నందమూరి తారక రామారావు (NT Rama Rao - Sr NTR) నటించిన 100వ సినిమా. కానీ, నిక్కరుతో కనిపిస్తారట. అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao - ANR) తన భార్యను బాధలు పెట్టేవాడిగా నటించారట. పౌరాణికాలు తీసుకునే కమలాకర కామేశ్వర రావు సాంఘిక సినిమా తీస్తే ఇలానే ఉంటుంది. అసలు, తెలుగు సినిమాకు రెండు కళ్ళలాంటి అగ్ర కథానాయకులు నటించిన సినిమాకు సూర్యకాంతం క్యారెక్టర్ పేరు టైటిల్‌లో వచ్చేలా 'గుండమ్మ కథ' పేరేంటి? - ఇవన్నీ సినిమా విడుదలకు ముందు ఆనాటి సినిమా పేజీల్లోనూ... ఇండస్ట్రీలోనూ వినిపించిన వార్తలు. అయితే, సినిమా విడుదలయ్యాక మాత్రం అన్ని అనుమానాలూ పటాపంచలు అయ్యాయి. టాలీవుడ్ ఆల్ టైం బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలవడమే కాదు... తెలుగులో రూపొందిన అత్యంత గొప్ప క్లాసిక్స్‌లో టాప్ 5లో ఉంటుందీ సినిమా.
ఇప్పటికీ టీవీలో 'గుండమ్మ కథ' (Gundamma Katha) వస్తుంటే పనులన్నీ పక్కన పెట్టి ఇంటిల్లపాదీ టీవీ ముందు కూర్చుంటున్నారు. అదీ ఎన్టీఆర్ - ఏఎన్నార్ నటించిన గుండమ్మ పవర్. ఆ సినిమా రిలీజై సరిగ్గా నేటికి 60 ఏళ్ళు పూర్తయింది. జూన్ 7, 1962లో సినిమా విడుదలైంది.
గుండమ్మ అసలు తెలుగు పేరే కాదు!
నిజానికి గుండమ్మ అనేది తెలుగు పేరు కానేకాదు. ఆ పేరు కన్నడ సీమలో కనపడే పేరు. అయినప్పటికీ... ఈ సినిమా విడుదల తర్వాత గుండమ్మ పేరు తెలుగునాట అలవాటు అయిపోయింది. ఈ సినిమా ఒరిజినల్ కూడా కన్నడ నుంచి వచ్చిందే. తెలుగులో అనేక జానపద సినిమాలు తీసి ఎన్టీఆర్, కాంతారావుకు మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన దర్శకుడు విఠలాచార్య కన్నడలో 'మనె తుంబిద హెణ్ణు' అని ఒక సినిమా తీశారు. విజయా ప్రొడక్షన్స్ అధినేతల్లో ఒకరైన నాగిరెడ్డికి ఆ సినిమా నచ్చి రైట్స్ తీసుకుని తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు. దీని కోసం ముందు ఒకరిద్దరు డైరెక్టర్లను అనుకున్నా... వారికి ఈ కథ, ట్రీట్మెంట్ నచ్చలేదు. దాంతో నాగిరెడ్డి తన పార్ట్‌నర్, చక్కన్నగా పిలవబడే చక్రపాణికి బాధ్యతలు అప్పగించారు. అయితే, కన్నడ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పిచ్చివాడిగా ఉంటుంది. అలాగే, గుండమ్మ భర్త పాత్ర నోరు లేనివాడిగా ఉంటుంది. చక్రపాణికి అవి నచ్చలేదు. దాంతో టోటల్ స్క్రీన్ ప్లే మార్చేశారు. ఎన్టీఆర్ పాత్ర అమాయకుడైన పనివాడిగా కనిపిస్తే... గుండమ్మ పాత్ర విధవరాలైన గయ్యాళిగా మారింది. ఈ క్రొత్త స్క్రిప్ట్‌ను విలియం షేక్స్ స్పియర్ రాసిన 'ద టేమింగ్ ఆఫ్ ద షూ' నాటకంలో కథానాయికల పాత్రలను, వారి స్వభావాలను ఆధారం చేసుకుని చక్రపాణి రాశారు. ఇక, డైలాగ్స్ కోసం హాస్యాన్ని అద్భుతంగా రాయగల డీవీ నరసరాజును తీసుకున్నారు. డైరెక్షన్ చేయమని కమలాకర కామేశ్వర రావును సంప్రదించారు. అప్పటికి ఆయనకు పౌరాణిక చిత్రాల దర్శకుడిగా మాత్రమే పేరుంది. అయితే, ఆయన లాంటి వారు సాంఘిక సినిమా తీస్తే ఫ్రెష్ గా ఉంటుందని చక్కన్న ఫీల్ అయ్యారు. ఇక, సినిమా టైటిల్ కోసం రకరకాల పేర్లు అనుకున్నా... కన్నడ సినిమాలోని పాత్ర పేరు నాగిరెడ్డికి బాగా నచ్చడంతో సినిమాకు 'గుండమ్మ కథ' అని పెట్టారు. హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్ కూడా ఆ పేరుకే ఓటేయడంతో సినిమా రూపకల్పనకు సర్వం సిద్ధమైంది. గుండమ్మ పాత్రకు కూడా అందరి ఓటు సూర్యకాంతానికే పడింది. ఇక హీరోయిన్లుగా సావిత్రి, జమునలు నటించగా... మరో జంటగా హరనాథ్, ఎల్. విజయలక్ష్మి నటించారు. ఇతర ప్రధాన పాత్రల్లో ఎస్వీ రంగారావు, రమణారెడ్డి, రాజనాల, ఛాయాదేవి, అల్లు రామలింగయ్య నటించారు.
