Sr NTR 100th Birth Anniversary: రాముడు... కృష్ణుడు... తెలుగు తెరపై తిరుగులేని కథానాయకుడు... రాజకీయ సంగ్రామంలో ఎదురులేని మహానాయకుడు... తెలుగు ప్రజలు ముద్దుగా అన్నగారు అని పిలుచుకునే మహనీయుడు నందమూరి తారక రామారావు. అభిమానుల గుండెల్లో ఆయన దేవుడు.
ఎన్టీఆర్ అంటే తెలుగు ప్రజల ఆత్మగౌరవం. కథానాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఆయన వేసిన ముద్ర అటువంటిది. నేడు ఎన్టీఆర్ శత జయంతి. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. (NTR Centenary birth celebrations). ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితం గురించి అందరికీ తెలుసు. అయితే, ఆయన సినీ జీవితంలో ఈ విశేషాలు మీకు తెలుసా?
Also Read: తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !
ఎన్టీఆర్ సినిమా జీవితంలో ఆసక్తికరమైన విశేషాలు:
ఎన్టీఆర్ తొలిసారి ఏ పాత్రలో నటించారో తెలుసా? ఒక మహిళ పాత్రలో! అది సినిమా కోసం కాదు, నాటకం కోసం! విజయవాడలోని ఎస్ఎస్ఆర్ & సివిఆర్ కాలేజీలో వేసిన నాటకంలో ఆయన మహిళ పాత్ర పోషించారు. 'అన్నాతమ్ముడు' సినిమాలో ఒక సన్నివేశంలో స్త్రీ వేషధారణలో కనిపిస్తారు. సినిమాల్లో మారువేషాలు వేయడం ఆయనకు సరదా.
ఎన్టీఆర్ నటించిన తొలి సినిమా 'మన దేశం'. అయితే, 'పాతాళ భైరవి' సినిమాతో ఆయన బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత స్టార్‌డమ్ సొంతం అయ్యింది.
కృష్ణుడు, రాముడు అంటే తెలుగు ప్రజలకు గుర్తుకు వచ్చేది విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. ఆయన ఎన్ని సినిమాల్లో కృష్ణుడిగా కనిపించారో తెలుసా? 17 సినిమాల్లో! రాముడిగా కూడా పలు సినిమాల్లో నటించారు.
ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన తొలి సినిమా 'రాముడు - భీముడు'. అది 1964లో విడుదలైంది. ఆ తర్వాత సుమారు 17 సినిమాల్లో డ్యూయల్ రోల్స్ చేశారు.
రాముడు, కృష్ణుడు, రావణాసురుడు - ఒకే సినిమాలో ఈ మూడు భిన్నమైన పాత్రలు పోషించిన తొలి నటుడు ఎన్టీఆర్. ఆ సినిమా 'శ్రీ కృష్ణ సత్య'. కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు - 'దాన వీర సూర కర్ణ' సినిమాలోనూ మూడు డిఫరెంట్ రోల్స్ చేశారు. కొన్ని సినిమాల్లో ఆయన త్రిపాత్రాభినయం చేశారు.
తాత, తండ్రి, కుమారుడు - మూడు తరాల పాత్రలను ఓకే సినిమాలో పోషించిన ఘనత సైతం ఎన్టీఆర్ సొంతం. 'కులగౌరవం' సినిమాలో ఆ రోల్స్ చేశారు. 'శ్రీమద్విరాటపర్వం' సినిమాలో ఐదు పాత్రల్లో కనిపించారు. ఒకే సినిమాలో హీరోగానూ, విలన్ గానూ చేశారు. రావణాసురుడిగా, దుర్యోధనుడిగా నటించారు.
ఎన్టీఆర్ అందగాడు. అయితే, అంధుడిగా కనిపించడానికి ఆయన వెనుకాడలేదు. 'చిరంజీవులు' (1956) సినిమాలో ఆయన బ్లైండ్ పర్సన్ రోల్ చేశారు. తన నట జీవితంలో ఎన్టీఆర్ పలు ప్రయోగాలు చేశారు.
ఎన్టీఆర్ ఏ వయసులో సంప్రదాయ నృత్యం నేర్చుకున్నారో తెలుసా? 40 ఏళ్ళ వయసులో! అదీ 'నర్తనశాల' సినిమా కోసం! ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారులు వెంపటి చినసత్యం దగ్గర శిక్షణ తీసుకున్నారు. సినిమా అంటే ఆయన అంత డెడికేషన్ చూపించేవారు. క్రమశిక్షణలో ఎన్టీఆర్‌కు ఎన్టీఆరే సాటి.
ఎన్టీఆర్ మొత్తం 295 సినిమాల్లో నటించారు. ఆయన 14 తమిళ సినిమాలు, మూడు హిందీ సినిమాలు కూడా చేశారు.
Also Read: మహానాయకుడు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, తారక్
ఎన్టీఆర్ చివరి సినిమా 'మేజర్ చంద్రకాంత్'. ఆ తర్వాత ఆయన నటించలేదు. ఆయన నటించిన 'లవకుశ' సినిమా ఐదు వందల రోజులకు పైగా ప్రదర్శింపబడి రికార్డు నెలకొల్పింది. కలెక్షన్స్ విషయంలోనూ రికార్డులు సృష్టించింది. ఇప్పటి టికెట్ రేట్లకు తగ్గట్టు చూస్తే... ఆ సినిమా కలెక్షన్స్‌ను మరో సినిమా బ్రేక్ చేయలేదేమో!