TS Crime : భార్య అంటే భర్తలో సగం అంటారు. అలాగే భర్త చేసే పనుల్లో సగం బాధ్యత ఉంటుంది అని అంటారు. ఇది వాస్తవమని నిరూపించాలని అనుకుందో ఏమో ఓ మహిళ తన భర్తతో పాటు దొంగతనాల్లో పాలుపంచుకుంది. ఇంకేముంది ఆ మహిళ ఇచ్చిన సపోర్ట్ తో భర్త సైతం రెచ్చిపోయాడు. సొంత ఊర్లో అయితే అందరూ గుర్తుపడతారు అనుకున్నాడు ఏమో పక్కన ఉన్న రాష్ట్రాల్లో తన పనితనాన్ని చూపారు భార్యభర్తలు. పకడ్బందీగా రెక్కీ చేస్తూ ఇళ్లలో దొంగతనాలు చేసేవారు  ఆ ఇద్దరూ.  వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తూ దంపతులిద్దరూ కాలం గడిపారు. అయితే కాలం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు కదా!  చివరికి వేములవాడ పోలీసుల చేతికి చిక్కారు. ఇంతకీ ఆ దొంగ జంట కథేంటో మీరు చదవండి. 


దొంగ దంపతులు అరెస్ట్


వేములవాడ మండలంలో దొంగతనాలకు పాల్పడిన దంపతులను అరెస్ట్ చేసి వారి నుంచి 37.8 తులాల బంగారం 32.5  వెండి, రూ.11,500 నగదును రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పోలీసులు వివరాలను తెలిపారు. వేములవాడ పట్టణంలోని ప్రాంతానికి చెందిన మనోహర్ రెడ్డి ఇంటికి తాళం వేసి ఉండగా గత నెల 14న గుర్తుతెలియని వ్యక్తులు తన ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు డబ్బు ఎత్తుకెళ్లారు. మనోహర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో  సీఐ వెంకటేష్ కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసు బృందానికి సెల్ టవర్ లోకేషన్ , ఇటీవల జరిగిన దొంగతనాల ఆధారంగా సూత్రధారులు ఎవరో తెలిసింది. దొంగతనానికి పాల్పడింది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన దంపతులు తాళ్లపల్లి ధనలక్ష్మి, తాళ్లపల్లి ప్రసాద్ గా గుర్తించారు. వారిని బెల్లంపల్లిలోని బట్వానపల్లి గ్రామంలో ఇంటివద్ద పట్టుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిద్దరూ గత ఏడాది రుద్రవరంలో కూడా  దొంగతనానికి పాల్పడి బంగారు ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు. వాటిలో నుంచి సుమారు ఆరు తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 


పక్క రాష్ట్రంలో కూడా 


పక్క రాష్ట్రాల్లో కూడా  వీరు దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరూ కలిసి విజయవాడ పరిసర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజలెవరూ ఇంట్లో అధిక మొత్తంలో బంగారు ఆభరణాలు, డబ్బులు పెట్టుకోవద్దని తెలిపారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని సూచించారు. దొంగ దంపతులను అరెస్ట్ చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.


Also Read : Atmakur News : బాగా చదవడంలేదని రెచ్చిపోయిన స్కూల్ కరస్పాండెంట్, విద్యార్థులకు గాయాలు!


Also Read : Chittoor Crime : భర్త స్నేహితుడితో వివాహేత సంబంధం, ప్రియుడితో కలిసి మర్డర్!