సినిమా రివ్యూ: రైటర్
రేటింగ్: 2.5/5
నటీనటులు: సముద్రఖని, ఇనేయ, మహేశ్వరి, లిజ్జీ ఆంటోనీ, సుబ్రమణ్యం శివ, హరికృష్ణన్ అన్బు దురై, దిలీపన్, జీఎం సుందర్, మెర్కు తొడార్చి మలై ఆంటోనీ తదితరులు
మాటలు (తెలుగు): వేణుబాబు చుండి
పాటలు (తెలుగు): రాంబాబు గోసల
సినిమాటోగ్రఫీ: ప్రతీప్ కాళీరాజా 
సంగీతం: గోవింద్ వసంత 
నిర్మాతలు: పా రంజిత్, అభయానంద సింగ్, పియూష్ సింగ్, అదితి ఆనంద్ 
రచన, దర్శకత్వం: ఫ్రాంక్లిన్ జాకబ్ 
విడుదల తేదీ: మే 27, 2022 (ఆహా ఓటీటీలో)


సముద్రఖని (Samuthirakani) ప్రధాన పాత్రలో నటించిన తమిళ సినిమా 'రైటర్'. తెలుగులో అదే పేరుతో అనువదించారు. మే 27న ఆహా ఓటీటీ (AHA OTT)లో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే (Writer Telugu Movie Review)... 


కథ: రంగరాజు (సముద్రఖని) అనకాపల్లి పోలీస్ స్టేషన్‌లో రైటర్. పోలీసు వ్యవస్థలో కిందిస్థాయి ఉద్యోగులకు ఒక యూనియన్ ఉండాలని పోరాటం చేస్తున్నాడు. ఆ విషయమై కోర్టు మెట్లు ఎక్కుతాడు. ఇది నచ్చని పై అధికారి అతడిని విశాఖకు ట్రాన్స్‌ఫ‌ర్‌ చేస్తాడు. దేవ కుమార్ (హరీష్ కృష్ణన్) అనే పీహెడ్‌డి స్టూడెంట్‌ను అరెస్ట్ చేసిన విశాఖ పోలీసులు కల్యాణ మండపంలో, లాడ్జిలో ఉంచుతారు. ఎందుకలా చేశాడు? విశాఖలో అడుగుపెట్టే వరకూ తనకు ఎటువంటి పరిచయం లేని దేవ కుమార్‌ను తప్పించాలని రంగరాజు ఎందుకు ప్రయత్నించాడు? ఎందుకు జైలుకు వెళ్ళాడు? అసలు, ఏం జరిగింది? కేసు ఏమిటి? అనేది మిగతా సినిమా. 


విశ్లేషణ: 'రైటర్' సినిమా నిర్మాతల్లో రజనీకాంత్ 'కబాలి', 'కాలా' చిత్రాల దర్శకుడు పా. రంజిత్ ఒకరు. దర్శకుడిగా, నిర్మాతగా ఆయన తీసిన సినిమాల్లో వర్ణ వివక్ష (కాస్ట్ ఫీలింగ్) కారణంగా ఓ వర్గం ప్రజలు ఎదుర్కొన్న అవమానాలు, ఒక వర్గానికి జరిగిన అన్యాయాలకు ప్రాధాన్యం ఉంటుంది. 'రైటర్'లో పోలీస్ వ్యవస్థలో వర్ణ వివక్ష గురించి అంతర్లీనంగా చూపించారు. అయితే, అంతకు మించి ఎమోషన్ ఉంది. సముద్రఖని అద్భుత అభినయం ఉంది.


ఒక కథగా, సినిమాగా 'రైటర్'ను చూస్తే... 'అల్లరి' నరేష్ కథానాయకుడిగా నటించిన 'నాంది' ఛాయలు కొన్ని కనిపిస్తాయి. 'నాంది'లో అన్యాయంగా ఒక యువకుడిని పోలీసులు కేసులో ఇరికిస్తే... ఆ యువకుడు పడే మనోవేదనను హృదయానికి హత్తుకునేలా చూపించారు. 'రైటర్'లో యువకుడి మనోవేదన కంటే... ఒక కుర్రాడు తన వల్ల అన్యాయంగా కేసులో ఇరుకున్నాడని పశ్చాత్తాపంతో బాధపడే ఒక పోలీస్ మనోవేదనకు ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు.


