Chiranjeevi : మెగా ఇంట సంబరాలు మొదలైయ్యాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న తరుణం రానే వచ్చింది. చిరంజీవి ఇంట మహాలక్ష్మి అడుగుపెట్టింది. రామ్ చరణ్ తండ్రైయ్యాడు. ఈరోజు(జూన్ 20) తెల్లవారుజామున మెగా కోడలు ఉపాసన పండంటి పాపకు జన్మనిచ్చింది. హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన డెలివరీ జరిగింది. మనవరాలి రాకతో చిరంజీవి ఇంట సందడి మొదలైంది. ఆయన ఆనందానికి అవధుల్లేవు. ఈ శుభవార్తను తన అభిమానులతో షేర్ చేసుకున్నారు మెగాస్టార్. తనకు మనవరాలు పుట్టిందని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు చిరు. ప్రస్తుతం ఆయన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. 


లిటిల్ మెగా ప్రిన్సెస్ కి స్వాగతం అంటూ ట్వీట్..
 
మెగాస్టార్ చిరంజీవి తాతయ్య పోస్ట్ కు ప్రమోట్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ లో ఆయన ఇలా రాసుకొచ్చారు.. ‘‘లిటిల్ మెగా ప్రిన్సెస్ కు స్వాగతం. నీ రాకతో మెగా ఫ్యామిలీతోపాటు కోట్లాది మందిలో ఆనందాన్ని నింపావు. రామ్ చరణ్-ఉపాసనలను తల్లిదండ్రులుగా, మమ్మల్ని గ్రాండ్ పేరెంట్స్ గా సంతోషించేలా చేశావు. ఇది మాకెంతో గర్వకారణం’’ అంటూ ట్వీట్ చేశారు చిరు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన మెగా అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. మెగా ఫ్యామిలీకు శుభాకాంక్షలు అంటూ కామెంట్లు చేస్తున్నారు. 


తెల్లవారుజామున 4 గంటలకు..


ఉపాసన డెలివరీ డేట్ ప్రకటించినప్పటినుంచీ అందరిలోనూ ఆసక్తి నెలకొంది. డెలివరీకు రోజులు దగ్గరపడుతున్నకొద్దీ మెగా ఫ్యామిలీతో పాటు అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. ఇక జూన్ 20 నే ఉపాసనకు డెలివరీ అవ్వొచ్చు అనే వార్తలు కూడా వచ్చాయి. అందరూ అనుకున్నట్టుగానే మంగళవారం(జూన్ 20) తెల్లవారుజామున 4 గంటలకు ఉపాసన పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ మేరకు అపోలో వైద్యుల బృందం హెల్త్ బులిటెన్ ను ప్రకటించింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్టు బులిటెన్ లో పేర్కొంది. దీంతో మెగా ఇంట సంబరాలు మొదలైయ్యాయి. ఇక రామ్ చరణ్ నిన్నటి నుంచీ అపోలో ఆసుపత్రిలోనే భార్య ఉపాసన వెంట ఉన్నారు. అలాగే చిరంజీవి ఫ్యామిలీ కూడా ఆసుపత్రికి చేరుకుంది. ఆ విజువల్స్ వైరల్ అయ్యాయి.


షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చిన రామ్ చరణ్..


మరోవైపు రామ్ చరణ్ మూడు నెలల పాటు షూటింగ్‌లకు బ్రేక్ తీసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఉపాసన ప్రసవం నేపథ్యంలో వారికి పూర్తి టైం కేటాయించడానికి రామ్ చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీని గురించి ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు. అయితే ఎలాంటి వర్క్ టెన్షన్ లు లేకుండా తన కూతురితో సమయాన్ని గడపాలని చర్రీ అనుకుంటున్నారని అందుకే ఈ బ్రేక్ అని ఫిల్మ్ వర్గాల్లో టాక్. అంతేకాకుండా ఈ సమయంలో ఉపాసనతో ఉండటం చాలా ముఖ్యం. అందుకే నెల రోజుల ముందు నుంచే ఆయన షూటింగ్ లకు దూరంగా ఉంటున్నారని సమాచారం. రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ చేంజర్’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. 


Also Read రామ్ చరణ్‌ ఇంట మాత్రమే కాదు, ఈ స్టార్ హీరోల ఇంట్లోనూ మొదటి సంతానం అమ్మాయే