Warangal Road Accident: వరంగల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చెరువు కట్టపై వెళ్లుండగా ఓ ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుగురి (Five People died in Tractor overturned incident)కి చేరింది. జిల్లాలోని ఖానాపురం మండలం అశోక్‌నగర్‌ వద్ద బుధవారం మధ్యాహ్నం విషాదం జరిగింది. తొలుత ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోయినట్లు సమాచారం. 


పెళ్లి బట్టల కోసం షాపింగ్‌కు.. 
పోలీసుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఖానాపూరం మండలం పర్శా తండాకు చెందిన మహిళలు పెళ్లి బట్టల షాపింగ్ కోసం ట్రాక్టర్‌లో నర్సంపేటకు బయలుదేరారు. మర్గం మధ్యలో అశోక్ నగర్ శివారులోని చెరువు కట్ట మీదుగా వెళ్తుండగా అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న మొత్తం ఐదుగురు చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న బంధువులు ఆసుపత్రికి చేరుకుని రోదించడం చూసేవారిని సైతం కలచివేసింది.


పెళ్లి సామగ్రి కొనుగోలు చేయడానికి ట్రాక్టర్​లో 9 మంది నర్సంపేటకు బయలుదేరారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో శాంత‌మ్మ‌ (40), సీత‌ (45), గుగులోతు స్వామి (48), జాటోత్ గోవింద్( 65), జాటోత్ బుచ్చ‌మ్మ‌(60) మరణించినట్లు సమాచారం. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  మొదట ముగ్గురు మహిళలు శాంతమ్మ, సీత, బుచ్చమ్మ అక్కడికక్కడే చనిపోగా, గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలిస్తుండగా స్వామి, గోవింద్ మరణించారు.


దారి చిన్నది కావడంతో ప్రమాదం..
పెండ్లి షాపింగ్ కోసం వీరు ట్రాక్టర్‌లో నర్సంపేటకు వెళ్తుండగా అశోక్‌నగర్‌ వద్ద వీరికి ఎదురుగా మరో వాహనం వచ్చింది. చెరువు కట్ట చిన్నది కావడంతో, డ్రైవర్ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నం చేయగా అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తా పడటంతో విషాదం చోటుచేసుకుంది. శుభకార్యం జరుగుతుందని భావించిన ఇంట్లో ఐదుగురు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో పర్శా తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. 


Also Read: Wall Collapse in Gujarat: ఉప్పు ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం- గోడ కూలి 12 మంది మృతి!