'రైటర్'లో సముద్రఖని, దేవ కుమార్ పాత్రలను పరిచయం చేయడానికి ఎక్కువ సమయం తీసుకున్నారు. అందువల్ల, సినిమా ప్రారంభమైన గంట వరకు చాలా  నెమ్మదిగా సాగుతుంది. ఆ తర్వాత అసలు కథలోకి వెళ్లిన తర్వాత కూడా వేగం పెరగలేదు. కానీ, సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. సముద్రఖని కుటుంబ నేపథ్యం కథకు అవసరం లేదేమో అనిపిస్తుంది. అలాగే, దేవకుమార్ కుటుంబ నేపథ్య సన్నివేశాలు కూడా! సినిమాలో చాలా అంశాలను ప్రస్తావించారు. కానీ, లోతుగా చర్చించకుండా పైపైన చూపిస్తూ వెళ్ళారు.


క్రైమ్ రేట్ పర్సంటేజ్ తగ్గించడం కోసం పోలీసులు కేసులను ఏ విధంగా పరిష్కరిస్తారు? ఎటువంటి నేరం చేయని వాళ్ళను అన్యాయంగా కేసుల్లో ఎలా ఇరికిస్తారు? అనే అంశాలను చూపించారు. తెలుగు ప్రేక్షకులు ఈ తరహా సన్నివేశాలు, సినిమాలు చూశారు. ఈ 'రైటర్'లో ఆ అంశాలను కొత్త కోణంలో చూపించారు. గోవింద్ వసంత నేపథ్య సంగీతం కథతో పాటు ప్రయాణించింది. సన్నివేశాల్లో ప్రేక్షకులను లీనం చేసేలా ఉంది. 


రంగరాజుగా సముద్రఖని జీవించారు. పాత్రకు ప్రాణం పోశారు. భావోద్వేగభరిత సన్నివేశాల్లో కొత్త సముద్రఖని కనిపిస్తారు. హరికృష్ణన్, ఇతర తారాగణం - సినిమాకు పర్ఫెక్ట్ కాస్టింగ్ కుదిరింది. అయితే, సముద్రఖని వచ్చినప్పుడు ఇతరులపై దృష్టి పడదు. సినిమాలో తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన నటుడు కూడా ఆయన ఒక్కరే కావడం అందుకు కారణం.


Also Read: 'ఎఫ్ 3' రివ్యూ: వెంకటేష్, వరుణ్ తేజ్ నవ్వించారా? ఫ్రస్ట్రేషన్ తెప్పించారా?


ఫైనల్ పంచ్: రెగ్యులర్ పోలీస్ కథలకు భిన్నమైన కథతో రూపొందిన సినిమా 'రైటర్'. పోలీసు వ్యవస్థలో కిందిస్థాయి ఉద్యోగుల జీవితాలు, వర్ణ వివక్ష గురించి చర్చించిన చిత్రమిది. సహజత్వానికి దగ్గరగా తీశారు. అయితే, చాలా నిదానంగా సాగుతుంది. సముద్రఖని అద్భుత అభినయం ఆకట్టుకుంటుంది. ఓటీటీ రిలీజ్ కాబట్టి ఫార్వర్డ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది కనుక... సముద్రఖని కోసం సినిమాను చూసే ప్రయత్నం చేయవచ్చు.


Also Read: Top Gun Maverick Movie Review: 36 ఏళ్ళ తర్వాత సీక్వెల్ - 'టాప్ గన్: మావెరిక్' ఎలా ఉంది? టాప్ ప్లేస్‌లో ఉంటుందా? లేదా?