UPSC Civils Final Results 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ - 2023 తుది ఫలితాలను (UPSC Main Results) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంచింది. తుది ఫలితాల ద్వారా మొత్తం 1,016 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరిలో జనరల్ - 347, ఈడబ్ల్యూఎస్ - 115, ఓబీసీ - 303, ఎస్సీ - 165, ఎస్టీ - 86 మంది అభ్యర్థులు ఉన్నారు. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి తాజాగా తుది ఫలితాలను యూపీఎస్సీ ప్రకటించింది. నోటిఫికేషన్‌లో ప్రకటించిన ప్రకారం మొత్తం 1143 ఖాళీలకు గాను 1,016 మంది ఉద్యోగాలకు అర్హత సాధించారు. ఆదిత్య శ్రీవాత్సవ ఫస్ట్ ర్యాంక్ సాధించగా.. అనిమేష్ ప్రధాన్ రెండో ర్యాంకు, దోనూరి అనన్య రెడ్డి మూడో ర్యాంక్ సాధించారు.
అభ్యర్థులకు యూపీఎస్సీ సూచన
అభ్యర్థులకు ఫలితాలపై ఏమైనా సందేహాలు ఉంటే తమను సంప్రదించవచ్చునని యూపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. సమాచారం కోసం గానీ, లేదా స్పష్టత కోసం అన్ని వర్కింగ్ డేస్‌లలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 011 23385271, 011 23098543, 011 23381125 ల్యాండ్ లైన్ నెంబర్లలో లేదా ఫెసిలిటేషన్ కౌంటర్‌లో సంప్రదించవచ్చని యూపీఎస్సీ సూచించింది.
ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే..?
🔰 ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్: https://www.upsc.gov.in ఓపెన్ చెయ్యాలి.
🔰 హోమ్‌పేజ్‌లో కనిపించే 'Final Result - CIVIL SERVICES EXAMINATION, 2023' ఆప్షన్‌పై క్లిక్ చెయ్యాలి.
🔰 క్లిక్ చేయగానే సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలకు సంబంధించిన పీడీఎఫ్ కనిపిస్తుంది.
🔰 సివిల్స్ సర్వీసెస్ తుది ఫలితాలకు సంబంధించిన పీడీఎఫ్ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
🔰 మీ పేరును చెక్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ నంబర్/ రోల్ నంబర్‌తో చెక్ చేసుకోవాలి.
సివిల్ సర్వీసెస్ తుది ఫలితాల కోసం క్లిక్ చేయండి.. https://upsc.gov.in/FR-CSM-23-engl-160424.pdf
గతేడాది సెప్టెంబర్ 15 నుంచి 24 వరకు సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మెయిన్ పరీక్ష ఫలితాలు డిసెంబరు 8న యూపీఎస్సీ విడుదల చేసింది. మెయిన్ పరీక్షలకు హాజరైన అభ్యర్థుల్లో మొత్తం 2,844 మంది ఇంటర్వ్యూలకు అర్హత సాధించారు. మెయిన్ పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్)కు షార్ట్ లిస్ట్ చేశారు. వీరికి ఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. గత మే నెలలో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షకు సుమారు 5.5 లక్షల మంది హాజరుకాగా.. అందులో 14,624 మంది ప్రధాన పరీక్షలకు అర్హత సాధించారు. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మొదటి విడతలో జనవరి 2 నుంచి ఫిబ్రవరి 16 వరకు ఇంటర్వ్యూ(పర్సనాలిటీ టెస్ట్)లు నిర్వహించారు. మొదటి విడత ఇంటర్వ్యూకు మొత్తం 1026 మంది ఎంపికయ్యారు. ఇక రెండో విడత ఇంటర్వ్యూ షెడ్యూలును జనవరి 25న విడుదల చేయగా..1003 మంది ఎంపికయ్యారు. వీరికి ఫిబ్రవరి 19 నుంచి మార్చి 15 వరకు పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇక చివరి విడతలో మార్చి 18 నుంచి ఏప్రిల్ 9 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించింది. మొత్తం 817 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించింది. మొత్తం మూడు విడతలు కలిపి 2846 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించగా మొత్తం 1016 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
Also Read: Vote ID card: ఓటర్ ఐడీ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలా... అయితే ఇలా చేయండి