Anna Canteen: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని శ్రీసత్యసాయి జిల్లా హిందుపురంలో ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర మే నెలాఖరులో అన్న క్యాంటీన్‌ ను ప్రారంభించారు. అది నేటికి వంద రోజులు పూర్తి చేసుకుంది. ఇన్ని రోజుల పేట పేద ప్రజలకు రెండు రూపాయలకే కడుపు నిండా అన్నం పెట్టింది. హండ్రెడ్ డేస్ ఘనవిజయంగా పూర్తయిన సందర్భంగా నేడు ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేక భోజనాన్ని పేదలకు అందించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే బిర్యానీ, చికెన్, గుడ్డు, ఒక స్వీటు పెట్టేలా ఏర్పాట్లు చేశారు. 


చాలా సంతోషంగా ఉంది - వసుంధర 
ఈ అన్న క్యాంటీన్ ద్వారా పేదలకు రూ. 2కే భోజనం అందిస్తున్నారు. బాలకృష్ణతో పాటు అమెరికాలో ఉంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈ అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. తన చేతుల మీదుగా ప్రారంభించిన ఈ అమ్మ క్యాంటీన్ విజయవంతంగా వంద రోజులు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని వసుంధర అన్నారు. ఎన్టీఆర్ కోడలు అయినందుకు తాను గర్వ పడుతున్నానని తెలిపారు. 


నందమూరి పురంలో మాత్రమే సాధ్యం.. 
‘ఎన్నారై ఎన్టీఆర్ అభిమానులు, నందమూరి బాలకృష్ణ కలిసి దీనిని ఏర్పాటు చేశారు. రూ. 2కే భోజనం ఇవ్వడం ఈ అన్నా క్యాంటీన్ ప్రత్యేకత. ఇలాంటిది ఎక్కడా చూసి ఉండరు. హిందూపురంలోనే ఇది సాధ్యమైందని చెప్పారు. త్వరలోనే రాష్ట్రమంతా అమలు చేస్తే బాగుంటుందని. మామ గారు ఎన్టీఆర్.. పైనుంచి ఇవన్నీ నడిపిస్తున్నారు’’ అని వసుంధర చెప్పారు. హిందూపురాన్ని వసుంధర నందమూరి పూరం అని చెప్పడం గమనార్హం. 


మరో అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన టీడీపీ నేతలు 
మరోవైపు గుంటూరులోని ఎన్టీఆర్ బస్టాండ్‌ కూడలిలో టీడీపీ ఎన్‌ఆర్ఐ విభాగం, బాలకృష్ణ అభిమానుల ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ ను ఏర్పాటు చేశారు. ఈరోజు టీడీపీ నేతలు నక్కా ఆనంద్ బాబు, తెనాలి శ్రావణ్ కుమార్ ఈ అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈ క్రమంలోనే నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ.. సామాజిక న్యాయం టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని చెప్పారు. మహానాడుకు స్పందన చూసి వైసీపీ నేతలకు వణుకు పుట్టిందన్నారు.


ఇదిలా ఉండగా తెనాలిలో అన్న క్యాంటీన్ తొలగింపు.. 
ఇటీవల తెనాలిలో అన్న క్యాంటీన్ తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. అన్న క్యాంటీన్ నిర్వహణతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుందని మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. కేవలం గంట వ్యవధిలో  నిర్వహించే అన్న క్యాంటీన్ తొలగించమనడం సరికాదని, అక్కడే నిర్వహిస్తామని టీడీపీ నేతలు అన్నారు. తెనాలి బస్టాండ్ సమీపంలో అన్న క్యాంటీన్ నిర్వహించవద్దని ఆర్టీసీ అధికారులు టీడీపీ నేతలను కోరారు. అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు బలవంతంగా అన్న క్యాంటీన్ తొలగించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. 


నారా లోకేశ్ ఫైర్.. 
అన్న క్యాంటీన్లుపై దాడులు, ప్రభుత్వం వాటిని తొలగించడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. అన్నం తినే వారెవ్వరూ అన్న క్యాంటీన్‌ను అడ్డుకోరని లోకేశ్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. నందిగామ, మంగళగిరి, కుప్పంలో అన్న క్యాంటీన్లను అడ్డుకున్నారని, ఇప్పుడు తెనాలిలో అన్న క్యాంటీన్ నిర్వహించకుండా ఆపుతున్నారని నారా లోకేశ్ మండిపడ్డారు. సీఎం జగన్ కు మానవత్వం అనేదే లేదా? అని ప్రశ్నించారు.  తెనాలిలో అన్న క్యాంటీన్‌ కు అడ్డుపడటం చూస్తే మార్కెట్ కాంప్లెక్స్ వద్ద యుద్ద వాతావరణాన్ని తలపించే విధంగా పోలీస్ పహారా పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్న క్యాంటీన్ నిర్వహించి తీరుతామని, పేద వాళ్ల ఆకలి తీరుస్తామని లోకేశ్ ట్వీట్ చేశారు.