తెలుగు బుల్లితెర వీక్షకులకు 'బ్రహ్మముడి' సీరియల్ (Brahmamudi Serial) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో మానస్ నాగులపల్లి (Maanas Nagulapalli) హీరోగా నటిస్తున్నారు. రాజ్ పాత్రలో కనిపిస్తున్నారు. 'బ్రాహాముడి'లో ఆయన క్యారెక్టర్ ఏమిటి? ఆ పాత్రలో ఆయన నటన ఎలా ఉంది?


''ఎవరైనా మోసం చేస్తే సహించలేడు...
భార్యకు ఆర్థిక స్వేచ్ఛను ఇచ్చినోడు...  
తన వల్ల ఒకరు ఇబ్బంది పడితే తట్టుకోలేడు!''


- మూడు ముక్కలో చెప్పాలంటే... ఇదీ రాజ్ (మానస్ నాగులపల్లి) క్యారెక్టరైజేషన్!


రాజ్ క్యారెక్టరైజేషన్ గురించి విశ్లేషించే ముందు... ఆ క్యారెక్టర్ నేపథ్యం గురించి కాస్త చెప్పాలి. దుగ్గిరాల కుటుంబం అంటే సమాజంలో బోలెడంత పేరు ప్రతిష్టలు ఉన్నాయి. వాళ్ళది నగలు, ఆభరణాలు డిజైన్ చేసే కంపెనీ. రాజ్ తాతయ్య కష్టానికి ప్రతిఫలం అది. రాజ్ తండ్రి, బాబాయ్ కూడా కంపెనీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. ఇప్పుడు రాజ్ చేతిలో కంపెనీ బాధ్యతలు అప్పగించారు. తాతయ్య, తండ్రి వారసత్వం నిలబెట్టడం కోసం అతను ఎటువంటి లోపం, శక్తివంచన లేకుండా తన బాధ్యత నిర్వర్తిస్తున్నాడు. రాజ్ తాతయ్య మంచితనం కారణంగా వాళ్ళ ఇంటిలో తిష్ట వేసిన రుద్రాణి, తన కుమారుడు రాహుల్ చేతికి కంపెనీ పగ్గాలు అందాలని కుట్రలు చేసినా ఫలితం లేకుండా పోయింది. పేదింటి అమ్మాయి కావ్యను రాజ్ పెళ్లి చేసుకునేలా చేస్తే... కావ్య కూడా ఇప్పుడు కంపెనీకి హెల్ప్ అవుతోంది. ఈ కథలో రాజ్ క్యారెక్టర్,క్యారెక్టరైజేషన్ ఏమిటి? అనేది చూస్తే...


రాజ్ క్యారెక్టర్ పరిచయం అతడిపై నెగిటివ్ ఇంప్రెషన్ కలిగేలా ఉంటుంది. తన కారును ఉన్నట్టుండి పక్కకి తిప్పడంతో కావ్య సైకిల్‌కు గుద్దుకుంటుంది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరుగుతుంది. అప్పుడు రాజ్ పాత్రను, అతని స్వభావాన్ని గమనిస్తే డబ్బులు ఉన్నాయని పొగరుగా వ్యవహరిస్తున్నాడని అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే... ఆ సన్నివేశంలో రాజ్ కారును టర్న్ చేయకపోతే మరొకరి బండికి గుద్దుకునేది. ప్రమాదం ఏర్పడేది. తన వల్ల ఒకరికి ఏమీ కాకూడదని రాజ్ అలా టర్న్ చేశాడు. 


మంచితనమే కాదు... నాయకత్వ లక్షణాలు కూడా రాజ్ (Maanas Nagulapalli Role In Brahma Mudi Serial)లో ఉన్నాయి. నిజంగా పేరుకు తగ్గట్టు అతడు రాజే. ఇంట్లో పని వాళ్ళ పిల్లల ఫీజుకు రాజ్ డబ్బులు ఇస్తాడు. తమ కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళ బాగోగులు, బాధ్యతలు రాజ్ చూసుకుంటున్నాడు. ఒకవేళ నమ్మకంగా పని చేయాల్సిన వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకు శిక్ష కూడా విధించడం రాజ్ అలవాటు. తప్పు చేసిన వాళ్ళను ఇంట్లో అసిస్టెంట్లుగా చేశాడు. పని విషయంలో కూడా రాజీ పడదు. మంచి ప్రతిభ కనబరిస్తే... అభినందిస్తాడు. తాను కోరుకున్న విధంగా పని చేయకపోతే తిడతాడు కూడా! ఇదంతా కంపెనీ పరంగా రాజ్ క్యారెక్టర్. వ్యక్తిగత విషయానికి వస్తే...


మోసాన్ని సహించలేడు... ఇబ్బంది పడితే తట్టుకోలేడు!
ఎప్పుడు ఏ అమ్మాయిని ప్రేమించని రాజ్... స్వప్నను చూసి ఇష్టపడతారు. పెళ్ళికి ముందు స్వప్న లేచిపోతే... చెల్లెలు కావ్య వచ్చి పెళ్ళి మండపంలో కూర్చుంది. ఆ విషయం ముందు తనకు చెప్పని కారణంగా... మోసం చేశారని కావ్య ఫ్యామిలీ మీద కోపం పెంచుకుంటాడు. రాజ్ మోసాన్ని సహించలేడు. అందుకని, కావ్యను తన భార్యగా అంగీకరించడు.


