మెగా ఫ్యామిలీలో మహా లక్ష్మి అడుగుపెట్టింది. మంగళవారం తెల్లవారు జామున రామ్ చరణ్ భార్య ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ మేరకు వైద్యులు ప్రకటన విడుదల చేశారు. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా, పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ప్రకటనలో పేర్కొన్నారు. కుటుంబంలో మెగా ప్రిన్సెస్ అడుగు పెట్టిందంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

కాలభైరవ స్పెషల్ ట్యూన్ఉపాసన, రామ్ చరణ్ దంపతుల బిడ్డ కోసం యువ సంగీత దర్శకుడు, గాయకుడు కాల భైరవ అద్భుతమైన ట్యూన్ ను ఇంతకు ముందే రూపొందించాడు. ఈ ట్యూన్ విని  చిన్నారులు ఆనందంలో మునిగిపోయేలా ఉందని రామ్ చరణ్, ఉపాసన దంపతులు ట్వీట్ చేశారు. ఇంత చక్కటి ట్యూన్ క్రియేట్ చేసినందుకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. ఈ ట్యూన్ ను ట్వీటర్ ద్వారా వీడియో రూపంలో షేర్ చేశారు.

కాల భైరవ ట్యూన్ పై రామ్ చరణ్ దంపతులు ఉప్పొంగిపోయారు. “ఈ ట్యూన్ మా కోసం ప్రత్యేకంగా తయారు చేసినందుకు థ్యాంక్యూ కాల భైరవ. ఈ భూమ్మీద ఉన్న లక్షల మంది చిన్నారుల్లో ఈ మెలోడి ట్యూన్ సంతోషాన్ని, ఆనందాన్ని తీసుకొస్తుందని నమ్ముతున్నాం.” అని రామ్ చరణ్ ట్వీట్ చేశారు.

మరోవైపు రామ్ చరణ్ మూడు నెలల పాటు షూటింగ్‌లకు బ్రేక్ తీసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఉపాసన ప్రసవం నేపథ్యంలో వారికి పూర్తి టైం కేటాయించడానికి రామ్ చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీని గురించి ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు.

ఈ సమయంలో ఎలాంటి వర్క్ టెన్షన్స్ లేకుండా ఉండాలని రామ్ చరణ్ అనుకుంటున్నారని ఇండస్ట్రీ టాక్. అంతే కాదు ఈ సమయంలో ఉపాసనతో ఉండడం కుటుంబానికి చాలా ముఖ్యం కావున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిజానికి గత నెల నుంచే చెర్రీ షూటింగ్స్ కు దూరంగా ఉంటున్నారు.

ఈ లెక్కన చూసుకుంటే ఆగష్టు వరకు రామ్ చరణ్ ఎలాంటి షూటింగ్స్ లోనూ పాల్గొనరన్నమాట. దీంతో ‘గేమ్ ఛేంజర్’ సినిమా రిలీజ్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సినిమా కోసం అభిమానులు ఎదురుచూపులు చూడక తప్పకపోవచ్చు.