Civils Topper: సివిల్స్‌ ఫలితాల్లో ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ మొదటి ర్యాంకు సాధించారు. ఆదిత్యకు క్రికెట్ అంటే ఇష్టం. క్రికెట్‌‌ను తన కెరీర్‌గా కొనసాగించాలనుకున్నాడు. అయితే తన తండ్రి కల కోసం సివిల్స్ సాధించాలనుకున్నాడు. క్రికెట్, సివిల్స్ ఏదో ఒకటి ఎంపికచేసుకోవాల్సిన పరిస్థితిలో తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్‌ను పక్కనపెట్టి, సివిల్స్‌తో ప్రయాణం సాగించాడు. సివిల్స్‌లో 70 ర్యాంకు వస్తుందనుకున్నాడు. అయితే జాతీయస్థాయిలో టాప్ ర్యాంకులో నిలిచి, ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. IIT-కాన్పూర్ గ్రాడ్యుయేట్ అయిన ఆదిత్య శ్రీవాస్తవ, UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో టాప్ ర్యాంక్ సాధించడానికి క్రికెట్‌ను, ఏడాదికి 30 లక్షల జీతంతో కూడిన బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేశాడు. 


ఐఐటీ కాన్పూర్‌లో బీటెక్‌..
ఆదిత్య శ్రీనివాస్తవ మెయిన్స్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ను తన ఆప్షన్‌గా ఎంచుకున్నారు. ఐఐటీ కాన్పూర్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ (బీటెక్‌), ఎంటెక్‌ పూర్తి చేశారు. ఆయన తండ్రి అజయ్‌ శ్రీవాస్తవ కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌)లో అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. చిన్ననాటి నుంచి చదువుల్లో ముందుండే ఆదిత్య ఇంటర్‌లో 95 శాతం మార్కులు సాధించారు. 2019లో ఆయన బెంగళూరులోని గోల్డ్‌మెన్‌ శాక్స్‌లో ఉద్యోగం సాధించారు. 15 నెలలపాటు కార్పొరెట్‌ విధులు నిర్వర్తించాడు.


లక్షల్లో వేతనం వదిలేసి.. సివిల్స్‌ వైపు పయనం..
లక్షల్లో వేతనం అందుకున్న తర్వాత ఆయన సివిల్స్‌పై ఆసక్తితో ఉద్యోగాన్ని వదులుకొని ఇటు వైపు అడుగులు వేశారు. 2022లోనూ ఆయన సివిల్స్‌లో 236వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. చదువు పూర్తయ్యాక ఆర్థిక భద్రత సాధించాలనే ఆలోచనతో కార్పొరేట్‌ ఉద్యోగంలో చేరానని, అయితే డబ్బు మాత్రమే అంతిమ ప్రేరణ కాదని గ్రహించి సివిల్‌ సర్వీసెస్‌కు సిద్ధమవ్వాలని నిర్ణయించుకున్నట్టు ఆదిత్య తన మాక్‌ ఇంటర్వ్యూలో తెలిపారు. అట్టడుగు స్థాయిలో ప్రభావం చూపడానికి, వ్యవస్థకు తనవంతు సహకారాన్ని అందించడానికి ఇది ఒక మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు.


విద్యార్థులు తమ లక్ష్యం కోసం కష్టపడి పనిచేయండి - శ్రీవాస్తవ 
లక్నోలోని ఒక కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆదిత్య శ్రీవాస్తవ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు తమ లక్ష్యం కోసం కష్టపడి పనిచేయాలని తన తండ్రి ఇచ్చిన సలహాను వివరించారు. నేడు మీరు చేసే శ్రమ మీకు మాత్రమే కాకుండా.. మీ కుటుంబానికి కూడా జీవితకాల ఆనందాన్ని ఇస్తుందని, ఈరోజు సమయాన్ని వృధా చేసుకుంటే.. నేటి తీవ్ర పోటీ వాతావరణంలో విజయం సాధించడం కష్టమవుతుందని తన తండ్రి సూచించినట్లు ఆదిత్య తెలిపారు. తలిదండ్రులు తమ పిల్లల జీవితాలను బాగుచేయడానికి.. నిరంతరం కష్టపడి, వారి కోరికలను కూడా త్యాగం చేస్తారని, వారి త్యాగాన్ని విద్యార్థులు ఎప్పుడూ గుర్తుంచుకోవాలని ఆదిత్య కోరారు. "మనం మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తే మనం పురోగతి సాధించలేము.. తప్పులను సరిదిద్దుకోవాలన్నారు. ఉపాధ్యాయులు లేదా పెద్దలు మనలోని తప్పులను ఎత్తి చూపినట్లయితే, వాటినిక సరిదిద్దుకోవాలన్నారు. విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలని శ్రీవాస్తవ కోరారు. మీ కల మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి శక్తిని అందిస్తుందని విద్యార్థులతో అన్నారు.


యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ తుది ఫలితాల కోసం క్లిక్ చేయండి..


Related Articles:


ఇష్టం పెంచుకుంటే, కష్టమేమీ కాదు - సివిల్ సర్వీసెస్ తుది ఫలితాల్లో టాపర్ల వాయిస్


అవమానం తట్టుకోలేక జాబ్‌కు రాజీనామా - యూపీఎస్సీ సివిల్స్ టాపర్‌గా ఏపీ కానిస్టేబుల్ !


ఈ పూరి గుడిసే UPSC ర్యాంకర్ ఇల్లు, మనసుని మెలిపెడుతున్న కథ