Jangaon: ఏపీ, తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో.. తమ ప్రాంతాలను కూడా జిల్లాలుగా మార్చాలంటూ కొందరు, ఆయా జిల్లాలకు వ్యక్తుల పేర్లు పెట్టాలని డిమాండ్లు చేశారు. అలాగే జనగామ జిల్లాకు స్వాతంత్య్ర సమరయోధులు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ జిల్లాగా నామకరణం చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకు దెబ్బ) జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్‌ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన గౌడ కులస్తులు, కల్లుగీత కార్మికులు వెనుకబడి ఉన్నారని అన్నారు. వారి సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కల్లు గీత కార్మికులకు శాశ్వత లైసెన్సులు అమలు చేయాలని, గౌడ కులస్తులకు అన్ని రంగాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 


జనగామ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి.. 
గీత కార్మికులు చెట్లు ఎక్కేందుకు వీలుగా ప్రభుత్వం ఉచితంగా యంత్రాలను అందజేయాలని సూచించారు. అలాగే సర్వాయి పాపన్న పాలించిన ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్నారు. ట్యాంక్‌ బండ్‌పై పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. గీత కార్మికులకు బీమాను రూ.5 లక్ష ల నుంచి పది లక్షలకు పెంచి నేరుగా వారి ఖాతాల్లోనే డబ్బులు పడేలా చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర నాయకులు కిరణ్‌ కుమార్‌ గౌడ్‌, మమత గౌడ్‌, అమరవేణి నిర్మల గౌడ్‌, సంజీవ్‌ గౌడ్‌, శేఖర్‌ గౌడ్‌ పాల్గొన్నారు.


తెలంగాణలో తొలుత జిల్లాల సంఖ్యను పెంచారు. 31 జిల్లాలుగా మారిన రాష్ట్రాన్ని మరో రెండు జిల్లాలు చేర్చి మొత్తం 33 జిల్లాలుగా చేసి పరిపాలన సాగిస్తున్నారు. నారాయణపేట, ములుగు జిల్లాలను చివరగా చేర్చారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పాలన మెరుగవగా, కొన్ని చోట్ల మాత్రం తమ ప్రాంతాన్ని జిల్లాలుగా చేయలేదనే వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలన్న డిమాండ్ మొదలైంది.


ఏపీలోని జిల్లాలకు అమరవీరులు, మహనీయులు, దేవుళ్ల పేర్లు..
ఇటీవలే 13 జిల్లాలుగా ఉన్న ఏపీలో 26 జిల్లాలుగా విభజించారు. అందులో చాలా జిల్లాలకు అమర వీరులు, దేవుళ్లు, మహనీయుల పేర్లను పెట్టారు. అవేంటో మీరే ఓసారి చూడండి. శ్రీకాకుళం - శ్రీకాకుళం, విజయనగరం - విజయనగరం, మన్యం జిల్లా - పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లా - పాడేరు, విశాఖపట్నం - విశాఖపట్నం, అనకాపల్లి - అనకాపల్లి, తూర్పుగోదావరి - కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ - అమలాపురం, రాజమహేంద్రవరం - రాజమహేంద్రవరం, నరసాపురం - భీమవరం, పశ్చిమగోదావరి - ఏలూరు, క్రిష్ణా - మచిలీపట్నం, ఎన్టీఆర్ జిల్లా - విజయవాడ, గుంటూరు - గుంటూరు, బాపట్ల - బాపట్ల, పల్నాడు - నరసరావుపేట, ప్రకాశం - ఒంగోలు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు - నెల్లూరు. కర్నూలు - కర్నూలు, నంద్యాల - నంద్యాల, అనంతపురం - అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా - పుట్టపర్తి, వైఎస్ఆర్ కడప - కడప, అన్నమయ్య జిల్లా - రాయచోటి, చిత్తూరు - చిత్తూరు, శ్రీబాలాజీ జిల్లా - తిరుపతి