Shreyas Iyer Fined Rs 12 Lakh For Slow Over Rate In Ipl 2024: ఓటమి బాధలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)కు దెబ్బ మీద దెబ్బ తగిలింది. నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా అతడికి బిసిసిఐ(BCCI) భారీ జరిమానా విధించింది. ఇందుకు సంబంధించి ఐపీఎల్(IPL) నిర్వాహకులు బుధవారం ప్రకటన విడుదల చేశారు. రాజస్థాన్(RR) పై స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు అయ్యర్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది. ఐపీఎల్ 2024లో కేకేఆర్ స్లో ఓవర్ రేట్ నమోదు చేయడం ఇదే మొదటిసారి కాబట్టి అయ్యర్‌కు ఐపీఎల్ నిర్వాహకులు జరిమానాతో సరిపెట్టారు. ఇలా జరగటం మొదటిసారి కాబట్టి కెప్టెన్ రూ.12 లక్షలు జరిమానా కట్టాల్సి ఉంటుంది. అదే పొరపాటును రెండవసారి చేస్తే రెట్టింపు జరిమానా అంటే రూ.24 లక్షలు చెల్లించాలి. ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా తుది జట్టులోని 11 మందికి రూ.6 లక్షల చొప్పున లేదా వారి మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం ఏది తక్కువైతే అది.. ఫైన్‌గా విధిస్తారు. ఒకవేళ ఇదే సీజన్‌లో మూడోసారి తప్పిదానికి పాల్పడితే జరిమానా రూ.30 లక్షలతోపాటు ఆ టీం కి ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఈ సీజన్ లో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్, గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్, రాజస్థాన్ సారథి సంజు శాంసన్‌కు జరిమానా పడింది. మ్యాచ్‌లు సజావుగా జరిగేలా మరియు షెడ్యూల్ చేసిన సమయంలో మ్యాచ్ పూర్తి కావడానికి ఐపీఎల్ నిబంధనలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024లో కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన ఆరు గేమ్‌లలో 4 విజయాలు సాధించి.. 8 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది.
చివరి బంతికి రాజస్థాన్ విజయం
కోల్‌కత్తాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి ఖాయమని అందరూ అనుకున్న వేళ జోస్ బట్లర్ వీరోచిత శతకంతో ఒంటి చేత్తో రాజస్థాన్‌కు విజయం అందించాడు. మిగతా బ్యాటర్లు ఎవరూ మద్దతు ఇవ్వకపోయినా చివరి వరకు క్రీజ్ లో నిలచిన బట్లర్ తన జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా... సునీల్ నరైన్ శతకంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. అనంతరం 224 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జోస్ బట్లర్ అద్భుత శతకంతో చివరి బంతికి విజయాన్ని అందుకుంది. బట్లర్ 60 బంతుల్లో 9 ఫోర్ లు, 6 సిక్సర్ లతో 107 పరుగులు చేసి రాజస్థాన్ కు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో కోల్‌కత్తా ఓపెనర్ సునీల్ నరైన్ కూడా శతకం చేశాడు. నరైన్ సెంచరీ 49 బంతుల్లో సెంచరీ చేశాడు. యుజ్వేంద్ర చాహల్ వేసిన 16వ ఓవర్లో మొత్తం 23 పరుగులొచ్చాయి. నరైన్ ఈ ఓవర్లో 2 సిక్సులు, 2 ఫోర్లు బాదాడు. అవేశ్‌ఖాన్ వేసిన 17వ ఓవర్ తొలి బంతికే రసెల్ ఔటయ్యాడు. సునీల్ నరైన్ 56 బంతుల్లో 13 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 109 పరుగులు చేసి బౌల్ట్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.