సినిమా ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ ఎంతగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ విషయంలో ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు ఓపెన్ కామెంట్స్ చేశారు. హీరోలను ట్రీట్ చేసినట్లు హీరోయిన్లను చూడరని.. రెమ్యునరేషన్ విషయంలో కూడా చిన్నచూపు చూస్తారని కంగనా, తాప్సి లాంటి హీరోయిన్లు సందర్భం వచ్చిన ప్రతీసారి మాట్లాడుతూనే ఉంటారు. ఇక కమర్షియల్ సినిమాల్లో హీరోల పక్కన జస్ట్ గ్లామర్ డాల్ గా ఉండడానికి మాత్రమే హీరోయిన్లను తీసుకుంటారు. 

 

అయితే ఇప్పుడిప్పుడే మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమాలు వస్తున్నాయి. ఇది మంచి పరిణామమే. అయితే ఏ హీరో కూడా తనను తక్కువ చేసుకొని హీరోయిన్ ని పొగడరు. సినిమా క్రెడిట్ లో ఎక్కువ శాతం హీరోలకే దక్కాలని చూస్తుంటారు. కానీ యంగ్ హీరో రానా మాత్రం తన కోస్టార్ సాయిపల్లవి ఓ రేంజ్ లో పొగిడేశారు. 'విరాటపర్వం' సినిమాలో హీరో తను కాదని సాయిపల్లవి అని చెప్పుకొచ్చారు. 

 

రానా, సాయిపల్లవి జంటగా నటించిన 'విరాటపర్వం' సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే సినిమా నుంచి పాటలు, ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. అప్పటివరకు లేని బజ్ ను తీసుకొచ్చింది. ట్రైలర్ లో సాయిపల్లవి క్యారెక్టర్ ని బాగా చూపించారు. సినిమా కూడా ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుందనిపిస్తుంది. 

 

ఈ విషయాన్ని రానా కన్ఫర్మ్ చేశారు. 'విరాటపర్వం' సినిమా తనది కాదని.. సాయిపల్లవి సినిమా అని.. ఈ సినిమాలో హీరో ఆమేనని చెప్పుకొచ్చారు. రానా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక హీరో ఇలా మాట్లాడడం ఇదే తొలిసారేమో. రానా గొప్పతనాన్ని పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు నెటిజన్లు.