Rahul Dravid on Virat Kohli: ఛేదన రారాజు విరాట్ కోహ్లీకి (Virat Kohli) టీమ్‌ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) అండగా నిలిచాడు. బయటి వ్యక్తులు అతడి స్కోర్లపై అతి ఆసక్తి ప్రదర్శిస్తున్నారని అన్నాడు. జట్టు అవసరాలకు సరిపడా పరుగులు చేస్తున్నప్పటికీ జనాలు గణాంకాల పట్ల మోజు చూపిస్తున్నారని వివరించాడు. హాఫ్ సెంచరీలు, సెంచరీల గురించే ఆలోచిస్తున్నారని స్పష్టం చేశాడు. పాక్‌తో సూపర్ 4 మ్యాచుకు ముందు ద్రవిడ్ మీడియాతో మాట్లాడాడు.
'హాంకాంగ్ మ్యాచులో విరాట్ కోహ్లీ సూపర్‌గా ఆడాడు. అతడి ప్రదర్శన పట్ల మేం సంతోషంగా ఉన్నాం. దాదాపుగా నెల రోజుల విరామం తర్వాత అతడు పునరాగమనం చేశాడు. ఎంతో తాజాగా కనిపిస్తున్నాడు. ప్రతి మ్యాచు ఆడాలని కోరుకుంటున్నాడు. అయితే ఇంతకు ముందులా కాదులెండీ' అని ద్రవిడ్ అన్నాడు.
'కొన్నిసార్లు విరాట్ కోహ్లీ ఎప్పుడూ ఆన్‌లో ఉన్నట్టే అనిపిస్తుంది. అంటే గతంలో లేడని కాదు. అతడు విరామం తీసుకొని సరికొత్తగా, ప్రశాంతంగా తిరిగొచ్చినందుకు సంతోషం. కొన్ని మ్యాచుల్లో ఎక్కువ సేపు క్రీజులో ఉండే అవకాశం దక్కింది. ఇక నుంచి టోర్నీలో అతడు రెచ్చిపోతాడనే అనిపిస్తోంది' అని రాహుల్ పేర్కొన్నాడు.
జట్టు యాజమాన్యం విరాట్ కోహ్లీని జనాల దర్పణంలోంచి చూడాలనుకోవడం లేదని మిస్టర్ డిఫెండబుల్ అన్నాడు. ప్రతిసారీ భారీ స్కోర్లు చేయాలన్న ఒత్తిడేమీ లేదన్నాడు.
'విరాట్ ఎన్ని పరుగులు చేస్తాడన్నది మాకసలు ముఖ్యమే కాదు. అతడి విషయంలో ప్రజలు గణాంకాలు, సెంచరీల పట్ల అతి ఆసక్తి ప్రదర్శిస్తున్నారని మాకు తెలుసు. ఆట సాగేటప్పుడు వివిధ దశల్లో అతడు జట్టుకు ఉపయోగపడే పరుగులు ఎన్ని చేస్తాడన్నదే మాకు ముఖ్యం. అవి 50, 100ల్లోనే ఉండాల్సిన పన్లేదు. టీ20 క్రికెట్లో జట్టు అవసరాల మేరకు చేసే 10-20 రన్స్ సైతం కీలకం. భారీ ప్రదర్శన చేసేందుకు విరాట్ ఎప్పుడూ సిద్ధమే. ఇకపై టోర్నీల్లో అలాగే ఆడతాడని ఆశిద్దాం' అని ద్రవిడ్ అన్నాడు.
కొన్ని నెలలుగా భారీ స్కోర్లు చేసేందుకు విరాట్ కోహ్లీ ఇబ్బంది పడ్డాడు. తీవ్ర ఒత్తిడిని అనుభవించాడు. ఆసియా కప్ ముందు నెల రోజులు విరామం తీసుకున్నాడు. ప్రస్తుతం తాజాగా కనిపిస్తున్నాడు. పాక్‌తో మ్యాచులో 35, హాంకాంగ్‌పై 59*తో నిలిచాడు.