UPSC Results 2024: యూపీఎస్‌సీ ఎగ్జామ్ ఫలితాలు (UPSC Exam Results 2024) విడుదలయ్యాయి. ఈ పరీక్షలో ఆదిత్య శ్రీవాస్తవ టాపర్‌గా నిలిచారు. అనిమేశ్ ప్రధాన్, దోనూరు అనన్య రెడ్డి రెండు మూడు స్థానాల్ని కైవసం చేసు కున్నారు. వీళ్ల గురించి ఎంత మాట్లాడుకుంటున్నారో.. 239 ర్యాంక్‌ని సంపాదించుకున్న పవన్ కుమార్ గురించీ అదే స్థాయిలో మాట్లాడుకుంటున్నారు. యూపీలోని రఘునాథ్‌పూర్ గ్రామంలో ఓ చిన్న పూరి గుడిసే పవన్ ఇల్లు. సరిగ్గా పైకప్పు కూడా లేదు. ఢిల్లీలో పరీక్షకి ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంక్ సాధించాడు పవన్. పాలిథీన్ కవర్‌లతో కప్పి ఉంది గుడిసె. ప్రస్తుతం అతని ఇంటి వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే దాదాపు రెండు సార్లు ఈ ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయిన పవన్ పట్టు వదలకుండా ప్రయత్నించాడు. మూడోసారి ఉత్తీర్ణత సాధించాడు. ఫలితంగా ఆ ఊరంతా పండగ వాతావరణమే కనిపిస్తోంది. ఊళ్లో వాళ్లంతా పవన్ ఇంటికి క్యూ కట్టారు. అందరూ వచ్చి అభినందిస్తున్నారు. ఈ వీడియోలు వైరల్ అవడం వల్ల పవన్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఎంతో మందికి స్ఫూర్తి అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు.
పవన్ కుమార్ తండ్రి పేరు ముకేశ్. ఆయన ఓ రైతు. పవన్ తల్లి సుమన్ దేవి ఇంట్లోనే ఉంటారు. పవన్‌కి ముగ్గురు చెల్లెళ్లు. 2017లో నవోదయా స్కూల్ నుంచి ఇంటర్ పాస్ అయ్యాడు. ఇంటర్ పూర్తైన తరవాత అలహాబాద్‌లో బీఏ చేశాడు. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లి అక్కడే UPSCకి ప్రిపేర్ అయ్యాడు. కోచింగ్ సెంటర్‌కి వెళ్లకుండా సొంతగా చదువుకున్నాడు. ముందు రెండు సార్లు ఫెయిల్ అయినా ఎక్కడా అధైర్యపడకుండా ప్రయత్నించి మూడోసారి విజయం సాధించాడు. ప్రస్తుతం అతని సక్సెస్‌ని కుటుంబం అంతా పండుగలా జరుపుకుంటోంది.