Chittoor Crime : వివాహేతర సంబంధం అనే మాయలో పడి పండంటి కాపురాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు కొందరు. భర్త స్నేహితుడిపై వ్యామోహంతో, భర్త ఎదుటే ప్రియుడితో చనువుగా ఉండడం మొదలుపెట్టింది. ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించిన భర్తను ప్రియుడితో కలిసి చంపేందుకు స్కేచ్ వేసింది భార్య. బండ రాళ్లతో కొట్టి దారుణంగా భర్తను హత్య చేయించిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.
అసలేం జరిగింది?
చిత్తూరు జిల్లా నగిరి మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్ కాలనీలో విజయ్, వనిత దంపతులు నివాసం ఉంటున్నారు. విజయ్ నగిరిలో మొబైల్ దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. టీఆర్ కండ్రిగ గ్రామానికి చెందిన తమిళ అరసుతో పరిచయం ఏర్పడింది. దీంతో విజయ్, తమిళ అరసులు ఎంతో స్నేహంగా మెలిగేవారు. విజయ్ సెల్ ఫోన్ దుకాణానికి అవసరమయ్యే వస్తువులను చెన్నైలో కొనుగోలు చేసేందుకు ఇద్దరు కలిసి వెళ్లేవారు. విజయ్ కు కష్ట సుఖాల్లో తమిళ అరసు అండగా నిలిచేవాడు. దీంతో ఇద్దరి మధ్య స్నేహం బలపడింది. ఈ క్రమంలో విజయ్ ఇంటికి తమిళ అరసు తరచూ వస్తూ పోయేవాడు. విజయ్ భార్యతో తమిళ అరసు పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. కొన్నాళ్ల పాటు విజయ్ కు తెలియకుండా వీరి సంబంధం సాగింది. ఓ రోజు వ్యాపార నిమిత్తం ఇతర ప్రాంతానికి వెళ్లిన విజయ్ అనుకోకుండా భార్యకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇంటికి తిరిగి వచ్చాడు. అదే సమయంలో ఆమె తన స్నేహితుడు తమిళ అరసుతో సన్నిహితంగా ఉండడాన్ని గమనించిన విజయ్ ఇద్దరిపై కోపడ్డాడు. వనిత ప్రవర్తన మార్చుకోవాలని విజయ్ హెచ్చరించాడు.
ప్రియుడితో కలిసి హత్య
అప్పటి నుంచి విజయ్ తమిళ అరసుకు ఫోన్ చేయడం మానేసి దూరంగా ఉండేవాడు. భర్త ఇంటిలో లేని సమయంలో ప్రియుడికి ఫోన్ చేసి మాట్లాడేది వనిత. తరచూ వనిత ఫోన్ బిజీ బిజీ అని రావడంతో అనుమానం వచ్చిన విజయ్ ఇంటికి వచ్చి వనితతో గొడవపడ్డాడు. తన ప్రియుడిని ఇంటికి రాకుండా చేశాడన్న కోపంతో వనిత ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు ప్లాన్ వేసింది. అయితే వీరి ప్లాన్ ఫెయిల్ కావడంతో వనిత తమిళ అరసుతో గొడవకు దిగ్గింది. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను చంపేయాలని తమిళ అరసుపై ఒత్తిడి తీసుకుని వచ్చేది. ఈ క్రమంలో మరోసారి వనిత భర్తను చంపేందుకు ప్రియుడితో కలిసి పక్కా స్కెచ్ వేసింది. గత నెల 29వ తేదీన సాయంత్రం వనిత భర్త మొబైల్ షాపు వద్దకు వెళ్లి వినాయక చవితికి అవసరం అయ్యే సరుకులు కావాలని కొనుక్కోవాలని చెప్పి సరుకులు తీసుకుని ఇంటికి చేరుకుంది. ఇలా ఇంటికి చేరుకున్న వనిత ప్రియుడికి ఫోన్ చేసి సమాచారం అందించింది. తమిళ అరసు తన స్నేహితులైన సంతోష్, నాగరాజుతో కలిసి ప్లాన్ అమలు చేశాడు. ద్విచక్ర వాహనానికి పెట్రోల్ అయ్యి పోయిందని నాగరాజు వద్ద నుంచి విజయ్ కు ఫోన్ చేసిన గుండ్రాలకుప్పం క్వారీ వద్దకు పిలిపించారు. పెట్రోల్ తీసుకుని గుండ్రాజు కుప్పం క్వారీ వద్దకు వెళ్లిన విజయ్ ను తమిళ అరసు అతని స్నేహితులైన నాగరాజు, సంతోష్ లు పెద్ద బండపై నుంచి నీటి గుంతలోకి తోసే బండ రాళ్లతో కొట్టారు.
వీఆర్ఓకు ఫోన్ చేసి
ఈత రాని విజయ్ నీటి గుంతలో పడి మృతి చెందాడు. విజయ్ మృతి చెందాడని నిర్ధారణకు వచ్చిన తమిళ అరసు, నాగరాజు, సంతోష్ లు సంఘటన స్థలం నుండి పారిపోయారు. విజయ్ రాత్రి అంతా ఇంటికి రాకపోవడంతో మరుసటి రోజు విజయ్ తమ్ముడు, అతని స్నేహితులు చుట్టు ప్రక్కల ప్రాంతాలు గాలించారు. కానీ విజయ్ ఆచూకీ లభించలేదు. మరుసటి రోజు పశువుల కాపరుల సమాచారంతో క్వారీ గుంతలో పడి ఉన్న విజయ్ మృతి దేహాన్ని చూసిన విజయ్ అతని స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద స్ధితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేసిన దర్యాప్తు సాగించారు. విషయం తెలుసుకున్న వనిత గుండ్రాజుకుప్పం వీఆర్ఓకు ఫోన్ చేసి తన భర్త మృతికి కారణం తానే అని ఒప్పుకుని పోలీసులకు లొంగి పోయింది. దీంతో విజయ్ హత్యకు కారకులైన మిగిలిన ముగ్గురు నిందుతులు తమిళ అరసు, నాగరాజు,సంతోష్ లపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.
Also Read : Palnadu Accident : పల్నాడు జిల్లాలో ఘరో రోడ్డు ప్రమాదం, లారీ బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి