Atmakur News : నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన విద్యార్థి నాగ ధ్రువ తేజ, రిహన్, పాములపాడుకు చెందిన విద్యార్థిని రేణుకా అనే విద్యార్థులు సరిగా చదవటం లేదంటూ బెత్తంతో తట్లు తేలేలా కొట్టాడో కరస్పాండెంట్. చితకబాదిన విషయాన్ని విద్యార్థి నాగ ధ్రువ తేజ తల్లిదండ్రులకు చెప్పగా వారు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నాగ ధ్రువ తేజను కొట్టిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరో ఇద్దరు విద్యార్థుల సంఘటన వెలుగుచూసింది. ఇంకా ఎంత మంది విద్యార్థులు దెబ్బలు తినిఉంటారో అన్నది డిపాల్ స్కూల్ లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులలో ఆందోళన నెలకొంది.
అసలేం జరిగింది?
విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో భావిభారత పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్రే కీలకం. ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి చేర్చే దైవమే ఉపాధ్యాయుడు. ఆదియుగం నుంచి ఆధునికయుగం వరకు ఆయనే రుషి. మనందరికీ విద్యా బుద్ధులు నేర్పే గురువు. అందుకే మన సమాజంలో అమ్మనాన్నల తర్వాత స్థానం గురువులకు ఇచ్చారు. కానీ ఈ మధ్య కొంత మంది ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి నీచమైన పనులు చేస్తూ ఆ వృత్తికి తలవంపులు తెస్తున్నారు. కొంత మంది విద్యార్థినులపై అకృత్యాలకు పాల్పపడుతుంటే.. క్షణికావేశంలో విద్యార్థులకు కఠిన శిక్షలు వేస్తూ వారి ప్రాణల మీదకు తెస్తున్నారు మరికొందరు. వివరాల్లోకి వెళితే ఆత్మకూరు పట్టణం కరివేన గ్రామం సమీపంలో ఉన్నటువంటి డిపాల్ స్కూల్లో పట్టణానికి చెందిన నాగ ధ్రువ తేజ 5వ తరగతి చదువుతున్నాడు. అయితే విద్యార్థి సరిగా చదవడం లేదన్న కారణంతో స్కూల్ ఫాదర్ బెనహర్ బెత్తంతో విచక్షణారహితంగా తొడ భాగంలో చితకబాదాడు. ఈ విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆత్మకూరు ఎస్సై కృష్ణమూర్తి ఫాదర్ బెనహర్ ను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం విద్యార్థిపై విచక్షణారహితంగా కొట్టిన ఫాదర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
నిజామాబాద్ లో మరో ఘటన
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు రెచ్చిపోయాడు. పరీక్షలు సరిగ్గా రాయలేదని విద్యార్థుల వీపులు వాచిపోయేలా విచక్షణ రహితంగా చితకబాదాడు ఉపాధ్యాయుడు. మాస్టారు కొట్టిన దెబ్బలకు ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. విద్యార్థులను టీచర్లు కొట్టడం మామూలే కానీ మరీ ఇంత తీవ్రంగా కొట్టడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పరీక్షలు సరిగ్గా రాయలేదని
ఎడపల్లి మండలం జానకంపేట్ ప్రభుత్వ పాఠశాలలోని అనిల్ కుమార్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థులను తీవ్రంగా కొట్టాడు. ఈ ఘటనపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు చేసే చిన్న చిన్న తప్పులకు ఇంత తీవ్రంగా కొడతారని ప్రశ్నిస్తున్నారు. పరీక్షలు సరిగా రాయలేదని విద్యార్థుల వీపులు వాచిపోయేలా విచక్షణారహితంగా టీచర్ కొట్టాడు. 8వ తరగతి చదువుతున్న విగ్నేష్ కుమార్, వరుణ్ లతో సహా మరో ముగ్గురు విద్యార్థులను అనిల్ కుమార్ అనే ఉపాధ్యాయుడు మార్కులు తక్కువ వచ్చాయని కొట్టాడు. సరిగ్గా చదవకపోతే చీరేస్తా, చెప్పుతో కొడతా అంటూ విద్యార్థులపై దుర్భాషలాడాడు. అంతేకాకుండా విద్యార్థులకు ఒళ్లంతా గాయాలు కనిపించేలా కొట్టాడు. ఆ దెబ్బలను తట్టుకోలేక విద్యార్థులు ఏడుస్తూ తల్లిదండ్రులు తెలిపారు. విద్యార్థులకు మంచి బుద్ధి చెప్పాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థులను ఇంతలా కొట్టడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఉపాధ్యాయుడు అనిల్ కుమార్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Also Read : Nizamabad News : పరీక్ష సరిగ్గా రాయలేదని రెచ్చిపోయిన టీచర్, విద్యార్థులకు గాయాలు!