''గద్దర్ గళం అజరామరం. ఏ పాట పాడినా... దానికో ప్రజా ప్రయోజనం ఉండేలా గొంతు ఎత్తి పోరాడిన ప్రజా గాయకుడు, 'ప్రజా యుద్ధ నౌక' గద్దరన్నకి లాల్ సలాం'' అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ''ప్రజా ఉద్యమాల్లో గద్దర్ లేని లోటును ఎవ్వరు తీర్చలేరు'' అని నట సింహం నందమూరి బాలకృష్ణ తెలిపారు.
ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక, తన గీతాల్లో ఎంతో మంది ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి రగిలించిన విప్లవ గేయ రచయిత గద్దర్ (Gaddar Passed Away) ఈ రోజు తుదిశ్వాస విడిచారు. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మరణం పట్ల తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
''సరళంగా ఉంటూనే అత్యంత ప్రభావవంతమైన తన మాటల పాటలతో దశాబ్దాల పాటు ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చిన గద్దరన్న ఇక లేరు అనే వార్త తీవ్ర విషాదాన్ని కలుగజేసింది. ప్రజా సాహిత్యంలో, ప్రజా ఉద్యమాలలో ఆయన లేని లోటు ఎప్పటికీ పూడనిది. పాటల్లోనూ, పోరాటంలోనూ ఆ గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది'' అని చిరంజీవి పేర్కొన్నారు. గద్దర్ కుటుంబ సభ్యులకు, లక్షలాది ఆయన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ప్రగాడ సంతాపం తెలిపారు మెగాస్టార్.
గద్దర్ ఓ విప్లవశక్తి - నందమూరి బాలకృష్ణ
''తన ఆట పాటలతో ప్రజా ఉద్యమాలు నడిపించిన విప్లవకారుడు, ప్రజా ఉద్యమ నాయకుడు గద్దర్. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను. గద్దర్ ఓ విప్లవ శక్తి. ప్రజా ఉద్యమ పాటలు అంటే తెలుగు రాష్ట్రాల్లోనూ దేశ వ్యాప్తంగా మన గద్దర్ గుర్తుకు వస్తారు. ప్రజా ఉద్యమాల్లో గద్దర్ లేని లోటును ఎవరూ తీర్చలేరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'' అని బాలకృష్ణ తెలిపారు.
ఆయన ఆట, మాట, పాట ఎప్పటికీ సజీవమే - జూనియర్ ఎన్టీఆర్!
''తన రచనలతో కొన్ని దశాబ్దాలుగా ప్రజల గుండెల్లో స్ఫూర్తిని నింపిన ప్రజా గాయకుడు గద్దర్ గారు. ఆయన మన మధ్య లేకున్నా... ఆయన ఆటా, మాటా, పాటా ఎప్పటికీ మన మధ్యన సజీవంగానే ఉంటాయి. గద్దర్ గారి కుటుంబ సభ్యులకు, కోట్లాది అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'' అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలిపారు.
Also Read : గద్దర్ చివరి సినిమా ఏదో తెలుసా? అందులో ఆయన ఏం చేశారంటే...
''ఒక అన్నమయ్య పుట్టారు...దివంగతులయ్యారు.
ఒక రామదాసు పుట్టారు...దివంగతులయ్యారు.
ఒక పాల్ రబ్సన్ పుట్టారు...దివంగతులయ్యారు.
ఒక గద్దర్ పుట్టారు...దివంగతులయ్యారు.
ప్రజా వాగ్గేయకారులలో మరో శకం ముగిసింది'' అని పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి తెలిపారు.
Also Read : 'బ్రో' శాంపిలే, 'ఉస్తాద్'లో సెటైర్స్ సునామీ - టార్గెట్ వైసీపీ!
''పల్లె పాట మీద ప్రేమ ప్రేమ పెంచుకుని... జనం పాటను గుండెకు హత్తుకుని... పోరు పాటను ఎగిరే ఎర్రజెండాకు అద్దిన ప్రజల గుండె గొంతుక, ప్రజా యుద్ధనౌక అందించిన స్ఫూర్తి చరిత్ర మరవదు. గద్దరన్న ఏ లోకంలో ఉన్నా... అన్న పాట అన్ని కాలాల్లో వినిపిస్తూనే ఉంటుంది. జోహార్ గద్దరన్న'' అని సినీ దర్శకుడు ఎన్. దర్శకుడు వీడియో విడుదల చేశారు. గద్దర్ మన మధ్య లేకపోవడం బాధాకరమని, ఆయన ఐడియాలజీతో పాటు పాటలు ఎప్పటికీ మన మధ్య ఉంటాయని సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. ఇంకా పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial