Assembly Elections 2023 Live Updates: ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్‌ల దాడి, మధ్యప్రదేశ్‌లో ఘర్షణలు - ఉద్రిక్తతల మధ్యే పోలింగ్

MP And CG Assembly Elections 2023 Live Updates: మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు 2,533 మంది, ఛత్తీస్‌గఢ్‌లో రెండో దశలో 70 స్థానాలకు 958 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 

ABP Desam Last Updated: 17 Nov 2023 05:59 PM
సాయంత్రం 5 గంటలకు పోలింగ్ వివరాలివే..

సాయంత్రం 5 గంటల నాటికి మధ్యప్రదేశ్‌లో 71.11%, ఛత్తీస్‌గఢ్‌లో 67.34% పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. 





ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్‌ల దాడి

ఛత్తీస్‌గఢ్‌లోని గరియబంద్‌ వద్ద నక్సలైట్‌లు IED పేల్చారు. ఈ ఘటనలో ITBP పోలీస్‌ మృతి చెందాడు. 





ఘర్షణల్లో ఒకరు మృతి

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌నగర్ నియోజకవర్గంలో రెండు గ్రూపులు తీవ్రంగా ఘర్షణ పడ్డాయి. ఈ గొడవలో కాంగ్రెస్ అభ్యర్థి సన్నిహితుడు ప్రాణాలు కోల్పోయారు. 

మధ్యాహ్నం 3 గంటలకు పోలింగ్ ఎంతంటే..?

మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఛత్తీస్‌గఢ్‌లో 55% పోలింగ్ నమోదైంది. మధ్యప్రదేశ్‌లో 60.45% పోలింగ్‌ జరిగినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. 

ఓటు వేసిన భూపేశ్

ఛత్తీస్‌గఢ్‌లోని పటాన్ నియోజకవర్గంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 





ఉద్రిక్తతలపై సచిన్ పైలట్ అసహనం

మధ్యప్రదేశ్ పోలింగ్‌లో ఉద్రిక్తతలపై సచిన్ పైలట్ తీవ్రంగా స్పందించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని తేల్చి చెప్పారు. ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరికీ ఓటు వేసే హక్కు ఉంటుందని అన్నారు. ఎన్నికల్లో హింసకు తావు లేదని వెల్లడించారు. 

కొనసాగుతున్న పోలింగ్

మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి ఛత్తీస్‌గఢ్‌లో 37.87% పోలింగ్ నమోదుకాగా...మధ్యప్రదేశ్‌లో 45.40% పోలింగ్‌ జరిగినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. 

సీఎం రేసులో లేను: సింధియా

తాను ముఖ్యమంత్రి రేసులో లేనని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. 2013,2018లోనూ తాను ఈ పదవి కోసం పోటీ చేయలేదని, ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నానని తేల్చి చెప్పారు. తమ పోటీ అంతా అభివృద్ధి చేయడంలోనే ఉంటుందని తెలిపారు. 

క్యూ కడుతున్న మహిళా ఓటర్లు

ఛత్తీస్‌గఢ్‌లో మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌ బూత్‌లకు తరలి వస్తున్నారు. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం పోలింగ్ 23% చేరుకుంది. 

75 సీట్లు గెలుస్తాం: భూపేశ్ భగేల్

ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ 75 సీట్లకుపైగా గెలుచుకుంటుందని ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీతో పోటీ లేనే లేదని స్పష్టం చేశారు. 





ఓటు వేయనున్న ఉమా భారతి

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమా భారతి ఓటు హక్కు వినియోగించుకునేందుకు టికమ్‌గర్‌లోని సొంత నియోజకవర్గమైన దుండకి చేరుకున్నారు. 

పోలింగ్‌లో ఉద్రిక్తతలు

మధ్యప్రదేశ్‌ పోలింగ్‌లో పలు చోట్ల ఉద్రిక్తత ఘటనలు జరిగాయి. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘర్షణలో బీజేపీ నేత రాకేశ్ శుకా గాయపడ్డారు. భింద్ జిల్లాలో జరిగిన గొడవలో ఆయనకు గాయాలయ్యాయి. 


 





11 గంటల సమయానికి పోలింగ్‌ ఎంతంటే..?

ఉదయం 11 గంటల సమయానికి మధ్యప్రదేశ్‌లో 28.18% పోలింగ్‌ నమోదు కాగా...ఛత్తీస్‌గఢ్‌లో 19.67% పోలింగ్‌ నమోదైంది. 

ఓటు వేయ్ పోహా లాగించేయ్..

ఉదయం 9 గంటల కన్నా ముందే వచ్చి ఓటు వేసిన వాళ్లకి ఇండోర్‌లోని ఓ హోటల్‌ నిర్వాహకులు అందరికీ ఉచితంగా పోహా పంపిణీ చేశారు. ఓటర్లను అభినందించారు. 





కమల్‌నాథ్‌ని కొడుకున్న అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు

మధ్యప్రదేశ్‌లోని బరారిపుర పోలింగ్ బూత్‌లో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ఎంపీ, కమల్‌నాథ్ కొడుకు నకుల్ నాథ్‌ ఓటు వేయడానికి రాగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. 





కాల్పుల కలకలం

మధ్యప్రదేశ్‌లో మొరెనా జిల్లాలో కాల్పులు కలకలం రేపాయి. ఓటింగ్‌లో రిగ్గింగ్‌కి పాల్పడాలని చూసిన కొందరు ఉన్నట్టుండి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. 

పోలింగ్ ఎంత నమోదైందంటే..

ఉదయం 9 గంటల నాటికి ఛత్తీస్‌గఢ్‌లో 5.71% పోలింగ్‌ జరగ్గా...మధ్యప్రదేశ్‌లో 11.13% పోలింగ్ నమోదైంది. 





గెలుపు మాదే: కమల్‌నాథ్

కమల్‌నాథ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యప్రదేశ్ ఓటర్లు బీజేపీ అవినీతి పాలనతో విసిగిపోయారని మండిపడ్డారు. ఈ సారి ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారన్న నమ్మకముందని వెల్లడించారు. 





త్రిముఖ పోరు

ఛత్తీస్‌గఢ్ పటాన్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ, జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్‌ పార్టీల మధ్య త్రిముఖ పోరు జరగనుంది. 

ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్రమంత్రి ప్రహ్లాద్ పటేల్

కేంద్ర మంత్రి, నర్సింగ్పూర్ బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి బీజేపీ గెలిస్తే ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంటు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 


ఎంపీ ప్రజల ప్రేమను పొందుతా: సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, బుధ్ని బీజేపీ అభ్యర్థి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. ప్రతిచోటా ప్రజల్లో చాలా ఉత్సాహం కనిపిస్తోందని అన్నారు. రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లు, యువత, వృద్ధుల ప్రేమ లభిస్తోంది అన్నారు. ఓటు వేసే ముందు ఓ ఆలయంలో సీఎం పూజలు చేశారు. ఆలయం వెలుపల నిలబడిన మహిళలు ఆయనకు స్వాగతం పలికారు. మధ్యప్రదేశ్ లో 230 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.

Background

Polling Updates In Madhya Pradesh and Chhattisgarh Assembly Elections 2023: మధ్యప్రదేశ్‌లో మొత్తం 230, ఛత్తీస్‌గఢ్‌లో 70 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ (శుక్రవారం) (నవంబర్ 17) పోలింగ్ జరుగుతోంది. చత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మొదటి దశలో (నవంబర్ 7) 20 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడతలో 76.47 శాతం పోలింగ్ నమోదైంది.


బుధవారం (నవంబర్ 15) సాయంత్రానికి రెండు రాష్ట్రాల్లో ప్రచారం ముగిసింది. రాజస్థాన్, తెలంగాణ, మిజోరాంలతో పాటు మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉంది. రెండు పార్టీలు తమ తమ ఎన్నికల మేనిఫెస్టోల్లో పలు హామీలు ఇచ్చి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. 


మధ్యప్రదేశ్‌లో 2,533 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 5 కోట్ల 60 లక్షల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. బాలాఘాట్, మాండ్లా, దిండోరి జిల్లాల్లోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మిగిలిన నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.


పోలింగ్ ప్రారంభానికి 90 నిమిషాల ముందు మాక్ పోలింగ్ నిర్వహించారు. రాష్ట్రంలో 64,523 ప్రధాన పోలింగ్ కేంద్రాలు, 103 సహాయక పోలింగ్ కేంద్రాలు కలిపి మొత్తం 64,626 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల సంఖ్య 17,032 అదే సమయంలో ముంపు ప్రాంతాల సంఖ్య 1,316గా ఉంది. ఎన్నికలకు ఆటంకం కలిగించిన 4,028 మందిని గుర్తించారు. అందరిపై నిఘా పెట్టారు. 


రాష్ట్రంలోని 5,160 పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా మహిళా పోలింగ్ సిబ్బంది ఉంటారని, ఈ పోలింగ్ కేంద్రాల్లో మహిళా అధికారులు, సిబ్బంది ఉంటారని, దివ్యాంగులను దృష్టిలో పెట్టుకొని మొత్తం 183 పోలింగ్ కేంద్రాలను వికలాంగులకు కేటాయించారు. 371 యూత్ మేనేజ్డ్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 2,536 మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జబల్పూర్ జిల్లాలో 50, బాలాఘాట్‌లో 57 గ్రీన్ బూత్లను ఏర్పాటు చేశారు.


ఎన్నికల సమయంలో గోండియా మహారాష్ట్రలో ఎయిర్ అంబులెన్స్ అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. అదేవిధంగా జబల్ పూర్ లో పోలింగ్ ముగిసే వరకు ఎయిర్ అంబులెన్స్ లు అందుబాటులో ఉంటాయి. ఒక హెలికాప్టర్ బాలాఘాట్ లో, మరో హెలికాప్టర్ భోపాల్ లో అందుబాటులో ఉంటాయి.


ఛత్తీస్‌గఢ్‌లోని రాజిమ్ జిల్లాలోని నక్సల్స్ ప్రభావిత బింద్రనావగఢ్ నియోజకవర్గంలోని తొమ్మిది పోలింగ్ కేంద్రాలు మినహా అన్ని ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అక్కడ మాత్రం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుంది.


ఛత్తీస్‌గఢ్‌లో 70 స్థానాలకు 827 మంది పురుషులు, 130 మంది మహిళలు, ఒక ట్రాన్స్ జెండర్ సహా మొత్తం 958 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. చత్తీస్ గఢ్ లో రెండో దశ పోలింగ్‌లో 1,63,14,479 మంది ఓటర్లు ఉన్నారు.


చత్తీస్‌గఢ్ రెండోదశ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి చెరో 70 మంది, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 44 మంది, జనతా కాంగ్రెస్ ఛత్తీస్ గఢ్ (జే) నుంచి 62 మంది, హమర్ రాజ్ పార్టీ నుంచి 33 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీటితో పాటు బహుజన్ సమాజ్ పార్టీ, గోండ్వానా గణతంత్ర పార్టీ కూటమిగా పోటీ చేస్తున్నాయి. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.