'గుంటూరు కారం' చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారా? లేదా? ఈ అంశంలో గందరగోళం నెలకొంది. గత కొన్ని గంటలకు ఆయన్ను సినిమా నుంచి తప్పించారని సోషల్ మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ వెబ్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. రూమర్స్ పట్ల తమన్ ఘాటుగా స్పందించారు. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చారు. 


స్టూడియోలో బటర్ మిల్క్ స్టాల్ పెడుతున్నా!
అరటిపళ్ళు ఆరోగ్యానికి చాలా మంచివని, కడుపు మంట చల్లారుస్తుందని తమన్ తొలుత ఓ ట్వీట్ చేశారు. ఆ తర్వాత మరో ట్వీట్ చేశారు. అందులో ''రేపటి నుంచి నా స్టూడియోలో బటర్ మిల్క్ (మజ్జిగ) స్టాల్ పెడుతున్నా. మజ్జిగను ఉచితంగా అందిస్తా. కడుపు మంట సమస్యలతో సతమతం అయ్యే వాళ్ళకు స్వాగతం. మీ రోగాన్ని తగ్గించుకోండి. గుడ్ నైట్! నాకు చాలా పని ఉంది. నా సమయాన్ని వృథా చేయవద్దు. అలాగే, మీ సమయాన్ని వృథా చేసుకోకండి. అరటిపళ్ళు తిని ప్రశాంతంగా ఉండండి'' అని పేర్కొన్నారు. 


'గుంటూరు కారం' నుంచి తనను తప్పించారని ప్రచారం చేస్తున్న వ్యక్తులకు దిమ్మ తిరిగేలా ఆయన రిప్లై ఇచ్చారని నెటిజనులు భావిస్తున్నారు. మరోవైపు చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నుంచి సైతం ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. తమన్ సినిమాకు సంగీతం అందిస్తున్నారని, అందులో మార్పు ఏమీ లేదని పేర్కొంది.






దర్శకుడిగా త్రివిక్రమ్ తొలి సినిమాకు కోటి సంగీతం అందించారు. 'అతడు', 'ఖలేజా' చిత్రాలకు మణిశర్మ సంగీతం అందించగా... మధ్యలో 'జల్సా', ఆ తర్వాత 'జులాయి' నుంచి 'సన్నాఫ్ సత్యమూర్తి' వరకు మూడు చిత్రాలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించారు. 'అజ్ఞాతవాసి'కి అనిరుధ్, 'అ ఆ'కు మిక్కీ జె. మేయర్ సంగీతం అందించగా... ఆ తర్వాత నుంచి తమన్ వచ్చారు. 
'అరవింద సమేత వీర రాఘవ'తో మొదలైన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీత దర్శకుడు తమన్ బంధం మొదలైంది. పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన, చేస్తున్న కొన్ని సినిమాలతో పాటు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మించిన కొన్ని సినిమాలకు కూడా ఆ బంధం కంటిన్యూ అవుతోంది.


Also Read : రామ్ చరణ్‌ ఇంట మాత్రమే కాదు, ఈ స్టార్ హీరోల ఇంట్లోనూ మొదటి సంతానం అమ్మాయే


'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్', ఇప్పుడు 'బ్రో' సినిమాలకు తమన్ సంగీత దర్శకుడిగా ఎంపిక కావడం వెనుక త్రివిక్రమ్ ఉన్నారని ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులకూ తెలుసు. త్రివిక్రమ్ తనకు గురువు అని, ఆయన వల్ల పవన్ కళ్యాణ్ సినిమాలకు పని చేసే అవకాశం వచ్చిందని తమన్ సైతం చెప్పారు. త్రివిక్రమ్ సినిమాలకు ఆయన సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చారు. అయితే... తమన్ సంగీతం పట్ల మహేష్ బాబు అసంతృప్తితో ఉన్నారని 'గుంటూరు కారం' సినిమా ప్రారంభమైనప్పటి నుంచి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 


మహేష్ బాబు ఒత్తిడి చేసినా సరే ఆయన్ను కంటిన్యూ చేయడానికి త్రివిక్రమ్ మొగ్గు చూపుతున్నారని సదరు వార్తల సారాంశం. మళ్ళీ మళ్ళీ పుకార్లు వస్తుండటంతో తమన్ కొంచెం ఘాటుగా ట్వీట్స్ చేశారని చెప్పవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన స్టోరీలోనూ 'మీరు ఆ పని అయిపోయిందని భావించవచ్చు. నేను ఇప్పుడే స్టార్ట్ చేశా' అని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. 


Also Read : నాలుగు రోజులకే ప్రభాస్‌కు డౌట్ వచ్చింది - ఓం రౌత్‌కు చెప్పినా వినలేదా?