Man Suicide: ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నాడు. భార్యను చక్కగా చూసుకుంటూ కాపురం చేసుకున్నాడు. వారి అన్యోన్య దాంపత్యానికి ప్రతిరూపాలుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే ఆ తర్వాత నుంచి భార్యలో మార్పు వచ్చింది. అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. విషయం తెలుసుకున్న భర్త ఎన్ని సార్లు వద్దని చెప్పినా వినలేదు. పెద్దల మధ్య పంచాయితీ పెట్టించినా... పట్టించుకోకుండా ప్రియుడితో కలిసి భర్తపై బెదిరింపులకు దిగింది. ఎలాగైనా నిన్ను నీ పిల్లల్ని, నీ భార్యే చంపేస్తుందంటూ ఆమె ప్రియుడు కూడా వేధింపులకు పాల్పడ్డాడు. అది తట్టుకోలేని యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.


మరో వ్యక్తితో వివాహేతర సంబంధం.. 
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నల్లెల్ల గ్రామానికి చెందిన కొమిరె జంపయ్య, నాగేంద్ర భార్యాభర్తలు. జంపయ్య భార్య నాగేంద్ర.. నల్లెల్ల గ్రామానికే చెందిన తోట నరేశ్‌తో రెండేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం భర్తకి తెలిసి పలుమార్లు వద్దని భార్యను వారించాడు. అయినా భార్యలో మార్పు రాకపోవడంతో నరేశ్, జంపయ్య మధ్య గొడవలు కూడా జరిగాయి. నరేశ్ తన తీరు మార్చుకోకపోవడంతో.. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి జరిమానా కూడా విధించారు. అయితే తమ విషయం పది మందిలో పెట్టి పరువు తీశాడన్న కారణంతో.. భార్య నాగేంద్ర తరచూ జంపయ్యతో గొడవ పడుతూ వస్తోంది. ఈ క్రమంలో నాలుగు రోజుల కిందట భర్తతో గొడవ పడిన నాగేంద్ర రాజోలులోని పుట్టింటికి వెళ్లిపోయింది. దాంతో శుక్రవారం నరేశ్.. జంపయ్యను తీసుకొని మహబూబ్‌బాద్ వెళ్లాడు. 


భార్య చంపడం కంటే తాను చనిపోవడమే బెటర్ అని.. 
అక్కడ ఇద్దరూ మాట్లాడుకుంటుంటగా... నాగేంద్ర నిన్ను, నీ పిల్లల్ని చంపేస్తుందంటూ జంపయ్యకు చెప్పాడు నరేష్. నిజంగానే తన భార్య తనను, అభంశుభం తెలియని తన పిల్లలను చంపేస్తుందని భావించిన జంపయ్య కన్నీరుమున్నీరుగా విలపించాడు. అనంతరం అదే విషయాన్ని వరంగల్‌లో ఉంటున్న సోదరుడు ఎల్లయ్యకు ఫోన్ చేసి చెప్పాడు. నా పిల్లలను నువ్వే కాపాడాలంటూ సోదరుడికి వివరించాడు. పరువు పోయి, భార్యతో హత్య చేయించుకోవడం కంటే తానే చనిపోవడం నయమంటూ కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఇక తనకు బతకడం ఇష్టం లేదని.. ఇలా బతకలేనంటూ ఫోన్ కట్ చేశాడు. తమ్ముడు ఏం చేసుకుంటాడోనన్న భయంతో ఎల్లయ్య వెంటనే ఆ ఊర్లో వాళ్లకి ఫోన్ చేసి చెప్పాడు. వాళ్లు జంపయ్య ఇంటికి వెళ్లి చూసే సరికి ఉరేసుకుని కనిపించాడు. అదే విషయాన్ని ఎల్లయ్యకు ఫోన్ చేసి చెప్పగా వెంటనే అతను సోదరుడి ఇంటికి బయలుదేరి వచ్చాడు. 


నరేష్ ఇంటి ముందు మృతదేహంతో ఆందోళన 
జంపయ్య మృతికి నరేశ్ కారణమంటూ మృతదేహాన్ని అతని ఇంటి ముందు వేసి ఆందోళన చేపట్టారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నాగేంద్ర, నరేశ్‌ లపై కేసు నమోదు చేశారు. అలాగే పిల్లలను నాగేంద్ర దగ్గర ఉంచకూడదని.. ఆమె ఆ పిల్లలిద్దరినీ చంపేసే అవకాశం ఉందని జంపయ్య సోదరుడు ఎల్లయ్య ఆరోపిస్తున్నారు. నాగేంద్ర, నరేష్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.