Tollywood Heroes- Daughters : అమ్మాయి లేదా అబ్బాయి... ఎవరైనా ఒక్కటే! పిల్లల విషయంలో వివక్ష చూపించే రోజులు ఎప్పుడో పోయాయి. అయితే... ఇంతకు ముందు హీరోలకు అబ్బాయి పుడితే 'వారసుడు వచ్చాడు' అని అభిమానులు సంబరపడిన సందర్భాలు కోకొల్లలు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. హీరోల కుమార్తెలు చాలా మంది నటనలో, నిర్మాణంలో విజయాలు సాధిస్తున్నారు. ఇప్పుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించడంతో 'వారసుడు' టాపిక్ మరోసారి తెరపైకి వచ్చింది.


రామ్ చరణ్ (Ram Charan)కు మాత్రమే కాదు... తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో కొంత మంది అగ్ర హీరోలకు మొదటి సంతానం అమ్మాయే. ఆ తర్వాత  కొందరికి అబ్బాయిలు జన్మించారు. అసలు, వారసులే లేని హీరోలు కూడా ఉన్నారండోయ్! ఒక్కసారి మొదటి సంతానంగా అమ్మాయి జన్మించిన స్టార్ హీరోలు ఎవరో చూద్దాం!


ఒక్క అక్కినేని నాగార్జునకు తప్ప...
ఆ ముగ్గురికి మొదట అమ్మాయే!
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్... ఓ తరం అగ్ర కథానాయకులు. ఇప్పటి తరానికి, ఇంతకు ముందు తరానికి అభిమాన తారలు. ఆ నలుగురిలో నాగార్జునకు ఇద్దరూ అబ్బాయిలే! ఆయనకు అసలు అమ్మాయి లేరు. మిగతా ముగ్గురికి మొదటి సంతానం అమ్మాయే. 


సుస్మిత తర్వాత రామ్ చరణ్, శ్రీజ... చిరుకు ఇద్దరు పిల్లలు. బాలకృష్ణకు ఇద్దరు అమ్మాయిలు... బ్రాహ్మణి, తేజస్విని తర్వాత వారసుడు మోక్షజ్ఞ పుట్టారు. వెంకటేష్ తొలి సంతానం అమ్మాయే. ఆశ్రిత ఫుడ్  వ్లాగర్. ఇన్ఫినిటీ ప్లాటర్ పేరుతో సోషల్ మీడియాలో ఆమెకు ఓ పేజీ ఉంది. ఆశ్రిత తర్వాత వెంకీ ఇంట ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి అడుగు పెట్టారు. మోహన్ బాబుకు సైతం లక్ష్మీ మంచు (తొలి సంతానం) తర్వాత ఇద్దరు అబ్బాయిలు పుట్టారు. 


తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితులైన తమిళ కథానాయకులు రజనీకాంత్, కమల్ హాసన్... ఇద్దరికీ అబ్బాయిలే లేరు. శృతి, అక్షర... కమల్ హాసన్ కుమార్తెలు కథానాయికలుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. సౌందర్య, ఐశ్వర్య... రజని కుమార్తెలు దర్శకులుగా రాణిస్తున్నారు. తెలుగులో రాజశేఖర్, జీవిత దంపతులకు సైతం ఇద్దరూ అమ్మాయిలే.


రామ్ చరణ్ తరానికి వస్తే...
చిరు తరం తర్వాత హీరోల్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబుకు మొదటి సంతానం అబ్బాయిలే. ఆ తర్వాత అమ్మాయిలు పుట్టారు. ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోలేదు అనుకోండి! రామ్ చరణ్ తోటి హీరోల్లో అల్లు అర్జున్ (Allu Arjun)కు మొదట అబ్బాయి అయాన్, ఆ తర్వాత అమ్మాయి అర్హ పుట్టారు. ఎన్టీఆర్ (Jr NTR)కు అయితే అభయ్ రామ్, భార్గవ్ రామ్... ఇద్దరూ అబ్బాయిలే!


తొలి సంతానం అమ్మాయి కలిగిన హీరోలకు వస్తే... రవితేజకు మొదట అమ్మాయి, ఆ తర్వాత అబ్బాయి. విష్ణు మంచుకు మొదట ఇద్దరు అమ్మాయిలు (కవలలు అరియనా, వివియానా) జన్మించారు. ఆ తర్వాత అబ్బాయి, అమ్మాయి పుట్టారు. 'అల్లరి' నరేష్, ఆది సాయి కుమార్... వీళ్ళకూ మొదటి సంతానం అమ్మాయిలే. దివంగత కథానాయకుడు తారక రత్నకు మొదట అమ్మాయి పుట్టింది. ఆ తర్వాత అమ్మాయి, అబ్బాయి పుట్టారు. ఈ లిస్టులో ఇంకొంత మంది యంగ్ హీరోలు ఉన్నారు. మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ మంచు, కృష్ణ కుమార్తె మంజుల ఒక్కో అమ్మాయితో సరిపెట్టుకున్నారు. చిరంజీవి కుమార్తెలు ఇద్దరికీ ఇద్దరేసి చొప్పున అమ్మాయిలు జన్మించారు. 


Also Read : 'టెంపర్' క్లైమాక్స్, 'కొమురం భీముడో' సాంగ్ మరొక హీరో అయితే చేసేవారా?


అనిల్ కపూర్, అజయ్ దేవగణ్, సైఫ్ అలీ ఖాన్, అభిషేక్ బచ్చన్, షాహిద్ కపూర్, రణబీర్ కపూర్... హిందీ చిత్రసీమలో ఈ హీరోలకూ తొలి సంతానం అమ్మాయిలే!


అమ్మాయి పుట్టిన తర్వాత అబ్బాయి జన్మించే అవకాశం లేదని రూల్ ఏమీ లేదు!పైన పేర్కొన్న కొందరు హీరోల్లో రెండో సంతానంగా లేదంటే ఆ తర్వాత వారసుడు పుట్టిన సందర్భాలు చూశాం! రామ్ చరణ్ (Ram Charan Daughter), ఉపాసన దంపతులకు రెండో సంతానంగా అబ్బాయి జన్మించవచ్చు. కాదని ఎవరు అనగలరు? లెట్స్ వెయిట్ అండ్ సీ!


Also Read : తెలుగు హీరోను డమ్మీ చేస్తే ఎలా? తమిళ క్యారెక్టర్ ఆర్టిస్టులే ఎక్కువా?