సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu)... సెల్ఫ్ మేడ్ స్టార్! తండ్రి ఘట్టమనేని కృష్ణ అడుగు జాడల్లో నడుస్తూ... సినిమా పరిశ్రమలో ఆయన అడుగు పెట్టి ఉండవచ్చు. కానీ, ఇవాళ ఆయన ఉన్న స్థానానికి చేరుకోవడం వెనుక ఆయన కృషి ఎంతో ఉంది. కథల ఎంపికలో, పాత్రల ఎంపికలో మహేష్ చూపిన వైవిధ్యం ఉంది. తనకు తానుగా మహేష్ బాబు రెండు రూల్స్ పెట్టుకున్నారు. ఎవరు ఒత్తిడి తీసుకు వచ్చినా, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ రెండు విషయాల్లో ఆయన నిర్ణయం ఇప్పటి వరకూ మారలేదు. అవి ఏంటో తెలుసా?


నో రీమేక్స్ ప్లీజ్!
మహేష్ బాబు కెరీర్ చూడండి... ఒక్కటి అంటే ఒక్క రీమేక్ సినిమా కూడా కనిపించదు. ఎందుకో తెలుసా? రీమేక్స్‌కు సూపర్ స్టార్ వ్యతిరేకం! ఒరిజినల్ కథలు చెప్పడానికి ట్రై చేస్తారు. అలాగని, రీమేక్ చేసే హీరోలను ఆయన తక్కువ ఏమీ చేయరు. ఆల్రెడీ చెప్పిన కథలను మళ్ళీ చెప్పడం, ఒకరు చేసిన పెర్ఫార్మన్స్ రిపీట్ చేయడం ఆయనకు ఇష్టం ఉండదు.


ఒకానొక సందర్భంలో రీమేక్స్ గురించి మహేష్ బాబు మాట్లాడుతూ ''నేను రీమేక్స్ ఎందుకు చేయను అంటే... ఆల్రెడీ ఒక సినిమా చూసిన తర్వాత సెట్స్ కు వెళితే? నాకు అందులో హీరో కనిపిస్తారు. ఆ హీరో చేసినట్టు చేయాలా? లేదంటే సొంతంగా చేయాలా? ఎలా చేయాలి? ఒక క‌న్‌ఫ్యూజ‌న్‌ స్టేట్‌లో ఉంటాను. అందుకే అవాయిడ్ చేస్తాను'' అని చెప్పారు. ఆయన సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ కావాలని ఆశిస్తున్నట్టు మరొక సందర్భంలో చెప్పారు.


శంకర్‌తో చేయకపోవడానికి కారణం అదే!
ఆమిర్ ఖాన్, మాధవన్, షర్మాన్ జోషి ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ సినిమా 'త్రీ ఇడియట్స్'. తమిళంలో విజయ్ హీరోగా సౌత్ ఇండియన్ స్టార్ దర్శకుడు శంకర్ ఆ సినిమాను రీమేక్ చేశారు. తెలుగులో 'స్నేహితుడు' పేరుతో అనువదించి విడుదల చేశారు. నిజానికి, ఆ రీమేక్ ఆఫర్ ముందు మహేష్ బాబు దగ్గరకు వచ్చింది. అయితే... నో రీమేక్స్ పాలసీ కారణంగా శంకర్ డైరెక్షన్ అయినప్పటికీ 'నో' చెప్పేశారు సూపర్ స్టార్.


కృష్ణ సినిమాలూ వద్దు!
మహేష్ తండ్రి, ఒకప్పటి సూపర్ స్టార్ కృష్ణ ఘట్టమనేని మూడు వందలకు పైగా సినిమాల్లో నటించారు. ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు. తెలుగు తెర కౌబాయ్ అంటే కృష్ణ గుర్తుకు వస్తారు. జేమ్స్ బాండ్ తరహా గూఢచారి ఎవరు? అంటే కృష్ణే గుర్తుకు వస్తారు. అల్లూరి పాత్రకు తొలి తరం పేటెంట్ రైట్స్ కృష్ణవే అని చెప్పాలి. అటువంటి పాత్రల్లో మహేష్ బాబును చూడాలనేది ఘట్టమనేని ఫ్యాన్స్ కోరిక. అయితే... తండ్రి చేసిన పాత్రలు మళ్ళీ చేయడానికి, తండ్రి సినిమాలు రీమేక్ చేయడానికి కూడా మహేష్ బాబు సుముఖత వ్యక్తం చేయరు.


'టక్కరి దొంగ'లో మహేష్ బాబు కౌబాయ్ రోల్ చేశారు మహేష్. ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. కృష్ణ పాత్రలు చేయకూడదని, ఆయన సినిమాలు రీమేక్ చేయకూడదని అనుకోవడానికి కారణం ఆ సినిమానా? కాదా? అన్నది తెలియదు. కానీ, మహేష్ నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు.


Also Read: రీల్ హీరో to రియల్ హీరో: మహేష్ బాబు గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?


అన్నట్టు... మహేష్ బాబుకు మరో రూల్ కూడా ఉంది! తన సినిమాల ఓపెనింగ్ కార్యక్రమాలు, పూజకు ఆయన అటెండ్ అవ్వరు. ఒకసారి అటెండ్ అయిన సినిమా ఫ్లాప్‌ కావడంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీ ఖబర్. మహేష్ బదులు ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ లేదా కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు అటెండ్ అవుతారు. అదీ సంగతి!


Also Read : రికార్డుల వేటకు రజనీ 'జైలర్' రెడీ - ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంత రావచ్చు?