హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ నటించిన ‘టాప్ గన్: మావెరిక్’ థియేటర్లో సందడి చేస్తోంది. పారామౌంట్ పిక్చర్స్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలోని కొన్ని స్టంట్స్ గ్రీన్ మ్యాట్‌తో పనిలేకుండా రియల్‌గానే చేశారు. ఈ మేరకు టామ్ క్రూజ్ యుద్ధ విమానాలను నడపడంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఈ సినిమాలో టామ్ క్రూజ్ నడిపిన జెట్ విమానాన్ని యూఎస్ నేవీ నుంచి అద్దెకు తీసుకున్నారు. ఇందుకు భారీ మొత్తాన్నే చెల్లించారు. 


ఈ చిత్రంలో F/A-18 సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్‌లు ఉపయోగించారు. ఇవి నింగిలోకి రాకెట్‌లా దూసుకుపోతాయి. శత్రువు వాటిని కనుగొనేలోపే దాడి చేస్తాయి. బాంబుల దాడి నుంచి సైతం మెరుపు వేగంతో తప్పించుకోగలవు. అయితే, సాధారణ పైలట్లు ఇలాంటి యుద్ధ విమానాలను నడపడం కష్టమే. ఎందుకంటే.. ఈ విమానాలు నింగిలోకి దూసుకెళ్లిన కొద్ది దూరంలో గురుత్వాకర్షణ కోల్పోతాయి. అవన్నీ తట్టుకుని పైలట్ మళ్లీ ఆ విమానాన్ని నేలకు దింపాలి. ఆ సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా విధ్వంసం తప్పదు. అయితే, టామ్ క్రూజ్ అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించాడు. ట్రైనింగ్ పొందిన కొద్ది రోజుల్లోనే జెట్ విమానాన్ని నడిపేశాడు. 


Also Read: ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ ట్రైలర్: టామ్ క్రూజ్ రియల్ స్టంట్స్, చివరి సీన్ అస్సలు మిస్ కావద్దు!


ఈ విమానాల కోసం నిర్మాణ సంస్థ గంటకు 11,374 డాలర్లు (రూ.8.83 లక్షలు) చొప్పున చెల్లించారు. జెట్ విమానాలు నేల మీద నింగిలోకి వెళ్లగానే గురుత్వాకరణ శక్తిని కోల్పోవడం వల్ల వారి శరీరంపై ఒత్తిడి ఏర్పడుతుంది. 59 ఏళ్ల టామ్ క్రూజ్ అవన్నీ తట్టుకుని విజయవంతంగా ఆ జెట్ విమానాలను నడిపాడు. అయితే, టామ్‌ జెట్ విమానాలను నడపడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. 1986లో విడుదలైన ‘టాప్ గన్’ సినిమాలో కూడా రియల్ జెట్ విమానాన్ని నడిపాడు.  


Also Read: 36 ఏళ్ళ తర్వాత సీక్వెల్ - 'టాప్ గన్: మావెరిక్' ఎలా ఉంది? టాప్ ప్లేస్‌లో ఉంటుందా? లేదా?


టామ్ క్రూజ్ నడిపిన జెట్‌ త్వరలో భారత నావికాదళంలోకి చేరనుంది. ఇండియా స్వయంగా నిర్మించిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌‌లో ఈ జెట్ విమానాన్ని ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, యుద్ధ విమానాలను సినిమా షూటింగ్స్‌కు అద్దెకు ఇస్తారా అనే అంశంపై ఇటీవల చర్చ జరిగింది. దీనిపై పెంటగాన్ స్పందిస్తూ.. పూర్తి శిక్షణ తర్వాతే ఆ విమానాలను నడిపేందుకు అనుమతి ఇచ్చామని, యూఎస్ నేవీకి సంబంధించిన ఆయుధాలేవీ వాటిలో లేవని నిర్ధరించారు. అత్యవసర పరిస్థితుల్లో విమానం నుంచి బయటకు రావడం ఎలా, ఒకవేళ సముద్రంలో పడిపోతే.. సహాయం వచ్చే వరకు ఎలా జీవించాలనే అంశాలపై శిక్షణ ఇచ్చిన తర్వాతే F/A-18 పైలట్లను అప్పగించారు. ‘టాప్ గన్: మావెరిక్’ చిత్రం 2018లోనే షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ, కరోనా వైరస్ వల్ల నాలుగేళ్లు ఆలస్యంగా విడుదలైంది. టామ్ క్రూజ్ 2023లో ‘మిషన్ ఇంపాజిబుల్-2’ చిత్రంతో వస్తున్నాడు. ఈ సినిమాలో కూడా తన రియల్ స్టంట్స్‌తో అబ్బురపరిచేందుకు సిద్ధమవుతున్నాడు.