కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ పర్యటనలో భాగంగా.. కామారెడ్డి జిల్లా బీర్కూర్ రేషన్ షాప్ దగ్గర జరిగిన ఘటనపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి తన ఇంట్లో నుంచి డబ్బు తెచ్చి దాన ధర్మాలు చేస్తున్నట్లు వ్యవహరించారని మండిపడ్డారు. ప్రజల ట్యాక్సుల నుంచి వచ్చిన డబ్బునే పంచుతున్నారని గుర్తుంచుకోవాలన్నారు. నిర్మలా సీతారామన్ అహంకారపూరిత వైఖరిని జనాలు ఒప్పుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఈ అహంకారాన్ని ఒప్పుకోం. ఇది ప్రజల టాక్స్ మనీ అని గుర్తుంచుకోండి. మనది ప్రజాస్వామ్యం. మీరు దానధర్మాలు చేయడం లేదు” అని గుర్తుంచుకోవాలన్నారు. #justasking హ్యాష్ ట్యాగ్ తో ఆయన ట్వీట్ చేశారు.


అటు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శిస్తుంటే.. మరికొంత మంది సమర్థిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ ఇంట్లో నుంచి డబ్బులు తెచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని ప్రకాష్ రాజ్ గుర్తుంచుకోవాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. అటు కేంద్రాన్ని బాగా నిలదీశారు అంటూ ప్రకాష్ రాజ్ కు మరికొంత మంది నెటిజన్లు సపోర్టు చేస్తున్నారు.






కామారెడ్డి జిల్లాలో ఏం జరిగిందంటే?


రాష్ట్ర పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్  కామారెడ్డి జిల్లా  బీర్కూర్ రేషన్ షాపు ను  తనిఖీ చేశారు. లబ్దిదారులతో మాట్లాడారు. రేషన్ సరుకుల పంపిణీ తీరును లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు. రేషన్ షాపులో ప్రధాని మోదీ ఫ్లెక్సీ ఎందుకు లేదని కలెక్టర్‌ను  ప్రశ్నించారు.  రేషన్ బియ్యానికి కిలోకు 35 రూపాయలు ఖర్చవుతుంటే.. అందులో 29 రూపాయలు కేంద్రం ఇస్తుందన్నారు.  నిరుపేద ప్రజలందరికీ బియ్యం అందిస్తున్న ప్రధాని ఫోటో లేకపోవడం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని ప్రతి రేషన్ షాప్ లో ప్రధాని ఫోటో  ఉండాలని ఆదేశించారు.


హరీష్ కౌంటర్.. నిర్మలా రివర్స్ కౌంటర్..


అటు నిర్మలా సీతారామణ్ తీరుపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ స్పందించారు.  ఆమె అసత్యాలు, అర్థసత్యాలు మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేషన్ షాపుల్లో ప్రధాని ఫోటోలు లేవంటూ ప్రధాని స్థాయిని నిర్మలా సీతారామన్ దిగజార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై నిర్మల సీతారామన్ రివర్స్ ఎటాక్ చేశారు.  ముందు నీ రాష్ట్రంలో ఎంత మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారో తెలుసుకోవాలన్నారు.  రైతులపై మీకు అంత ప్రేమ ఉంటే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో చెప్పాలని నిర్మలా డిమాండ్ చేశారు.


నిర్మలా తీరు భయపెట్టిందన్న కేటీఆర్


అటు మంత్రి కేటీఆర్ సైతం నిర్మలా సీతారామన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ తో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ప్రవర్తన తనను భయపెట్టిందన్నారు.  నిర్మలా సీతారామన్ వింతైన ప్రవర్తన చూపించారని విమర్శించారు.  రోడ్లమీద తిరిగే ఈ రాజకీయ నాయకులు కష్టపడి పనిచేసే అధికారులను కూడా నిరుత్సాహపరుస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  కలెక్టర్ జితేష్  పాటిల్ గౌరవప్రదమైన ప్రవర్తనకు అభినందనలు అంటూ కేటీఆర్  ట్వీట్ చేశారు. 


Also Read : ఎన్టీఆర్‌ను టార్గెట్ చేసిన కేసీఆర్? - దెబ్బకు రెండున్నర కోట్ల నష్టం


Also Read : ఫ్లాప్‌ల‌తో క‌ట్టిన స్టార్‌డ‌మ్ కోట - ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ క్రేజ్ వేరే లెవల్