Cyrus Mistry demise: టాటా గ్రూప్‌ మాజీ ఛైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ మరణించారని తెలియడంతో వ్యాపార ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కారు ప్రమాదంలో దుర్మరణం చెందారని తెలియడం దిగ్భ్రాంతికి గురైంది. భారత ఆర్థిక, వాణిజ్య రంగాలు ఓ దార్శనికుడిని కోల్పోయాయని ప్రముఖులు సంతాపం తెలియచేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఆనంద్‌ మహీంద్రా సహా ప్రముఖులు ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.




ప్రధాని మోదీ నివాళి


'సైరస్‌ మిస్త్రీ అకాల మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. భారత ఆర్థిక వ్యవస్థను అత్యంత విశ్వసించిన నిఖార్సైన వ్యాపారవేత్త. వ్యాపార, వాణిజ్య రంగాలకు ఆయన లేని లోటు తీర్చలేనిది. ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు నా ప్రగాఢ సంతాపం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి' అని ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్‌ చేశారు.


ఏక్ నాథ్ షిండే దిగ్భ్రాంతి


'టాటా సన్స్‌ మాజీ ఛైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ మరణించారని తెలిసి దిగ్భ్రాంతి చెందాను. ఆయన అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్త. చిన్న వయసు నుంచే ఇండస్ట్రీలో తెలివైన, భవిష్యత్తుపై ప్రభావం చూపగలిగే వ్యక్తిగా ఉండేవారు. నైపుణ్యాలు గల వ్యాపారవేత్త మనల్ని వదిలి వెళ్లిపోయారు. ఇది మిస్త్రీ కుటుంబానికే కాదు దేశ పరిశ్రమకూ తీరని లోటు. ఆయనకు నివాళి అర్పిస్తున్నా' అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే అన్నారు.




ఎన్‌.చంద్రశేఖరన్‌, టాటా సన్స్‌ ఛైర్మన్‌


'సైరస్‌ మిస్త్రీ అకాల మరణం చెందారని తెలిసి ఎంతో బాధకు గురయ్యాను. ఆయనకు జీవితంపై ఎంతో అభిరుచి ఉండేది. చిన్న వయసులోనే ప్రమాదానికి గురై వెళ్లిపోవడం బాధాకరం. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి' అని టాటాసన్స్‌ ప్రస్తుత ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ అన్నారు.


నిర్మలా సీతారామన్ షాక్


'సైరస్‌ మిస్త్రీ మరణం కలచివేసింది. మౌలిక సదుపాయాలు, మౌలిక ప్రాజెక్టుల వ్యాపారాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లేందుకు అంకితభావంతో పనిచేశారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో భాగమయ్యారు. ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి' అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.




ఆనంద్ మహీంద్రా సంతాపం


'ఈ వార్తను జీర్ణించుకోలేక పోతున్నాను. టాటా హౌజ్‌ అధినేతగా స్వల్ప కాలమే ఉన్నా మెరుగ్గానే పనిచేశారని తెలుసుకున్నా. ఆయనెంతో గొప్పవారు. జీవితం ఆయన కోసం ఇతర ప్రణాళికలు సిద్ధం చేస్తే అలాగే ఉండనివ్వండి. కానీ జీవితం ఆయన్నుంచి ఇలా వెళ్లిపోవాల్సింది కాదేమో. ఓం శాంతి' అని ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్‌ మహీంద్రా అన్నారు.


మిత్రుడిని కోల్పోయిన కేటీఆర్


'ఒక్కసారిగా షాకయ్యాను! ఎనిమిదేళ్లుగా ఆయన నాకు మంచి మిత్రుడు. ఎంతో గౌరవంగా, హుందాగా, మానవత్వంతో ఉండేవారు. సైరస్‌ మిస్త్రీ ఇక లేరు. మీ ఆత్మకు శాంతి కలగాలి. మరో మంచి వ్యక్తి తొందరగా వెళ్లిపోయారు' అని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అంజలి ఘటించారు.