Stock Market Today, 16 April 2024: గత సెషన్‌లోనూ జావగారిన ఇండియన్ స్టాక్ మార్కెట్లు, ఈ రోజు (మంగళవారం) కూడా ప్రతికూల ధోరణిలో ప్రారంభం కావచ్చు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా గ్లోబల్ మార్కెట్లన్నీ దిగజారాయి. ఆ ప్రభావం మన మార్కెట్ల మీద ఉంటుంది.
సోమవారం, నిఫ్టీ 22,272 దగ్గర క్లోజ్ అయింది. ఈ ఉదయం 8.10 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 22,140 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఈ రోజు గ్యాప్-డౌన్‌లో ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
గ్లోబల్ మార్కెట్లు
ఆసియా-పసిఫిక్ మార్కెట్లలో.. ఈ ఉదయం, జపాన్‌కు చెందిన నికాయ్, దక్షిణ కొరియాకు చెందిన కోస్పి 2 శాతం చొప్పున పతనమయ్యాయి. ఆస్ట్రేలియాలోని ASX 200, హాంకాంగ్‌కు చెందిన హ్యాంగ్‌సెంగ్ 1.4 శాతం చొప్పున ఆవిరయ్యాయి.
యుఎస్‌లో, నిన్న, బెంచ్‌మార్క్ సూచీల్లో ప్రారంభ లాభాలు ఆవిరయ్యాయి, కనిష్ట స్థాయుల్లో ముగిశాయి. డౌ జోన్స్ 0.7 శాతం పడిపోయింది. నాస్‌డాక్ 1.8 శాతం పతనమైంది. S&P 500 1.2 శాతం కోల్పోయింది.
అమెరికన్ బెంచ్‌మార్క్ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ 4.6% దాటింది, 4.612 శాతం వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ $91 సమీపంలో ట్రేడ్ అవుతోంది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్సుకు $2,400 దగ్గర ఉంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి (Stocks in news Today):
ఈ రోజు Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: క్రిసిల్, డెన్ నెట్‌వర్క్స్, ఇంటిగ్రా ఎసెన్షియల్, లోటస్ చాక్లేట్, SG మార్ట్. బుధవారం... ఏంజెల్ వన్, హాత్‌వే కేబుల్, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, జస్ట్ డయల్, టాటా కమ్యూనికేషన్స్ ఫలితాలను నివేదిస్తాయి.
జియో ఫైనాన్షియల్: గ్లోబల్ ఇన్వెస్టింగ్ కంపెనీ బ్లాక్‌రాక్‌తో కలిసి 50:50 వాటాతో జాయింట్ వెంచర్ (JV) ఏర్పాటు చేసేందుకు జియో ఫైనాన్షియల్ నిర్ణయించింది. ఈ జేవీ ద్వారా స్టాక్ బ్రోకింగ్, వెల్త్ మేనేజ్‌మెంట్ వ్యాపారంలోకి ప్రవేశించాలన్నది ప్లాన్. మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేసేందుకు ఒక JV ఏర్పాటు కోసం ఈ రెండు కంపెనీలు గతంలోనూ ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి, సెబీ నుంచి లైసెన్స్ కోసం ఎదురు చూస్తున్నాయి.
వొడాఫోన్ ఐడియా: రూ. 18,000 కోట్ల FPO కొనసాగుతోంది. రాబోయే 24 నెలల్లో 5G వైర్‌లెస్ నెట్‌వర్క్‌ను ప్రారంభించేందుకు రూ. 5,720 కోట్లు వెచ్చించాలని కంపెనీ నిర్ణయించినట్లు CEO అక్షయ మూంద్రా తెలిపారు.
వేదాంత: పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.3,918 కోట్ల విలువైన 11 సంవత్సరాల టర్మ్ లోన్ తీసుకుంది. తన పవర్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడానికి ఈ డబ్బును ఉపయోగిస్తుంది.
ఆస్టర్ DM హెల్త్‌కేర్: రాబోయే మూడేళ్లలో 6,600 పడకల సామర్థ్యాన్ని విస్తరించడానికి భారతదేశంలో సుమారు రూ. 1,000 కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. 2026-27 నాటికి 1,700 బెడ్స్ యాడ్ చేయాలని ప్లాన్ చేసింది.
బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్: చెన్నైలో ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మించేందుకు రూ.400 కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది. ఇందుకోసం చెన్నైకి చెందిన అగ్ని ఎస్టేట్స్ & ఫౌండేషన్స్‌తో జాయింట్ డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ (JDA) కుదుర్చుకుంది.
సిప్లా: ఐవియా బ్యూటీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కాస్మెటిక్స్, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల పంపిణీ & మార్కెటింగ్ వ్యాపారం కొనుగోలు కోసం వ్యాపార బదిలీ ఒప్పందం (BTA)పై సంతకం చేసింది. ఇందులో Astaberry, Ikin, Bhimsaini వంటి బ్రాండ్లు కూడా ఉన్నాయి.
అంబుజా సిమెంట్స్: దక్షిణ భారత మార్కెట్‌లో మరింత విస్తరించే ప్రణాళికలో భాగంగా, మై హోమ్ ఇండస్ట్రీస్ నుంచి తమిళనాడులోని గ్రైండింగ్ యూనిట్‌ను కొనుగోలు చేయనుంది. డీల్ విలువ రూ. 413.75 కోట్లు.
బ్యాంక్ ఆఫ్ ఇండియా: అఫర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్‌లో గృహ రుణాలు అందించడానికి ఇండియన్ మార్ట్‌గేజ్ గ్యారెంటీ కార్పొరేషన్‌తో (IMGC) ఒప్పందం కుదుర్చుకుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి