థియేటర్లలో టికెట్ రేట్ ఎంత? ప్రస్తుతం ఈ ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేరు. ఎందుకంటే... ఒక్కో సినిమాకు ఒక్కో రేటు వసూలు చేస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్', 'కెజియఫ్ 2' సినిమాలకు తెలంగాణాలో, మల్టీప్లెక్స్ స్క్రీన్లలో నాలుగు వందలకు పైగా వసూలు చేశారు. సింగల్ స్క్రీన్లలో రెండు వందలకు పైగా ఉంది. 'ఎఫ్ 3' సినిమాకు టికెట్ రేట్స్ పెంచడం లేదని నిర్మాత 'దిల్' రాజు ప్రకటించారు. అయితే... ఆ సినిమాకు మల్టీప్లెక్స్‌లలో 300, సింగల్ స్క్రీన్లలో 175 వరకూ అమ్మారు. 'మేజర్' సినిమాకు మాత్రం నిజంగా టికెట్ రేట్లు తగ్గించారు.
అడివి శేష్ కథానాయకుడిగా నటించిన సినిమా 'మేజర్'. ముంబై ఉగ్రదాడిలో అమరులైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ ఇది. ఈ సినిమాకు తెలంగాణలోని మల్టీప్లెక్స్‌లలో టికెట్ రేటు 195 రూపాయలు, సింగిల్ స్క్రీన్లలో టికెట్ రేటు 150 రూపాయలుగా నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌లో మల్టీప్లెక్స్ టికెట్ రేటు 177, సింగిల్ స్క్రీన్ రేటు 147 రూపాయలుగా నిర్ణయించారు. కరోనా తర్వాత తక్కువ టికెట్ రేటు వసూలు చేస్తున్న చిత్రమిదే.
Also Read: 'ఎఫ్ 3' రివ్యూ: వెంకటేష్, వరుణ్ తేజ్ నవ్వించారా? ఫ్రస్ట్రేషన్ తెప్పించారా?
శివకార్తికేయన్ 'కాలేజ్ డాన్' సినిమాకు తెలంగాణలోని మల్టీప్లెక్స్‌లలో రూ. 200 టికెట్ రేటు ఉంది. టామ్ క్రూజ్ 'టాప్ గన్: మావెరిక్'కు కూడా సేమ్ రేటు. ఆ రెండు సినిమాలతో పోల్చినా... 'మేజర్' టికెట్ రేటు ఐదు రూపాయలు తక్కువే.