Dairy Sector Stocks: మన దేశంలో పాలు, పాల ఉత్పత్తుల వినియోగం ఏటికేడు వేగంగా పెరుగుతోంది. స్టాక్ మార్కెట్‌లో, డెయిరీ రంగంలో పెట్టుబడి పెట్టే వాళ్లకు ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలు అందుతూనే ఉన్నాయి. ఒకవైపు, పాడి పరిశ్రమ వృద్ధి నిరంతరం పెరుగుతోంది. మరోవైపు, విలువ జోడించిన పాల ఉత్పత్తులకూ డిమాండ్ పెరుగుతోంది. ఇది చాలా ప్రైవేట్ డెయిరీ కంపెనీలకు ప్రయోజనం చేకూరుస్తోంది. 


ప్రస్తుతం, మన దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుతున్న దశలో ఉంది, దీనివల్ల ధరలు తగ్గి వినియోగం పెరుగుతుంది. ఈ పరిస్థితిని డెయిరీ కంపెనీలకు సానుకూలాంశంగా చెబుతున్న గ్లోబల్ బ్రోకరేజ్ & రీసెర్చ్‌ కంపెనీ ఇన్వెస్టెక్ (Investec).. డెయిరీ రంగంలోని 3 స్టాక్స్‌ మీద "బయ్‌ కాల్‌" ఇచ్చింది.


దొడ్ల డెయిరీ నుంచి 60% రాబడి!
తన పరిశోధన నివేదికను విడుదల చేసిన ఇన్వెస్టిక్‌... భారతదేశంలోని డెయిరీ రంగంలో తమ 'టాప్ స్టాక్ పిక్' డొడ్ల డెయిరీ అని వెల్లడించింది. దొడ్ల డెయిరీ షేర్లను రూ. 1400 టార్గెట్ ధరతో ‍‌(Dodla Dairy Stock Target Price) కొనుగోలు చేయవచ్చంటూ బయ్‌ కాల్‌ ఇచ్చింది. ఇది, ఈ స్టాక్ ప్రస్తుత స్థాయి కంటే 60 శాతం ఎక్కువ. అంటే.. దొడ్ల డెయిరీ షేర్లు మరో 60% పెరుగుతాయని ఇన్వెస్టిక్‌ అంచనా వేసింది. నిన్న (సోమవారం, 15 ఏప్రిల్‌ 2024)‍‌ ట్రేడింగ్ సెషన్‌లో దొడ్ల డెయిరీ షేర్‌ రూ. 890.60 వద్ద ముగిసింది.


హెరిటేజ్ ఫుడ్స్‌పై బుల్లిష్
డెయిరీ రంగంలోని మరో కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్ స్టాక్‌పై కూడా ఇన్వెస్టెక్ బుల్లిష్‌గా ఉంది. ఈ షేర్లను రూ. 450 టార్గెట్ ధరతో (Heritage Foods Target Price) కొనవచ్చని పిలుపునిచ్చింది. ప్రస్తుత స్థాయితో పోలిస్తే ఇది 46 శాతం లాభంతో సమానం. నిన్నటి ట్రేడింగ్‌లో హెరిటేజ్ ఫుడ్స్ షేర్‌ ప్రైస్‌ రూ. 299.30 వద్ద ముగిసింది.


పరాగ్ మిల్క్‌ 45% లాభం ఇస్తుందట!
ఇన్వెస్టెక్ బుల్లిష్‌ లిస్ట్‌లో ఉన్న మరో డెయిరీ సెక్టార్ స్టాక్ పరాగ్ మిల్క్ ఫుడ్స్‌. సోమవారం ఈ స్టాక్‌ రూ. 209.65 వద్ద క్లోజ్‌ అయింది. పరాగ్ మిల్క్ స్టాక్‌కు ఇన్వెస్టిక్‌ ప్రకటించిన టార్గెట్ ధర రూ. 310 (Parag Milk Foods Target Price). ప్రస్తుత స్థాయి నుంచి 45 శాతం పెరుగుదలను సూచిస్తోంది. 


హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్ (Hatsun Agro Product) స్టాక్‌ మీద గ్లోబల్‌ బ్రోకరేజ్‌ బేరిష్‌ లుక్‌తో ఉంది, ఈ స్టాక్‌ను "సెల్‌" చేయాలని ఇన్వెస్టర్లకు సూచించింది. హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్ షేర్‌ ధర 30 శాతం పతనంతో రూ. 700 వరకు వెళ్లవచ్చని బ్రోకరేజ్ హౌస్ అభిప్రాయపడింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: భగభగ మండుతున్న గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి