తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొన్ని రోజులుగా షూటింగులు నిలిచిపోయాయి. ఇది ప్రేక్షకులకూ తెలిసిన విషయమే. ఎందుకు షూటింగులు ఆపేశారనేది కూడా అందరికీ తెలుసు. పరాజయాల శాతం ఎక్కువ కావడంతో దానికి కారణాలు అన్వేషించే పనిలో రెగ్యులర్‌గా సినిమాలు తీసే నిర్మాతలు పడ్డారు. అగ్ర హీరోల రెమ్యూనరేషన్స్ నుంచి రోజూ వారి కార్మికుల వేతనాలు, ఓటీటీల ప్రభావం వరకూ పలు అంశాలపై చర్చలు జరుపుతున్నారు. ఈ ప్రయత్నాలకు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మద్దతు కూడగట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
 
బాలకృష్ణను కలవడం కోసం ఒక కమిటీ!
నందమూరి బాలకృష్ణను కలిసి నిర్మాతల సమస్యలు తెలియజేయడంతో పాటు పరిశ్రమకు ఏది మంచిది? ఏం చేస్తే బావుంటుంది? అని ఆయన నుంచి సలహాలు స్వీకరించడం కోసం ఒక కమిటీ వేసినట్లు తెలుస్తోంది. నిర్మాతల నుంచి ఏర్పాటు అయిన ఈ కమిటీలో బాలయ్యతో 'ఆదిత్య 369' వంటి సూపర్ డూపర్ క్లాసిక్ హిట్ సినిమా తీసిన నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్, షైన్ స్క్రీన్స్ అధినేతలలో ఒకరు అయిన సాహూ గారపాటి ఉన్నారని సమాచారం. వాళ్ళిద్దరితో పాటు మరో ముగ్గురు ఉన్నారట. 


కమిటీలో 'దిల్' రాజు ఎందుకు లేరు?
నిర్మాతల తరపున వేసిన కమిటీలో ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు లేకపోవడం చర్చనీయాంశం అవుతోంది. నిజానికి, కొన్ని రోజులుగా ప్రొడ్యూసర్స్ గిల్డ్ కావచ్చు? తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కావచ్చు? లేదంటే ఫిల్మ్ ఛాంబర్ నుంచి కావచ్చు? జరుగుతున్న చర్చల్లో 'దిల్' రాజు ముఖ్య భూమిక పోషిస్తున్నారు.  బాలకృష్ణ దగ్గరకు వెళుతున్న నిర్మాతల్లో ఆయన లేకపోవడం ఏంటి? అని ఫిల్మ్ నగర్ వర్గాల్లో కొందరు చర్చించుకుంటున్నారు.


షూటింగులు ఆపడానికి బాలకృష్ణ సుముఖంగా లేరా?
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఒక సినిమా నిర్మిస్తున్నారు. నిర్మాతలు తీసుకున్న నిర్ణయం వల్ల ఆ సినిమా చిత్రీకరణను తాత్కాలికంగా నిలిపివేశారు. షూటింగ్ ఎందుకు చేయడం లేదని నిర్మాతలను బాలకృష్ణ అడిగినట్లు ఇండస్ట్రీ గుసగుస. షూటింగ్స్ ఆపడానికి ఆయన సుముఖంగా లేరట! అందుకని, ఆయన మద్దతు కోసం కమిటీ వేసినట్లు తెలుస్తోంది. 


Also Read : ఏకంగా పది తెలుగు సినిమాలు - ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి వీటిదే


ఎవరికీ వ్యక్తిగత ఎజెండాలు లేవు : 'దిల్' రాజు
షూటింగులు తాత్కాలికంగా నిలిపివేయడానికి కారణం 'దిల్' రాజు అని కొందరు నిర్మాతలలో ఫీలింగ్ ఉంది. కొందరు బహిరంగంగా విమర్శించారు కూడా! ఈ విషయంలో కొన్ని రోజుల క్రితం 'దిల్' రాజు స్పష్టత ఇచ్చారు. ఇక్కడ ఎవరికీ వ్యక్తిగత ఎజెండాలు లేవని ఆయన చెప్పారు. నిర్మాతల మండలి తరఫున సి. కళ్యాణ్ వంటి వారు కూడా గిల్డ్ అని, మరొకటి అని రాయవద్దని విజ్ఞప్తి చేశారు. చర్చలు అన్నీ ఫిల్మ్ ఛాంబర్ నుంచి జరుగుతున్నాయని చెప్పారు. 


Also Read : ఏ వయస్సులో చేయాల్సినవి ఆ వయస్సులో చేయాలి - ప్రగతిపై పంచ్