గడ్డి అన్నారం బీజేపీ కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డిపై మరో కిడ్నాప్ కేసు నమోదైంది. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం ఆయనపై రెండు కిడ్నాప్ కేసులు ఉన్నాయి. గత 28న జయశంకర్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసినట్లుగా ఫిర్యాదు నమోదైంది. కార్పొరేటర్ కార్యాలయంలో నిర్భందించి బెదిరింపులు చేసినట్లుగా అందులో పేర్కొన్నారు. కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డితో పాటు పునిత్, రవి వర్మ, హేమంత్, కోటేశ్వరరావుపై కూడా కేసు నమోదైంది. స్థానిక పీ ఎన్ టీ కాలనీలో సుబ్రహ్మణ్యం కిడ్నాప్ కేసులో ఇప్పటికే ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. కార్పొరేటర్ తో పాటు మరో 9 మందికి రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.


అసలు ఏం జరిగిందంటే
శుక్రవారం (సెప్టెంబరు 2) వెలుగులోకి వచ్చిన కిడ్నాప్ కేసుకు సంబంధించిన వివరాలను ఎల్బీ నగర్‌ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ సీతారాం శనివారం సరూర్‌ నగర్‌ పోలీస్ స్టేషన్ లో ప్రెస్ మీట్ మీట్ నిర్వహించి తెలిపారు. తనకు రాజకీయంగా అడ్డు వస్తు్న్న వ్యక్తిని బెదిరించాలని, అతని కొడుకును శారీరకంగా హింసించాలని ఆ కార్పొరేటర్ పథకం పన్నారని పోలీసులు చెప్పారు. చివరికి కార్పొరేటర్‌ దొరికిపోయారు. బీజేపీ కార్పొరేటర్‌ ప్రేమ్ మహేశ్వర్‌రెడ్డి సహా 10 మంది నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారు.


అంతా కలిసి కుట్ర
సరూర్‌ నగర్‌ పీఅండ్‌టీ కాలనీలో బీజేపీ నేత లంకా లక్ష్మీనారాయణకు, గడ్డి అన్నారం డివిజన్‌ బీజేపీ కార్పొరేటర్‌ బద్దం ప్రేమ్‌ మహేశ్వర్‌ రెడ్డికి మధ్య రాజకీయంగా పడడం లేదు. అంతేకాక, తమ బంధువర్గంలోని ఒక వివాహితతో లక్ష్మీనారాయణ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే ఆరోపణలతో ఇంకో బీజేపీ కార్యకర్త శ్రవణ్‌ కూడా ఆయనపై కోపంగా ఉన్నాడు. శ్రవణ్‌, ప్రేమ్‌ మహేశ్వర్‌ రెడ్డి కలిసి లక్ష్మీనారాయణను కిడ్నాప్‌ చేసేందుకు కుట్ర పన్నారు. లక్ష్మీనారాయణకు, అతనికి వరుసకు సోదరుడయ్యే లంకా మురళికి మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి. వాటి పరిష్కారానికి ప్రేమ్‌ మహేశ్వర్‌ రెడ్డి దగ్గరకు వచ్చిన మురళి కుట్రలో భాగం అయ్యాడు. పథకం అమలు కోసం మహేశ్వర్‌ రెడ్డి బీజేపీ మద్దతుదారు, రాష్ట్ర సక్రెటేరియట్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న పునీత్‌ తివారీ అనే వ్యక్తిని సంప్రదించారు. 


ఈనెల ఒకటిన పునీత్‌ వనస్థలిపురంలో ఉండే విద్యార్థి పాతబోయిన మంజునాథ్‌ (24), ప్రైవేటు ఉద్యోగి పాలపర్తి రవి (38), విద్యార్థులు కందల పవన్‌ కుమార్‌ రెడ్డి(24), రవల హేమంత్‌(23), కార్‌ వాషింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడు రేవళ్లి చంద్రకాంత్‌ (24), ఉద్యోగి బలివాడ ప్రణీత్‌(25), కుంభగిరి కార్తీక్‌ (25), చికెన్‌ సెంటర్‌ నిర్వాహకుడు రవి వర్మ(24), మహేశ్‌, మారుతి, సాయి కిరణ్‌తో కలిసి పథకం పన్నారు. అర్ధరాత్రి సమయంలో 2 కార్లలో లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లారు. ఆయన నిద్ర పోతుండడంతో, వినాయక మండపం వద్ద ఉన్న ఆయన రెండో కుమారుడు సుబ్రహ్మణ్నాన్ని కిడ్నాప్ చేసి నల్గొండ జిల్లా చింతపల్లి దగ్గరకు తీసుకెళ్లారు.


బలి ఇస్తామని మాట్లాడుకున్నారు - బాధితుడు
అదేరోజు రాత్రి బాధితుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎల్బీ నగర్‌ ఎస్‌వోటీ, సరూర్‌ నగర్‌ పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కిడ్నాపర్లు చింతపల్లిలో ఉన్నట్లు గుర్తించి, శుక్రవారం సాయంత్రం చింతపల్లి సమీపంలో నిందితుల్ని పట్టుకున్నారు. బాధితుడిని విడిపించి 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో శ్రవణ్‌, మహేశ్‌, లంకా మురళీ, మారుతీ, సాయి కిరణ్‌లు పరారీలో ఉన్నారు. కారులో తీసువెళ్తూ తనను తీవ్రంగా కొట్టారని, సిగరెట్లతో కాల్చారని బాధితుడు సుబ్రహ్మణ్యం ఆవేదన చెందాడు. ఓ ఆలయం వద్దకు తీసుకెళ్లి బలిస్తామని, స్నానం చేయాలని మెడలో పూలదండ కూడా వేశారని బాధితుడు సుబ్రహ్మణ్యం చెప్పుకొచ్చాడు. అయితే, తాజాగా బీజేపీ కార్పొరేటర్ పై మరో కిడ్నాప్ కేసు నమోదు కావడం చర్చనీయాంశం అయింది.