తెలుగువాడి ఆత్మగౌరవం సత్తాను జాతీయస్థాయిలో చాటిచెప్పిన వ్యక్తి. స్వాతంత్ర్యం వచ్చిన 36 ఏళ్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి. రాముడి సుందర వదనం.... కృష్ణుడి సమ్మోహన రూపం... దుర్యోధన చక్రవర్తి ఆగ్రహావేశాలు... రావణుడి బీభత్సం.... శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య తేజస్సు.... ఘట్టమేదైనా, పురాణ పాత్ర ఏదైనా సరే... ఆయనకు దాసోహం అనాల్సిందే. నటుడు మాత్రమేనా... నిర్మాత, దర్శకుడు, ఎడిటర్... ఇలా ఏ రంగాన్ని స్పృశించినా విజయం ఆయనను వరించేది.  కోట్లాది తెలుగు ప్రజలు ఆరాధ్యదైవంగా కొలిచే  నందమూరి తారక రామారావు శతజయంతి. 


నిమ్మకూరులో పుట్టి విశ్వవ్యాప్తం అయిన ఎన్టీఆర్ ! 


మే 28వ తేదీన 1923 లో కృష్ణా జిల్లాలో నిమ్మకూరు  గ్రామంలో ఎన్టీఆర్ జన్మించారు. విజయవాడ, గుంటూరులో విద్యాభ్యాసం పూర్తయ్యాక 1947 లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగంలో చేరారు. కానీ మూడు వారాలకే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమా కలలతో మద్రాస్ రైలెక్కారు. సుమారు రెండేళ్ల తర్వాత 1949లో మన దేశంలో ఓ చిన్న పాత్రతో  ఆయన అలుపెరగని సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అక్కడ నుంచి సుమారు 300పైగా చిత్రాల్లో నటించి తెలుగు చిత్రసీమ గర్వించే ఓ దిగ్గజంగా నిలిచారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా పేరు గడించారు.


 
వెండితెర దేవుడి రూపం ఎన్టీఆర్ ! 


1951లో వచ్చిన పాతాళ భైరవి సినిమా.... అప్పటి తెలుగు సినిమా రికార్డులన్నింటినీ తిరగరాసింది. ఎన్టీఆర్ ను ప్రజల హీరోగా నిలబెట్టింది. తోట రాముడు తమవాడంటూ ప్రజలంతా ఓన్ చేసుకున్నారు. ఎన్టీఆర్ అంటే ఆ కాలం ప్రజలందరికీ తెలుగు తెరపై కదిలే దేవుడు. కృష్ణుడైనా, రాముడైనా, వెంకటేశ్వరుడైనా తెర ముందే హారతులిచ్చేవారు. తిరుపతిలో స్వామివారిని దర్శించుకుని వచ్చిన తర్వాత ఎన్టీఆర్ దర్శనమంటూ ఆయన ఇంటికే స్వయంగా వచ్చేవారంట. తెరపై దేవుడిలా ఎన్టీఆర్ కనిపించిన తొలి సినిమా ఆల్ టైం క్లాసిక్ మాయాబజార్. 1957లో విడుదలైంది. నేటికీ ఇండియన్ సినిమాలో కృష్ణుడంటే ఎన్టీవోడు, ఎన్టీవోడంటే కృష్ణుడు అని తెలుగు ప్రజలంతా అనుకుంటూ ఉంటారు. 1968లో ఆయనను పద్మశ్రీతో భారత ప్రభుత్వం సత్కరించింది. ఇదే కాక అనేక జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు, డాక్టరేట్ కూడా ఎన్టీఆర్ సొంతమయ్యాయి.


24 క్రాఫ్ట్‌లపై పట్టు ! 


దానవీరశూర కర్ణ... 1977లో విడుదలైన ఈ సినిమా.... ఎన్టీఆర్ సుదీర్ఘ నటనా ప్రస్థానంలో మరో మైలురాయి లాంటి సినిమా. కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు లాంటి హేమాహేమీ పాత్రలు చేయడమే కాక... దీనికి స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలనూ నిర్వర్తించారు. సుమారు 4 గంటలు ఉండే ఈ సినిమా చిత్రీకరణ కేవలం 43 రోజుల్లోనే పూర్తైందంట. ఎన్టీఆర్ 3 షిఫ్టులు పనిచేస్తూ ఉండేవారు అనేదానికి ఇదో నిదర్శనం. ఆయన నటనా కెరీర్ రెండో భాగంలో ఎక్కువగా సాంఘిక, కమర్షియల్ చిత్రాలు చేసేవారు. దేవుడు చేసిన మనుషులు, అడవి రాముడు, సర్దార్ పాపారాయుడు, కొండవీటి సింహం.... ఇలా మరెన్నో.


ఆత్మగౌరవం కోసం రాజకీయ ఆరంగేట్రం ! 


1982 సమయానికి అప్పటికే తెలుగు ప్రజలు డెమీ గాడ్ గా కొలుస్తుండే ఎన్టీ రామారావు మరో సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు. తెలుగు వాడి ఆత్మగౌరవమే ప్రధాన అజెండాగా, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీ ఏర్పడ్డ 9 నెలల్లోనే ఎన్నికల్లో ఘనవిజయం సాధించి  భారతదేశ రాజకీయ చరిత్రలో ఇంకెవరికీ సాధ్యం కాని విధంగా 1983లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.1984 ఆగష్టులో.... ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం ఎన్టీఆర్ అమెరికా వెళ్లినప్పుడు అప్పటి గవర్నర్ ఠాకూర్ రాంలాల్ ఎన్టీఆర్ ను తొలగించి నాదెండ్ల భాస్కరరావును సీఎంను చేశారు. కానీ అది నెల మాత్రమే సాగింది. అమెరికా నుంచి తిరిగి రాగానే...తన బలం నిరూపించుకుని మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 1984 లోక్ సభ ఎన్నికలు ఎన్టీఆర్ మాస్ ఫాలోయింగ్ కు మరో నిదర్శనం. ఇందిరా గాంధీ మరణం తర్వాత వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ దేశమంతా లాండ్ స్లైడ్ విక్టరీ సాధించింది. కానీ ఆంధ్రప్రదేశ్ లో 30 సీట్లు సాధించిన తెలుగుదేశం  లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన తొలి ప్రాంతీయ పార్టీగా రికార్డు సృష్టించింది. 1985లో అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లిన ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 1994లో మరోసారి సీఎం అయ్యారు. తన రాజకీయ జీవితంలో ఎన్టీఆర్ పలు నియోజకవర్గాల నుంచి విజయం సాధించారు. హిందూపూర్, గుడివాడ, తిరుపతి, నల్గొండ, టెక్కలి నియోజకవర్గాల్లో గెలిచారు.