Sit Identified Accused Of Attack On CM jagan Incident: సీఎం జగన్ (Cm Jagan)పై రాయి దాడి ఘటనకు సంబంధించి సిట్ దర్యాప్తులో పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఐదుగురు యువకులను అనుమానితులుగా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీగా చెందిన సతీష్ అలియాస్ సత్తి అనే యువకుడే సీఎంపై రాయితో దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. దాడి సమయంలో అతనితో పాటు ఉన్న నలుగురిని సైతం సిట్ అదుపులోకి తీసుకుంది. దాడికి గల కారణాలపై యువకులను అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. సీఎంపై పుట్ పాత్ టైల్స్ రాయి ముక్కతో దాడి చేసినట్లు తెలుస్తోంది. టైల్స్ రాయిని జేబులో వేసుకుని వచ్చి సడెన్ గా దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, విజయవాడలో ఈ నెల 13న (శనివారం) సాయంత్రం బస్సు యాత్ర సందర్భంగా సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తుండగా.. సింగ్ నగర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేశాడు. దీంతో ఆయన ఎడమ కంటికి గాయమైంది. అనంతరం వైద్యులు సీఎంకు ప్రాథమిక చికిత్స అందజేశారు. 


ప్రత్యేక సిట్ ఏర్పాటు


ఏకంగా సీఎంపైనా రాయి దాడి జరగడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుని పూర్తి వివరాలు ఇవ్వాలని నివేదిక కోరింది. అటు, రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం సీపీని పూర్తి నివేదిక కోరింది. కేసు తీవ్రత దృష్ట్యా సీపీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటన జరిగిన సమయంలో ఉన్న సీసీ ఫుటేజీ, కాల్ రికార్డ్స్ అన్నింటినీ పరిశీలించారు. ముఖ్యమంత్రికి తగిలిన దెబ్బలను బట్టి.. క్యాట్ బాల్ లేదా ఎయిర్ గన్ వాడి ఉంటారని అనుమానాలు వ్యక్తం కాగా.. అందుకు  ఎలాంటి ఆధారాలు లభించలేదని సీపీ సోమవారం చెప్పారు. కింది జనాల్లో నుంచే రాయిని విసిరినట్లు గుర్తించామని.. సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలను నమ్మొద్దని కోరారు. కాగా, సీఎం జగన్ పై రాయి దాడి చేసిన వివరాలు తెలిస్తే ఇవ్వాలని.. కేసు విచారణ కోసం అవసరమైన సమాచారం ఇస్తే రూ.2 లక్షల బహుమతి ఇస్తామని కూడా ప్రకటించారు. 8 బృందాలు 40 మందితో ఈ కేసు విచారణకు పని చేయగా.. సిట్ ముమ్మర దర్యాప్తుతో నిందితులను గుర్తించారు. 


పొలిటికల్ హీట్


అటు, సీఎం జగన్ పై రాయి దాడి ఘటనతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. దాడి ఘటనను వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. దీని వెనుక ప్రతిపక్షాల కుట్ర దాగి ఉందని ఆరోపణలు చేశారు. అటు, ప్రతిపక్ష నేతలు సైతం వైసీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని.. మండిపడ్డారు. ఈ ఘటనపై వైసీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసుల ముమ్మర దర్యాప్తుతో కేసులో పురోగతి సాధించారు.


Also Read: Andhra Politics : రాయి ఏపీ రాజకీయాన్ని మలుపు తిప్పిందా ? వైసీపీ సమస్యలన్నింటికీ పరిష్కారం వచ్చినట్లేనా ?