ఏబీపీ దేశం చేసిన ఓ కథనం తెలంగాణ ఆర్టీసీ కొత్త బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు కారణం అయింది. వినూత్న రీతిలో చేసిన ఆ ట్రావెల్ వ్లాగ్స్, సదరు మార్గంలో బస్సులు నడపడం ఎంత ప్రాధాన్యమో ఆర్టీసీ గుర్తించింది. ఆ మేరకు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న పొచ్చెర, కుంటాల జలపాతాలకు టీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి శని, ఆదివారాల్లో సూపర్ లగ్జరీ బస్సు, నిజామాబాద్, నిర్మల్ నుంచి ఆదివారం ఎక్స్ ప్రెస్ బస్సులను రెండు జలపాతాలకు నడపనున్నట్లుగా టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది.
వారం రోజుల క్రితం ఏబీపీ దేశం ప్రతినిధి శ్రీనాథ్ చావలి రెండు ట్రావెల్ వ్లాగ్స్ చేశారు. అతి తక్కువ ఖర్చుతో పర్యటక ప్రదేశాలను చూసి రావడం ఎలాగో చూపించే వ్లాగ్స్ అవి. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ నుంచి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న కుంటాల, పొచ్చెర జలపాతాలకు ఎలా వెళ్లాలో చూపించారు. అతి తక్కువ ఖర్చుతో వాటిని సందర్శించడం కోసం ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్ ను ఆశ్రయించకుండా, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అయిన టీఎస్ఆర్టీసీని ఏబీపీ దేశం ప్రతినిధి ఎంచుకున్నారు. అలా తొలుత పొచ్చెర జలపాతానికి వెళ్లారు.
MGBS నుంచి ప్రయాణం
ముందుగా ఎంజీబీఎస్ నుంచి నిర్మల్ వెళ్లే సూపర్ లగ్జరీ బస్సు ఎక్కారు. నిర్మల్ బస్టాండ్ కు చేరుకొని అక్కడి నుంచి పొచ్చెర జలపాతం చేరుకొనేందుకు బోథ్ వెళ్లే పల్లె వెలుగు బస్సు ఎక్కారు. నిర్మల్ నుంచి 40 కిలో మీటర్ల దూరంలో పొచ్చెర జలపాతం ఎంట్రన్స్ వస్తుంది. అక్కడి నుంచి పొచ్చెర జలపాతానికి ఒకటిన్నర కిలో మీటర్ల దూరం. ఆ మార్గంలో ఎలాంటి పబ్లిక్, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ లేకపోవడంతో ఏబీపీ దేశం ప్రతినిధి నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది.
కుంటాల వాటర్ ఫాల్స్ కు ఇలా..
నిర్మల్ బస్టాండ్ నుంచి కుంటాలా జలపాతం 47 కిలో మీటర్ల దూరంలో ఉంది. నిర్మల్ నుంచి నేరేడిగొండ క్రాస్ రోడ్స్ వెళ్లే బస్సు ఎక్కి అక్కడ దిగారు. నేరేడిగొండ క్రాస్ రోడ్స్ నుంచి 13 కిలో మీటర్ల దూరంలో కుంటాల వాటర్ ఫాల్స్ ఉంది. కానీ, ఆ 13 కిలో మీటర్ల దూరం పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లేదు. కాబట్టి, వాటర్ ఫాల్ వద్దకు తీసుకెళ్లి, తీసుకొచ్చేందుకు ఓ ప్రైవేటు ఆటోను మాట్లాడుకోవాల్సి వచ్చింది.
మొత్తానికి ఈ రెండు ట్రావెల్ వ్లాగ్స్ ఆగస్ట్ 27, 28 తేదీల్లో ఏబీపీ దేశం యూట్యూబ్ ఛానెల్ లో పబ్లిష్ అయ్యాయి. సంబంధిత లింక్స్ ను ఏబీపీ దేశం, శ్రీనాథ్ ట్విటర్ అకౌంట్ల ద్వారా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు ట్వీట్ చేశారు. ఆయన అందుకు వెంటనే స్పందించి వాటర్ ఫాల్స్ సందర్శనకు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఎంచుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆ ట్వీట్స్ ను రీట్వీట్ చేశారు.
హైదరాబాద్ నుంచి శని, ఆదివారాల్లో
ఇది జరిగిన రెండు రోజులకు ప్రతి శని, ఆదివారం కుంటాల, పొచ్చెర జలపాతాలకు బస్సులను నడుపుతున్నట్లుగా టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఈ బస్సు ఎంజీబీఎస్- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు - పొచ్చెర జలపాతం - కుంటాల జలపాతం మధ్య నడుస్తుంది. హైదరాబాద్ నుంచి కుంటాల జలపాతానికి సూపర్ లగ్జరీ బస్సు సర్వీస్ నెంబరు 99999 అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ ట్వీట్ చేసింది. ఈ సర్వీస్ ఎంజీబీఎస్ ప్లాట్ ఫాం నెంబరు 55, 56 నుంచి ఉదయం 5 గంటలకు బయలుదేరి తొలుత పోచంపాడ్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉదయం 10 గంటలకు చేరుతుంది. 11 గంటల వరకూ అక్కడే ఉంటుంది. అనంతరం పొచ్చెర జలపాతానికి మధ్యాహ్నం 12.15 కు చేరుతుంది. 1.30 వరకూ సందర్శకులు అక్కడే గడపవచ్చు. మళ్లీ కుంటాల జలపాతానికి బస్సు మధ్యాహ్నం 2 కు చేరుతుంది. మళ్లీ సాయంత్రం 5 గంటల వరకూ బస్సు అక్కడే ఉంటుంది. మధ్యాహ్న భోజనం కుంటాలలో ఉంటుంది. రాత్రి భోజనం చేగుంటలో ఉంటుంది. బస్సు తిరిగి హైదరాబాద్ కు రాత్రి 10.45 కు చేరుతుంది.
టికెట్ ధరలు ఇవీ
హైదరాబాద్ నుంచి నడిచే ఈ సర్వీసుకు పెద్దలకు ఒక్కరికి రూ.1099, పిల్లలకు రూ.599 ఛార్జీగా నిర్ణయించారు. భోజన ఖర్చులు ప్రయాణికులే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ బస్సు శని, ఆదివారాల్లో మాత్రమే నడుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలకు 7382842582 నెంబరును సంప్రదించవచ్చు.
నిజామాబాద్ నుంచి కూడా..
ప్రతి ఆదివారం నిజామాబాద్ నుంచి ఉదయం 8 గంటలకు కుంటాల జలపాతానికి బస్సు బయలుదేరుతుంది. నిర్మల్ నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరుతుంది. పొచ్చెర జలపాతం నుంచి ఉదయం 10.15 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఉండొచ్చు. కుంటాల జలపాతం వద్ద మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ బస్సు ఆగుతుంది.
తిరిగి నిజామాబాద్ కు సాయంత్రం 7.30 గంటలకు బస్సు చేరుతుంది. ఇందుకు ఛార్జీలు పెద్దలకు రూ.420, పిల్లలకు రూ.230 గా నిర్ణయించారు. టిఫిన్లు, భోజనాల ఖర్చులు ప్రయాణికులవే. నిజామాబాద్, నిర్మల్ నుంచి నడిచే బస్సులు ఆదివారం మాత్రమే అందుబాటులో ఉంటాయి. టికెట్లను www.tsrtconline.in లో బుక్ చేసుకోవచ్చు.