Also Read వెంకటేష్ vs నాని vs నితిన్ vs సుధీర్ బాబు... క్రిస్మస్‌కు టాలీవుడ్ హీరోల పాన్ ఇండియా పోటీ  


ఇంట్లో పెద్దలు చెప్పడంలో కావ్యకు గదిలో చోటు ఇస్తాడు రాజ్. కానీ, పరుపు మీద రానివ్వడు. రోజూ చాప మీద నిద్రిస్తుంది కావ్య. ఒక రోజు రాజ్ చాపపై నిద్రించాల్సి వస్తుంది. మెడ పట్టేస్తుంది. ఆ తర్వాత పరుపు కొని తీసుకొస్తాడు. ఇతరుల కష్టాన్ని అర్థం చేసుకునే తత్వం అతడిది. అంతే కాదు... తన వల్ల ఒకరు ఇబ్బంది పడితే రాజ్ భరించలేడు. గురక వస్తుందని కావ్య చెబితే నిద్రలో గురక రాకుండా ఏం చేయాలో తెలుసుకోవడానికి ఓ డాక్టర్‌ని ఇంటికి పిలిపిస్తాడు. రోజులు గడిచే కొలదీ కావ్య వ్యక్తిత్వానికి రాజ్ ఆకర్షితుడు అవుతున్నట్లు కథలో చూపిస్తున్నారు. మరి, భవిష్యత్తులో వీళ్ళిద్దరి కథ ఏ విధంగా ముందుకు వెళుతుందో చూడాలి.


Also Read : మానస్, దీపికల 'బ్రహ్మముడి' - ఈ సీరియల్ చెబుతోన్న జీవిత సత్యాలు


మంచితనం, కోపం చూపించడమే కాదు... రాజ్‌లో మొహమాటం చాలా అంటే చాలా ఎక్కువ. ఉదాహరణకు... ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ శ్రీశైలం టెంపుల్ వెళ్ళినప్పుడు ఆస్తమా వస్తే కావ్య ఆసుపత్రికి తీసుకు వెళుతుంది. ఆమె చేతిలో చిల్లిగవ్వ ఉండదు. డబ్బులు ఇస్తానని, ముందు వైద్యం చేయమని డాక్టర్ వద్ద ప్రాధేయ పడుతుంది. అది గుర్తుకు వచ్చి ఆమెకు కొంత డబ్బులు ఇవ్వాలని అనుకుంటాడు. ఆ విషయం చెప్పలేక నానా తంటాలు పడతాడు. భార్యకు ఆర్థిక స్వేచ్ఛను కూడా ఇచ్చాడు. ఆమె డిజైన్స్ గీసినందుకు ఇచ్చిన డబ్బులు ఇంట్లో వాళ్ళకు ఇస్తానంటే ఓకే చెబుతాడు. ఆ విషయంలో మెచ్చుకోవాలి.


Maanas Nagulapalli Acting In Brahmamudi : రాజ్ క్యారెక్టర్, క్యారెక్టరైజేషన్‌ను మానస్ నాగులపల్లి ఎంత ఓన్ చేసుకున్నాడంటే... ఆ పాత్ర పేరు చెబితే సీరియల్ చూసేవాళ్ళకు అతని రూపం కళ్ళ ముందు మెదులుతుంది. డ్రస్సింగ్ అయితే పర్ఫెక్ట్. యాక్టింగ్ కూడా! సూట్ ఎంత బాగా సూట్ అయ్యిందో? కుర్తా పైజామాలు కూడా అంతే సెట్ అయ్యాయి. కావ్య ఇంటికి వెళ్ళినప్పుడు లుంగీలో కూడా భలే ఉన్నారు.


కోపం ప్రదర్శించే సన్నివేశాల్లో రాజ్ అవలీలగా చేసేశారు మానస్. రొమాంటిక్ అండ్ కామెడీ కూడా పండించారు. రాజ్ అండ్ కావ్య మధ్య టామ్ అండ్ జెర్రీ తరహాలో సీన్స్ ఉంటాయి. అందులో రాజ్ టైమింగ్ భలే నవ్విస్తుంది. చాలా సీరియస్‌గా ఉంటూ నవ్వించారు మానస్. ఒక ఎపిసోడ్‌లో మైకం వచ్చినట్లు యాక్టింగ్ కూడా భలే చేశారు.


'కోయిలమ్మ' సీరియల్‌తో బుల్లితెరపై పెంచుకున్న ఫాలోయింగ్ 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్లాక మరింత పెరిగింది. ఆ క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా రెట్టింపు చేసుకునేందుకు సహకరించింది 'బ్రహ్మముడి'‌లో రాజ్ క్యారెక్టర్. ఈ సీరియల్‌లో రాజ్‌ను చూసిన ప్రతి తల్లిదండ్రులు ఇటువంటి కొడుకు కావాలని అనుకుంటారు, ప్రతి అమ్మాయి తనకు ఇలాంటి భర్త కావాలనుకుంటుంది. ప్రతి ఉద్యోగికి ఇలాంటి బాస్ ఉంటే బావుండును అనిపిస్తుంది. రాజ్ పాత్రను అంత బాగా తీర్చిదిద్దారు. మరో వైపు సినిమాల్లో కూడా మానస్‌ ఆకట్టుకుంటున్నారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial