BR Ambedkar Konaseema:

  ఈజీ మనీ (Easy Money)కి అలవాటు పడిన కేటుగాళ్లు మాయ మాటలతో నమ్మించి అమాయక ప్రజలను, చదువుకోని వారిని మోసం చేస్తున్నారు. నెలలు, సంవత్సరాలు కష్టపడి సంపాదించిన సొమ్మును సైబర్ నేరగాళ్లు చెమట చిందించకుండా, టెక్నాలజీ సాయంతో దోచేస్తున్నారు. ఆరు గాలం శ్రమించి కష్టపడ్డ సొమ్మును క్షణాల్లో కొట్టేస్తున్నారు. ఈ సైబర్ నేరగాళ్ల దోపిడీకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రధానంగా పల్లెటూళ్లలోని రైతులు, అమాయక ప్రజలనే టార్గెట్ చేసుకుని మాయ మాటలతో నమ్మించి బ్యాంక్ ఖాతాల్లో నగదు ఖాళీ చేస్తున్నారు. 


బాధితులకు ఫోన్ చేసి వారి ద్వారానే వారికి సంబంధించిన పూర్తి వివరాలు రాబడుతున్న కేటుగాళ్లు ఆఖరిగా మీ సెల్ ఫోన్ కు ఓ నెంబర్ వస్తుంది.. అది చెప్పగలరని నైస్ గా అడిగి క్షణాల్లో వారి బ్యాంక్ అకౌంట్లలో దాచుకున్న డబ్బును కాజేస్తున్నారు. సరిగ్గా ఇటువంటి ఉదంతమే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి గ్రామంలో జరిగింది. 


గ్రామానికి చెందిన కొల్లు ఆనందరావు అనే రైతు తన పొలంలో పండించిన పంట తాలూకు ధాన్యం అమ్మిన రూ.8,49,720 సొమ్ము ఇటీవలే తన హెచ్‌డీ ఎఫ్‌సీ బ్యాంకు ఖాతాలోకి జమ అయ్యింది. శుక్రవారం రైతు ఆనందరావుకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. బ్యాంకు హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామని, మీ పేరు, సెల్ ఫోన్ నెంబరు చెప్పాలని అడిగాడు. ఆతరువాత వీటిని దృవీకరించుకున్నామని, ఇప్పుడు మీ సెల్ ఫోన్ కు ఓ మెసేజ్ వస్తుందని, అది చెప్పాలని ఫోన్ చేసిన వ్యక్తి సూచించాడు. బ్యాంకు నుంచి వివరాలు అడుగుతున్నారని అనుకున్న సదరు రైతు ఆనందరావు వెంటనే ఓటీపీ చెప్పాడు. 
ఫోన్ కట్, బ్యాంక్ ఖాతా ఖాళీ
ఆ తరువాత ఫోన్ కట్ అయ్యింది. తీరా మరో మెసేజ్ ఓపెన్ చేసి చూసే సరికి అందులో రూ.3లక్షలు నగదు వేరే ఖాతాలోకి బదిలీ అయినట్లు సమాచారం వచ్చింది. లబోదిబో మంటూ వెంటనే బ్యాంకుకు పరుగులు తీస్తే అందులో జితేంద్ర సింగ్ అనే పేరుమీద ఉన్న ఎకౌంట్ కు రూ.3 లక్షలు నగదు బదిలీ అయినట్లు తేలింది. వెంటనే ఉప్పలగుప్తం పోలీసులకు ఆనందరావు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జి. వెంకటేశ్వరరావు తెలిపారు. 


అప్రమత్తంగా వ్యవహరించాలి.. 
బ్యాంకులు కానీ, మరే ప్రభుత్వ సంస్థల నుంచి కానీ ఫోన్ల ద్వారా వ్యక్తిగత సమాచారం తీసుకోరని పోలీసులు, సైబర్ నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా ఆధార్ నెంబర్, బ్యాంకు ఎకౌంట్ నెంబర్, ఓటీపీ ఇలా ఏ సమాచారం అడిగినా వెంటనే అప్రమత్తం అయ్యి ఆ వ్యక్తులకు సమాచారం ఇవ్వకూడదని పోలీసులు చెబుతున్నారు. ఇటువంటి ఫోన్ కాల్స్ వస్తే వాటిని వెంటనే కట్ చేయడమే మేలని, ముఖ్యంగా రైతులు మరీ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గతంలో కూడా ఇదే మండలానికి చెందిన పలువురు రైతులు తమ ఖాతాల్లోనుంచి కొంత నగదును సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి పొగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి.