టాలీవుడ్ అగ్ర హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో, కృతి సనన్ సీతగా తెరకెక్కిన లేటెస్ట్ మైథాలజికల్ ఫిలిం 'ఆదిపురుష్' జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. మోషన్ క్యాప్చర్ 3D టెక్నాలజీ తో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను దక్కించుకుంది. సినిమా హిట్టా, ప్లాపా అనే విషయం పక్కన పెడితే.. ఆదిపురుష్ డైలాగ్స్ పై మరోసారి వివాదం చెలరేగింది. ముఖ్యంగా ఈ సినిమాలో దేవదత్త నగే పోషించిన హనుమంతుడి పాత్ర డైలాగులపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోని సినిమాలోని ఈ డైలాగులను రాసిన డైలాగ్ రైటర్ మనోజ్ ముంతశీర్ శుక్ల తనకు ప్రాణహాని ఉందంటూ తాజాగా ముంబై పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు ముంబై పోలీసులు సదరు డైలాగ్ రైటర్ మనోజ్ కి భద్రత కల్పించడంతోపాటు ప్రస్తుత పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
అయితే అంతకుముందు ఆదిపురుష్ డైలాగ్స్ పై మనోజ్ ముంతశీర్ మాట్లాడుతూ.. 'తాను రాసిన డైలాగ్స్ లో ఎటువంటి తప్పు లేదని, అంతకుముందు రామాయణం పై తెరకెక్కిన సినిమాల్లో మాదిరిగానే డైలాగులు రాశానని' క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా ఆ విమర్శలు ఆగలేదు. దాంతో అందరి మనోభావాలను పరిగణలోకి తీసుకుని జూన్ 18 నాటికి మూవీ డైలాగ్స్ ని మార్చాడానికి ఆదిపురుష్ మూవీ యూనిట్ నిర్ణయించింది. ఇలాంటి తరుణంలో ఆదిపురుష్ రైటర్ తనకు ప్రాణహాని ఉందంటూ ముంబై పోలీసులను ఆశ్రయించడం హాట్ టాపిక్ గా మారింది. కాగా ఆది పురుష్ సినిమాని ఓం రౌత్ రామాయణం ఆధారంగా తీశారు. ఇందులో శ్రీరాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫలీ ఖాన్ ముఖ్య పాత్రలు పోషించారు. అయితే ఒరిజినల్ స్టోరీ తో పోలిస్తే ఈ మూవీలో కొన్ని సన్నివేశాలు కాస్త భిన్నంగా ఉన్నాయి. దీనిపై సోషల్ మీడియా వేదికగా పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరికొందరైతే దర్శకుడు ఓం రౌత్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు.
దీంతో ఈ విషయమై మూవీ టీం స్పందిస్తూ తాము తీసింది సంపూర్ణ రామాయణం కాదని, కేవలం రామాయణాన్ని స్ఫూర్తిగా మాత్రమే తీసుకున్నామని క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా ఈ విమర్శలు ఏమాత్రం ఆగడం లేదు.ఇక ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆదిపురుష్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. మొదటి రోజు ఈ సినిమా ఏకంగా రూ.130 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకొని ప్రభాస్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని రాబట్టింది. ఇక ఆ తర్వాత రెండో రోజు రూ.240 కోట్ల గ్రాస్ అందుకున్న ఈ సినిమా మూడో రోజు వచ్చేసరికి మరో రూ.100 కోట్లను కొల్లగొట్టి రూ.300 కోట్ల క్లబ్లో చేరింది. అంతేకాకుండా మూడో రోజు హిందీలో ఈ సినిమాకి ఏకంగా రూ.40 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ రావడం విశేషం. మూడో రోజుకి ప్రపంచవ్యాప్తంగా రూ.340 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ మూవీ లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. కాగా రెట్లో ఫైల్స్ సమర్పణలో బాలీవుడ్ అగ్ర నిర్మాత భూషణ్ కుమార్ టి సిరీస్ బ్యానర్ పై సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మించగా, బాలీవుడ్ సంగీత ద్వయం అజయ్ - అతుల్ స్వరాలు సమకూర్చారు.
Also Read: వివాదాలను లెక్కచేయని ప్రేక్షకులు - రూ.350 కోట్లకు చేరువైన 'ఆదిపురుష్'