Halla Bol in Delhi: 


హల్లాబోల్ కార్యక్రమం..


నిత్యావసర ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం సమస్యలను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ కొంత కాలంగా నిరసనలు చేపడుతూనే ఉంది. అందులో భాగంగానే...ఢిల్లీ వేదికగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. "Halla Bol" (గొంతెత్తి నినదించటం) పేరిట జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు. "దేశ ప్రజలు ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు పడుతుంటే...రాజుగారు (ప్రధాని మోదీ) కొత్త స్నేహితుల్ని సంపాదించుకునే పనిలో ఉన్నారు" అంటూ సెటైర్లు వేశారు. ఇవాళ దేశ ప్రజలు ఏ వస్తువు కొనాలన్నా ఒకటికి పది సార్లు ఆలోచించాల్సి వస్తోందని, అంతగా ధరలు పెరిగాయని మండిపడ్డారు. దీనంతటికీ కారణం..ప్రధాని మోదీయేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలపై నినదిస్తూనే ఉంటామని, రాజుగారు (మోదీ) వినేంత వరకూ తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఈ కార్యక్రమం నిర్వహించింది కాంగ్రెస్. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు కేంద్రానికి వ్యతిరేకంగ నిరసనలు చేపట్టారు. బంగా భవన్ నుంచి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ హెడ్‌క్వార్టర్స్‌కు ర్యాలీగా వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ఈ అరెస్టులపై వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ కేవలం రామ్‌ లీలా మైదానంలో నిరసనలు చేపట్టేందుకు అనుమతి తీసుకుందని, మిగతా ప్రాంతాల్లో ఆందోళనలు చేసినందుకే అరెస్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఇది ఎన్నికల కోసం చేసిన  కార్యక్రమం కాదని, కేవలం కేంద్ర వైఫల్యాన్ని, ప్రజల కష్టాల్ని వివరించేందుకేనని కాంగ్రెస్ సీనియర్ లీడర్ జైరాం రమేష్ స్పష్టం చేశారు.