ఇటు వెండితెరపై, అటు బుల్లితెరపై... రెండిటిలో  విజయవంతమైన అతికొద్ది మంది కథానాయికలలో పూర్ణ అలియాస్ షమ్నా ఖాసిం (Actress Poorna) ఒకరు. పూర్ణ పేరు చెబితే వెండితెర ప్రేక్షకులకు రవిబాబు సినిమాలు గుర్తుకు వస్తాయి. వాటిలో 'అవును' ఫ్రాంచైజీ ఫేమస్. బుల్లితెరలో అయితే డ్యాన్స్ రియాలిటీ షో 'ఢీ' గుర్తుకు వస్తుంది. న్యాయ నిర్ణేతగా వీక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. కొంత విరామం తర్వాత బుల్లితెరపై రీ ఎంట్రీకి పూర్ణ రెడీ అయ్యారు. 


'ఢీ 16'తో పూర్ణ రెడీ!
దుబాయ్ వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్ & సీఈవో డాక్టర్ షానిద్ అసిఫ్ అలీ, పూర్ణ గత ఏడాది వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 4న ఈ దంపతులకు పండంటి బాబు జన్మించారు. డెలివరీకి కొన్ని రోజుల ముందు నుంచి నటనకు విరామం ఇచ్చారు పూర్ణ. ఇప్పుడు మళ్ళీ 'ఢీ' షో కోసం మేకప్ వేసుకున్నారు. 


ఈటీవీలో ప్రసారం అయ్యే డ్యాన్స్ రియాలిటీ షో 'ఢీ' 16వ సీజన్ 'డ్యాన్స్ ప్రీమియర్ లీగ్' ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. దీనికి శేఖర్ మాస్టర్, పూర్ణ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. ఆల్రెడీ విడుదలైన ప్రోమోలో ఆమె సందడి చేశారు. పూర్ణ తల్లి అయ్యి రెండున్నర నెలలు మాత్రమే అయ్యింది. ఒకవైపు బిడ్డను చూసుకుంటూ... మరోవైపు షూటింగ్ చేస్తున్నారు. ఇతర మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.


పూర్ణకు గ్యాప్ ఏమీ రాలేదు!
బిడ్డకు జన్మ ఇవ్వడం ద్వారా నటనకు పూర్ణ విరామం ఇచ్చారు. అయితే... నటిగా ఆమెకు గ్యాప్ ఏమీ రాలేదు. ఎందుకు అంటే... డెలివరీ తర్వాత పూర్ణ నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు ఇచ్చారు. డెలివరీకి కొన్ని రోజుల ముందు నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తీ సురేష్ కథానాయికగా నటించిన 'దసరా' విడుదల అయ్యింది. ఆ సినిమాలో పూర్ణ కీలక పాత్ర చేశారు. 


రవిబాబు దర్శకత్వంలో 'అవును', 'అవును 2' సినిమాలు చేసిన పూర్ణ... ఈసారి ఆయన దర్శకత్వంలో కాకుండా ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. రవిబాబు అందించిన కథతో ఉదయ్, సురేష్ దర్శకత్వం వహించిన 'అసలు' సినిమాలో పూర్ణ నటించారు. ఆ సినిమా ఈటీవీ సంస్థలకు చేసిన ఓటీటీ వేదిక 'ఈ విన్'లో విడుదల అయ్యింది.


Also Read : మీ కడుపు మంటకు ఫ్రీగా మజ్జిగ ఇస్తా - రూమర్స్, ట్రోలర్స్‌కు తమన్ దిమ్మతిరిగే రిప్లై



కథానాయికగా కెరీర్ స్టార్ట్ చేసిన పూర్ణ, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాల్సి వచ్చింది. 'అల్లరి' నరేష్ సరసన 'సీమ టపాకాయ్'లో కథానాయికగా చేశారు. ఆ తర్వాత రవిబాబు తీసిన 'అవును', 'అవును 2' సినిమాల్లో కథ అంతా ఆమె చుట్టూ తిరుగుతుంది. ఎందుకో స్టార్ హీరోయిన్ కాలేకపోయారు. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు 'శ్రీమంతుడు' సినిమాలో ప్రత్యేక గీతం చేశారు. కథానాయికగా అవకాశాలు తగ్గిన తర్వాత బుల్లితెరకు షిఫ్ట్ కావడం ద్వారా పూర్ణ కెరీర్ కంటిన్యూ చేశారు. సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు. 


Also Read రామ్ చరణ్‌ ఇంట మాత్రమే కాదు, ఈ స్టార్ హీరోల ఇంట్లోనూ మొదటి సంతానం అమ్మాయే