అమర్ దీప్ చౌదరి (Amardeep Chowdary) గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తొలుత యూట్యూబ్ ఫిలిమ్స్ చేశారు. అయితే, 'జానకి కలగనలేదు' సీరియల్ ఆయనకు ఎక్కువ గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత 'బిగ్ బాస్', డ్యాన్స్ రియాలిటీ షో, 'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' షోతో మరింత దగ్గర అయ్యారు. ఇప్పుడు హీరోగా సినిమాలు చేయడం మీద కాన్సంట్రేషన్ చేశారు. అమర్ దీప్ చౌదరి హీరోగా కొత్త సినిమా దసరాకు ప్రారంభం అయ్యింది.
అమర్ దీప్ చౌదరి హీరోగా 'నా నిరీక్షణ'
Naa Nireekshana Movie: తెలుగు చిత్రసీమలో అగ్ర నిర్మాతలు సురేష్ బాబు, 'దిల్' రాజు చేతుల మీదుగా విజయదశమికి 'నా నిరీక్షణ' సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయ్యింది.
'నా నిరీక్షణ'ను పికాక్ మూవీ మేకర్స్ పతాకంపై పి. సంతోష్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో అమర్ దీప్ చౌదరి సరసన యంగ్ హీరోయిన్ లిషి గణేష్ కల్లపు నటిస్తున్నారు. చైతన్య వర్మ, రమ్య ప్రియ ప్రధాన తారాగణం. సాయి వర్మ దాట్ల దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ బాబు ఆశీస్సులతో ముహూర్తపు కార్యక్రమాలు జరిగాయి. పూజా కార్యక్రమాల అనంతరం హీరో హీరోయిన్ల మీద చిత్రీకరించిన తొలి సన్నివేశానికి 'దిల్' రాజు క్లాప్ ఇవ్వగా... చిత్ర బృందానికి నటుడు రాజా రవీంద్ర స్క్రిప్ట్ అందజేశారు. నిర్మాత గణపతి రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
బిగ్ బాస్ తర్వాత ఎంపిక చేసిన కథ!
'నా నిరీక్షణ' ప్రారంభోత్సవంలో అమర్ దీప్ చౌదరి మాట్లాడుతూ... ''ఈ సినిమా కథ మీద దర్శక నిర్మాతలు ఏడు నెలలు పని చేశారు. 'బిగ్ బాస్' నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఎంపిక చేసుకున్న మొదటి కథ ఇది. నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్'' అని చెప్పారు. అమర్ దీప్ చౌదరి, నటి సురేఖా వాణి కుమార్తె సుప్రీతా నాయుడు జంటగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
Also Read: చిరంజీవి షూస్ చూడటానికి సింపులే... కానీ, కొనాలంటే ఎంత రేటో తెలుసా?
విజయదశమి రోజున తమ చిత్ర బృందాన్ని ఆశీర్వదించేందుకు వచ్చిన సురేష్ బాబు, 'దిల్'కు దర్శకుడు సాయి వర్మ దాట్ల థాంక్స్ చెప్పారు. కథ గురించి ఇప్పుడు చెప్పలేనని, తాము ఓ మంచి చిత్రాన్ని చేస్తున్నామని తెలిపారు. కథానాయికగా తనకు రెండో చిత్రమిదని, తనకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు హీరోయిన్ లిపి గణేష్ కల్లపు థాంక్స్ చెప్పారు. నటుడు చైతన్య వర్మ మాట్లాడుతూ... ''ఇంతకు ముందు నన్ను 'హిట్', 'ఝాన్సీ', 'సరెండర్' సినిమాల్లో ప్రేక్షకులు చూశారు. ఈ సినిమాలో మరో మంచి పాత్ర చేస్తున్నాను. ప్రేక్షకులు మా చిత్ర బృందాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నా'' అని అన్నారు.
అమర్ దీప్ చౌదరి, చైతన్య వర్మ, లిషి గణేష్ కల్లపు, రమ్య ప్రియ తదితరులు యాక్ట్ చేస్తున్న ఈ సినిమాకు మాటలు: తిరుమలేష్ బండారు, ఛాయాగ్రహణం: వి. రవి కుమార్, సంగీత దర్శకుడు: శేఖర్ చంద్ర, నిర్మాణ సంస్థ: పీకాక్ మూవీ మేకర్స్, నిర్మాత: పి. సంతోష్ రెడ్డి, కథ - కథనం - దర్శకత్వం: సాయి వర్మ దాట్ల.