Cyrus Mistry Demise: ప్రముఖ వ్యాపారవేత్త, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ ఇక లేరు. ఆదివారం ఆయన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ముంబయి సమీపంలోని పాల్ఘడ్‌లో ఆయన కారు ప్రమాదానికి గురైంది. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించగా మరణించారని వైద్యులు ధ్రువీకరించారు. డ్రైవర్ సహా ఆయనతో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. వారిని గుజరాత్‌లోని ఆస్పత్రికి తరలించారు.
'టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అహ్మదాబాద్ నుంచి ముంబయికి వెళ్తుండగా ఆయన కారు డివైడర్‌ను ఢీకొట్టింది. మొత్తం నలుగురు ప్రయాణిస్తున్నారు. ఘటనా స్థలంలోనే ఇద్దరు మరణించగా మరో ఇద్దరిని ఆస్పత్రికి తీసుకెళ్లారు' అని పోలీసులు వెల్లడించినట్టు ఏఎన్‌ఐ రిపోర్టు చేసింది.
అహ్మదాబాద్ నుంచి ముంబయికి మెర్సిడేస్ వాహనంలో ప్రయాణిస్తుండగా సాయంత్రం 3:15 గంటలకు ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. సూర్య నదిపై బ్రిడ్జీపై ప్రమాదం చోటు చేసుకుందని వివరించారు.
టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి 2012లో రతన్ టాటా తప్పుకున్నారు. పల్లోంజీ మిస్త్రీ కుమారుడైన సైరస్ మిస్త్రీ ఆ బాధ్యతలను స్వీకరించారు. నాలుగేళ్ల తర్వాత ఆయన్ను పదవిలోంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆయన ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తుండటం గమనార్హం.
Also Read: మిస్త్రీ అంటే యంగ్ & డైనమిక్! విజన్ ఉన్నా మిషన్ పరంగా టాటాతో విభేదాలు!!
Also Read: ఇండియా ఎకానమీని విశ్వసించిన నిఖార్సైన వ్యాపారవేత్త - మిస్త్రీకి ప్రధాని నివాళి
ఏక్ నాథ్ షిండే దిగ్భ్రాంతి
'టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మరణించారని తెలిసి దిగ్భ్రాంతి చెందాను. ఆయన అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్త. చిన్న వయసు నుంచే ఇండస్ట్రీలో తెలివైన, భవిష్యత్తుపై ప్రభావం చూపగలిగే వ్యక్తిగా ఉండేవారు. నైపుణ్యాలు గల వ్యాపారవేత్త మనల్ని వదిలి వెళ్లిపోయారు. ఇది మిస్త్రీ కుటుంబానికే కాదు దేశ పరిశ్రమకూ తీరని లోటు. ఆయనకు నివాళి అర్పిస్తున్నా' అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అన్నారు.