. పవన్ కళ్యాణ్ కోట్లకు కోట్లు పారితోషికం తీసుకోవడం వల్ల నిర్మాతలకు నష్టాలు వస్తున్నాయన్నారు. సినిమా నిర్మాణంలో మనీ రూటింగ్ జరిగిందని ఆరోపణలు చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఆ ఆరోపణలకు సమాధానాలు ఇచ్చారు. ఇప్పుడు మ్యాటర్ అది కాదు... 'బ్రో'లో రెండు మూడు సెటైర్స్ పడితే అంతెత్తున మండిపడ్డ అంబటి రాంబాబు, 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదలైన తర్వాత ఏమైపోతారో? అని ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. 


'ఉస్తాద్...'లో పొలిటికల్ సెటైర్ల సునామీ!
జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా ఆయన డై హార్డ్ ఫ్యాన్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh). సంక్రాంతి బరిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో పొలిటికల్ సెటైర్స్ ఓ స్థాయిలో ఉంటాయని క్లారిటీ వచ్చింది. 'బ్రో'లో రెండు అంటే రెండు పొలిటికల్ సెటైర్ సీన్స్ ఉన్నాయి. అవి శాంపిల్ అయితే... 'ఉస్తాద్ భగత్ సింగ్'లో సెటైర్స్ సునామీ ఉంటుందని హరీష్ శంకర్ కన్ఫర్మ్ చేశారు. 


పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ ఇంతకు ముందు తీసిన 'గబ్బర్ సింగ్' చూస్తే... అందులోనూ కొన్ని సెటైర్స్ ఉన్నాయి. వ్యంగ్యంగా సంభాషణలు రాయడంలో హరీష్ శంకర్ సిద్ధహస్తులు. పైగా, ఆయనకు తెలుగు భాష మీద మంచి పట్టు ఉంది. సెటైర్ అని ఎదుటి వ్యక్తికి అర్థం అయ్యేలా, అది సెటైర్ కాదని తనను తాను సమర్ధించుకోగల విధంగా సంభాషణలు రాసే నేర్పు ఆయన సొంతం. అభిమాన కథానాయకుడి కోసం ఆయన ఏ విధమైన సంభాషణలు రాస్తారో చూడాలి.


Also Read ట్రెండింగులో ఉంది 'బ్రో' - రెండో వారంలోనూ బాక్సాఫీస్‌లో పవన్ జోరు


'ఉస్తాద్ భగత్ సింగ్' కథలో పొలిటికల్ సెటైర్లకు ఆస్కారం ఉందా? అంటే... చాలా బలంగా ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. తమిళ హిట్ 'తెరి'లో మూలకథను తీసుకుని పవన్ కళ్యాణ్ ఇమేజ్, అభిమానుల అంచనాలకు తగ్గట్టు మార్పులు చేశారు హరీష్ శంకర్. 'ఉస్తాద్ భగత్ సింగ్'లో పవన్ కళ్యాణ్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నారు. 'తెరి'ని గమనిస్తే... అందులో ఓ ఎంపీని విలన్ పాత్రలో చూపించారు. ఎంపీకి ఎదురు తిరిగి హీరోయిజం చూపించే సీన్లు ఉన్నాయి. ఈ ఒక్క హింట్ చాలదూ... సినిమాలో పొలిటికల్ సెటైర్లు ఏ స్థాయిలో పడతాయనేది అర్థం చేసుకోవడానికి!


Also Read మయోసైటిస్ చికిత్సకు 25 కోట్లా? ఆ హీరో ఇచ్చాడా? - సమంత రెస్పాన్స్ చూశారా?



'ఉస్తాద్ భగత్ సింగ్'లో పవన్ కళ్యాణ్ సరసన శ్రీ లీల నటిస్తున్నారు. ఇందులో మరో కథానాయికగా సాక్షి వైద్యను ఎంపిక చేసినట్లు తెలిసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial