Adipurush Controversies : విమర్శలు, వివాదాల నడుమ 'ఆదిపురుష్' 350 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. వసూళ్ళతో సంబంధం లేకుండా సినిమాపై విమర్శలు గుప్పిస్తున్న ప్రజల సంఖ్య ఎక్కువే ఉంది. ముఖ్యంగా దర్శకుడు ఓం రౌత్, రచయిత మనీష్ ముంతశిర్ రామాయణాన్ని వక్రీకరించారని హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ తప్పుల్ని ప్రభాస్ ముందుగా ఊహించారా? అంటే 'అవును' అనుకోవాలి. 


నాలుగు రోజులకే తేడా కొట్టింది!?
'ఆదిపురుష్'లో ప్రభాస్ కథానాయకుడిగా నటించారు. ఆయన పాత్ర పేరు రాఘవ్. శ్రీ రామచంద్ర ప్రభువుగా తెరపై కనిపించారు. ఇప్పటి వరకు తెరపై కనిపించిన రాముడికి మీసాలు లేవు. 'ఆదిపురుష్'లో మీసాలు పెట్టారు. ఇక, రావణుడి గెటప్ & లంక సెటప్ గురించి వస్తున్న విమర్శలకు లెక్క లేదు. ఓం రౌత్ చేసిన తప్పుల్ని సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. కొందరు కేసులు కూడా పెట్టారు. అయితే... ప్రభాస్ ముందుగా ఆ తప్పుల్ని గ్రహించారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే 'అవును' అనుకోక తప్పదు!


'ఆదిపురుష్' చిత్రీకరణ ప్రారంభించిన తర్వాత 'రాధే శ్యామ్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా విడుదల సమయంలో శ్రీరాముడి పాత్ర గురించి అడగ్గా... ''నాలుగు రోజులు షూటింగ్ చేసిన తర్వాత ఓం రౌత్ (Om Raut)ని పిలిచి 'నేను చేయొచ్చా?' అని అడిగా. వేరే సినిమాల విషయంలో తప్పులు చేసినా పర్వాలేదు. కానీ, రాఘవ్ (ఆదిపురుష్) విషయంలో తప్పులు చేయకూడదు. 'డోంట్ వర్రీ. నేను ఉన్నాను. మనం చేస్తున్నాం' అని చెప్పాడు'' అని ప్రభాస్ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీరో ముందు చెప్పినా దర్శకుడు పట్టించుకోలేదని, ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించారని ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Also Read : రామ్ చరణ్‌ ఇంట మాత్రమే కాదు... ఈ స్టార్ హీరోల ఇంట్లోనూ మొదటి సంతానం అమ్మాయే






'ఆదిపురుష్'లో లంకేశుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఆయనది రావణ బ్రహ్మ పాత్ర. ఆయన లుక్ విషయంలో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే, మాంసం ముట్టినట్టు, తన పెంపుడు జంతువుకు తినిపిస్తున్నట్టు వచ్చిన సన్నివేశాలపై హిందువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ మనోభావాలను కించపరిచారని చెబుతున్నారు. 


Also Read మహేష్ బాబు సినిమా నుంచి పూజా హెగ్డే కూడా అవుట్!



తొలుత రామాయణం ఆధారంగా 'ఆదిపురుష్' తీస్తున్నామని చెప్పిన దర్శకుడు ఓం రౌత్, రచయిత మనోజ్ ముంతశీర్... ఆ తర్వాత రామాయణం ఆధారంగా తీశామని చెప్పడం కూడా పలు విమర్శలకు తావు ఇచ్చింది. 'ఆదిపురుష్'లో చేసిన తప్పుల్ని సమర్ధించుకోవడం మరింత మంది ఆగ్రహానికి కారణమైంది. ఇప్పుడు ఏకంగా వాళ్ళ ఇంటి దగ్గర సెక్యూరిటీ ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడింది.


ఆ డైలాగులు తొలగిస్తున్నారు!
'ఆదిపురుష్'లోని సంభాషణల విషయంలో కూడా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. హనుమంతుని పాత్రకు అటువంటి డైలాగులు రాయడం ఏమిటి? అని కొందరు ప్రశ్నించారు. దాంతో ప్రేక్షకుల మనోభావాలను గౌరవించి ఆ డైలాగులు తొలగిస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. విమర్శలను పట్టించుకోకుండా కథానాయిక కృతి సనన్ ప్రశంసలను స్వీకరిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.