తెలుగులో ఎన్టీఆర్‌కు...
తమిళంలో ఏఎన్నార్‌కు...
100వ సినిమా 'గుండమ్మ కథ'
ఎన్టీఆర్‌కు 'గుండమ్మ కథ' 100వ సినిమా. విశేషం ఏమిటంటే... ఏఎన్నార్‌కూ ఇది వందో సినిమా కథ. అయితే, తెలుగు సినిమాతో కాదు. తమిళ సినిమాతో! తమిళంలో కూడా విజయా వారే 'మనితాన్ మరవిల్లై' పేరుతో 'గుండమ్మ కథ'ను రీమేక్ చేసారు. దీనికి స్వయంగా చక్రపాణే దర్శకత్వం వహించారు. 'గుండమ్మ కథ' విడుదలైన ఒక్కరోజు తర్వాత... 8 జూన్ 1962న 'మనితాన్ మరవిల్లై' విడుదలైంది. విచిత్రంగా ఇది అక్కినేని నాగేశ్వర రావుకు 100వ సినిమా. ఆ విధంగా తెలుగు సినిమాకు రెండు కళ్ళ లాంటి మహానటులు ఇద్దరికీ గుండమ్మ కథే 100వ సినిమా. తమిళంలో సావిత్రి, అక్కినేని, జమున పాత్రల్లో వారే నటించగా... ఎన్టీఆర్ పాత్రలో 'జెమిని' గణేశన్ నటించారు. తెలుగులో 'గుండమ్మ కథ' సూపర్ హిట్ అయితే... తమిళంలో మాత్రం అంతగా ఆడలేదు. ఈ కథను హిందీలో రీమేక్ చేద్దామనుకున్నా... అది సాధ్యపడలేదు.
గుండమ్మ లేక ఆగిన తెలుగు రీమేక్
'గుండమ్మ కథ'ను రీమేక్ చేయడానికి ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు నాగార్జున 90ల్లో ప్రయత్నించారు. కానీ, గుండమ్మ పాత్ర పోషించగల నటి లేక ఆ ఆలోచనను పక్కన పెట్టేశారు. ''గయ్యాళితనం, భోళాతనం, అమాయకత్వం, పిసినారితనం అన్నీ కలిసిన ఆ పాత్రను సూర్యకాంతం స్థాయిలో పోషించే నటిని ఎక్కడి నుంచి తేవాలి'' అంటూ నాగార్జున చాలా సార్లు పేర్కొన్నారు. ఇక, 2012లో దిగ్గజ నిర్మాత డి. రామానాయుడు కూడా ఎన్టీఆర్, అక్కినేని మూడో తరం నట వారసులు జూ .ఎన్టీఆర్, నాగచైతన్యతో 'గుండమ్మ కథ'ను రీమేక్ చేయాలనుకున్నా... అక్కడా ఇదే సమస్య రావడంతో ఆ ప్రయత్నాలూ ఆగిపోయాయి.
ప్రముఖ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు 'గుండమ్మ కథ'ను తన కుమారుడు విష్ణు మంచు, రాజ్ తరుణ్‌తో రీమేక్ చేస్తామని 2016లో ప్రకటించారు. దానికి జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తారని చెప్పినా... అదీ ఇంత వరకూ కార్యరూపం దాల్చలేదు.
పాటలన్నీ సూపర్ హిట్టే!
'గుండమ్మ కథ'కు అమర గాయకుడు ఘంటసాల సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని 8 పాటలనూ పింగళి నాగేంద్ర రావు రాయగా... అన్నీ క్లాసిక్స్ అయ్యాయి. ముఖ్యంగా 'లేచింది మహిళా లోకం...', 'మనిషి మారలేదూ...', 'ప్రేమ యాత్రలకు బృందావనమూ...' పాటలు వినని తెలుగు వారు లేరంటే ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
Also Read: తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !
తెలుగు సినీ ప్రేక్షకులకు మృష్టాన్న భోజనం 'గుండమ్మ కథ'
తెలుగు సినిమా ఆల్ టైం క్లాసిక్స్‌లో 'మాయాబజార్', 'మిస్సమ్మ', 'పాతాళ భైరవి' లాంటి సినిమాల సరసన చేరిన సినిమా 'గుండమ్మ కథ'. విజయ - వాహిని సంస్థ తెలుగు సినిమాకు అందించిన ఈ చిత్రాన్ని ఒక్కసారైనా చూడని తెలుగు సినీ ప్రేక్షకుడు ఉండడు. 'అల్లుడరికం...', 'ఆశకు చావులేదు...', 'పాలల్లో నీళ్లు కలపక పెట్రోల్ కలుపుతారా' లాంటి సెటైరికల్ డైలాగ్స్‌ను పరిచయం చేసింది ఈ సినిమా. హాస్యానికి పెద్దపీట వేసినా... నవరసాలూ టచ్ చేస్తూ వెళుతుందీ కథ. తెలుగు వాళ్ళ ఇంటిల్లిపాదికీ ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టించని విందు భోజనం ఈ సినిమా. అందుకే, తెలుగు సినిమా స్వర్ణయుగానికి ఆనవాళ్లుగా నిలిచిన చిత్ర రాజాల్లో 'గుండమ్మ కథ' తన స్థానాన్ని శాశ్వతం చేసుకుంది.
Also Read: కృష్ణుడిగా 17 సినిమాల్లో - ఎన్టీ రామారావు సినీ జీవితంలో ఈ విశేషాలు మీకు తెలుసా?