PD Act On Job Cheater: రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురి వద్ద డబ్బులు తీసుకుని మోసం చేసిన నిందితుడు, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్న కుమారుడు పొన్నాల భాస్కర్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దాదాపు రూ. 10 కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డ పొన్నాల భాస్కర్ పై  రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. 


బ్యాక్ డోర్ నుంచి ఎంట్రీ ఇప్పిస్తానంటూ.. 
రైల్వేలో ఉద్యోగాలు (Indian Railway Jobs 2022) ఇప్పిస్తానని పొన్నాల భాస్కర్ నిరుద్యోగులకు మాయ మాటలు చెప్పేవాడు. తనకు రైల్వే బోర్డులో పలుకుబడి ఉందని, అందువల్ల ఎలాంటి పరీక్షలు అవసరం లేకుండానే ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించేవాడు. బ్యాక్ డోర్ నుండి ఎంట్రీ ఇప్పిస్తానని చెప్పాడు. అలా పలువురి నుండి కోట్లాది రూపాయలు వసూలు చేశాడు. ఎంతకీ ఉద్యోగం రాకపోవడం, ఆ ప్రక్రియ ఏమాత్రం ముందుకు సాగకపోవడంతో అతనికి డబ్బులు ఇచ్చిన వాళ్లు మోసపోయామని గ్రహించారు. పోలీసులను ఆశ్రయించిన తాము మోసపోయిన తీరును వివరించి ఫిర్యాదు చేశారు. 


గ్రూప్ సీ ఉద్యోగానికి పది లక్షల వరకూ.. 
రైల్వేలో టికెట్ కలెక్టర్, కమర్షియల్ క్లర్క్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించిన పొన్నాల భాస్కర్.. వారికి నకిలీ అపాయింట్ మెంట్ లెటర్లు, ఐడీ కార్డులు కూడా ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కొంత మందితో కలిసి పొన్నాల భాస్కర్ ఈ మోసాలకు పాల్పడినట్లు గుర్తించి అతడిని అరెస్టు చేసి చంచల్ గూడా జైలుకు తరలించారు. రైల్వేలో గ్రూప్ సి ఉద్యోగానికి రూ. 10 లక్షలు, గ్రూప్ డి పోస్టుకు రూ. 6 లక్షలు, సీడబ్ల్యూసీ గ్రూప్ సి కి రూ. 8 లక్షలు, గ్రూప్ డి ఉద్యోగానికి రూ. 7 లక్షలు వసూలు చేసినట్లు బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి మోసాల నుండి బయట పడాలంటే అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఉద్యోగాలకు డబ్బులు చెల్లించకూడదని అధికారులు చెబుతున్నారు. 


జాగ్రత్తలు..



  • ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ప్రతిభ ఆధారంగానే భర్తీ అవుతాయనే విషయాన్ని గమనించాలి. ప్రైవేటు ఉద్యోగాలు మాత్రమే రిఫరెన్స్ ల ఆధారంగా భర్తీ చేస్తారు. ప్రైవేటు వారు వారికి ఇష్టమున్న వారిని తీసుకుంటారు. కానీ ప్రభుత్వ ఉద్యోగాలు అలా కాదు. అవి చాలా పకడ్బందీగా, పారదర్శకంగా జరుగుతాయి.

  • ఉద్యోగం ఇప్పిస్తామంటే గుడ్డిగా నమ్మి మోసపోవద్దు. వాళ్లు ఎవరూ.. ఎక్కడి నుండి చేస్తున్నారు.. మోసగాళ్లా.. అనేది గుర్తించాలి. 

  • సాఫ్ట్ వేర్ సంస్థలో బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాలు వస్తాయని చెప్పి లక్షల్లో డబ్బులు కట్టించుకుని, రాత్రికి రాత్రే బోర్డు తిప్పే కన్సల్టెన్సీలు చాలానే కనిపిస్తాయి. 

  • నకిలీ ఆఫర్ లెటర్ లు, ఐడీ కార్డులను సదరు సంస్థ ఇచ్చిన చిరునామాకు వెళ్లి సరి చూసుకోవాలి. అందులో ఇప్పటికే పని చేస్తున్న వారిని అడిగి తెలుసుకోవాలి. 

  • ఇలాంటి నేరాలను గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. మీలా మరికొందరు అమాయకులు మోస పోకుండా ఉంటారని అధికారులు సూచిస్తున్నారు.