మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ (Aamir Khan) ... ఈ కాంబినేషన్‌లో సినిమాను ఎప్పుడైనా ఊహించామా? కానీ, కుదిరింది. అయితే... అదొక డబ్బింగ్ ఫిల్మ్ మాత్రమే! ఆమిర్ నటించిన 'లాల్ సింగ్ చడ్డా' (Laal Singh Chaddha) తెలుగు వెర్షన్ మెగాస్టార్ చిరంజీవి సమర్పణలో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 11న (ఈ గురువారం) సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా చిరంజీవి, ఆమిర్ ఖాన్, అక్కినేని నాగ చైతన్యలను కింగ్ నాగార్జున ఇంటర్వ్యూ చేశారు. అందులో నలుగురు స్టార్స్ పలు ఆసక్తికరమైన అంశాలు పంచుకున్నారు.
జపాన్ ఎయిర్‌పోర్ట్‌లో కుదిరిన 'లాల్' మైత్రి
చిరంజీవి, సురేఖ దంపతులు 2019లో జపాన్ వెళ్లారు. అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో అనుకోకుండా ఆమిర్ ఖాన్‌ను కలిశారు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య చాలా అంశాలు చర్చకు వచ్చాయి. చిరుకు టామ్ హాంక్స్ నటించిన 'ఫారెస్ట్ గంప్' రీమేక్ చేయాలని ఉందని తన మనసులో కోరికను ఆమిర్ వివరించారు. తెలుగులో సమర్పకుడిగా వ్యవహరించాలని కోరితే సంతోషంగా ఒప్పుకొన్నానని చిరంజీవి చెప్పారు.
ఆమిర్ 'చిరు' సినిమా కోరిక!
చిరంజీవితో ఒక సినిమా చేయాలని ఉందని ఆమిర్ ఖాన్ తెలిపారు. ఆల్రెడీ విడుదలైన ప్రోమోలో ఆ విషయం ఉంది. ఎటువంటి సినిమా చేయాలని ఉందనేది నేడు విడుదలైన పూర్తి ఇంటర్వ్యూలో ఉంది. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయాలని ఉందని ఆమిర్ చెప్పారు. ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ హైలైట్ అయ్యేలా చేస్తానని అన్నారు. ఆ తర్వాత 'నో యాక్షన్, నో డ్యాన్స్' అన్నారు. వెంటనే 'డ్యాన్సులు, ఫైట్లకు చిరంజీవి ఫేమస్' అని నాగార్జున అన్నారు. అంటే... తనది రాంగ్ ఛాయస్ అంటారా? అని ఆమిర్ ప్రశ్నించారు. 'అవును' అన్నట్టు నాగార్జున నవ్వేశారు. తనతో సినిమా చేయాలని ఉందని చెప్పినప్పుడు 'టేక్ వన్ ఓకే కాదు కదా' అంటూ ఆమిర్ వైపు చిరు చూడటం సరదాగా ఉంది. ఇంటర్వ్యూ అంతా సరదా సరదాగా సాగింది.
Also Read : ఏడో తరగతిలో ప్రేమలో పడిన మెగాస్టార్ చిరంజీవి
ఆమిర్ సినిమా రీమేక్ చేయాల్సి వస్తే... : మెగాస్టార్ చిరంజీవి
ఆమిర్ ఖాన్ సినిమా రీమేక్ చేయడం లేదంటే ఆమిర్ చేసిన పాత్రల్లో ఏదైనా చేయడం తన వల్ల కాదని చిరంజీవి చెప్పారు. ''ఆమిర్ సినిమాల్లో ఏదైనా రీమేక్ చేయాలంటే... నా విషయంలో మాత్రం అది ఎదురు దెబ్బే'' అని చిరంజీవి అన్నారు. ఒకవేళ చేయాలనుకుంటే... సల్మాన్ ఖాన్‌తో కలిసి కెరీర్ ప్రారంభంలో ఆమిర్ చేసిన 'అందాజ్ అప్నా అప్నా' చేస్తానని, అందులో క్యారెక్టర్ సరదాగా ఉంటుందని, తనకు సూట్ అవుతుందని మెగాస్టార్ పేర్కొన్నారు (Chiranjeevi Has No Issues To Remake Andaz Apna Apna). ఈ ఇంటర్వ్యూలోనే తాను ఏడో తరగతి చదువుతున్నప్పుడు మొగల్తూరులో ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డానని చిరంజీవి తెలిపారు.
Also Read : ‘మహీ, నా జీవితంలో వెలుగులు నింపావ్’ - భర్తకు నమ్రతా విషెస్, సూపర్ స్టార్‌కు చిరు, రోజా ట్వీట్స్!