కరోనా మృతదేహాలపై కూడా కాసులకు కక్కుర్తి పడుతున్నారు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది. బంధువు మరణించిన దుఃఖంలో ఉన్న కుటుంబానికి మృతదేహం ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే మృతదేహాలపై ఉన్న బంగారాన్ని కూడా మాయం చేస్తున్నారు.
బంగారం మాయం
కరోనా మృతదేహాల్ని కూడా వదిలిపెట్టడం కేటుగాళ్లు. దహన సంస్కారాలకు మృతదేహాన్ని ఇవ్వాలంటే వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. కరోనా మృతదేహాలతో కూడా నెల్లూరు ప్రభుత్వాసుపత్రి సిబ్బంది దందా చేస్తున్నారు. దహన సంస్కారాలకు మృతదేహాన్ని అప్పగించాలంటే 5 వేల రూపాయలు డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేమంటూ ఓ పేద గిరిజన కుటుంబం ప్రాథేయ పడితే చివరకు వెయ్యి రూపాయలు తీసుకుని మృతదేహాన్ని అప్పగించారు. అయితే మృతదేహంపై ఉన్న బంగారాన్ని కాజేశారు. మృతదేహం చెవి కమ్మలు, ముక్కు పుడక తీసుకుని ఆ విషయం ఎక్కడా చెప్పొద్దని గిరిజనుల్ని బెదిరించి అక్కడి నుంచి పంపించేశారు.
Also Read: మైనర్ అత్యాచారం కేసులో మరో టిస్ట్.. పోలీసులు తనను బెదిరించారని బాలిక ఆరోపణ..!
అసలేం జరిగిందంటే..
నెల్లూరు జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి సెప్టెంబర్ 7న కోట మండల కేంద్రానికి చెందిన ఓ గిరిజన కుటుంబం వచ్చింది. పుల్లమ్మ అనే మహిళకు కరోనా లక్షణాలు ఉండటంతో ఆమెను ఆస్పత్రికి తీసుకొచ్చారు. కొవిడ్ పరీక్ష చేసిన అనంతరం ఆమెకు లక్షణాలున్నట్టు నిర్థారించిన వైద్యులు చికిత్స అందించేందుకు ఇన్ పేషెంట్ గా చేర్చుకున్నారు. దాదాపుగా నెలరోజులకి పైగా చికిత్స అందించారు. చివరకు ఈనెల 18న ఆమె చనిపోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు సమాచారమందించారు వైద్యులు. పుల్లమ్మ చనిపోయిందని చెప్పారు. హుటాహుటిన ఆస్పత్రికి వచ్చిన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇవ్వాలని కోరారు. అయితే అప్పటికే మార్చురీకి తరలించడంతో అక్కడి సిబ్బంది బంధువులతో బేరం పెట్టారు. కరోనా మృతదేహాలను బంధువులకు ఇవ్వడంలేదని, ఒకవేళ కావాలంటే 5 వేల రూపాయలు లంచం ఇవ్వాలన్నారు. అంత ఇచ్చుకోలేమని వెయ్యి రూపాయలిస్తామని వారు చెప్పారు. దీంతో ఆ వెయ్యి రూపాయలు తీసుకోవడంతోపాటు, మృతదేహంపై ఉన్న బంగారాన్ని కూడా తీసుకున్నారు. అయితే మృతదేహం ఇవ్వకుండా మరుసటి రోజు రమ్మని చెప్పారు.
Also Read: దర్శకుడు శంకర్ అల్లుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు.. క్రికెట్ కోచింగ్ కోసం వచ్చిన అమ్మాయిని.
వైద్యులు ఫోన్ చేయడంతో అసలు విషయం బయటకి
తర్వాతి రోజు వైద్యులు సదరు పుల్లమ్మ బంధువులకు ఫోన్ చేసి మృత దేహాన్ని తీసుకెళ్లాలని, మూడు రోజుల్లోగా రాకపోతే మున్సిపాల్టీ వారికి అప్పగిస్తామన్నారు. దీంతో అసలేమైందో తెలుసుకుందామని ఆస్పత్రికి వచ్చిన బంధువులు, సిబ్బంది తమను బెదిరించి వెయ్యి రూపాయలు తీసుకోవడంతోపాటు మృతదేహంపై ఉన్న బంగారాన్ని కూడా మాయం చేశారంటూ వైద్యులకు చెప్పారు. తమకు న్యాయం చేయాలంటూ ఆస్పత్రి ముందు పుల్లమ్మ బంధువులు నిరసన తెలిపారు. సామాజిక ఉద్యమకారులు వీరికి మద్దతు తెలిపారు. వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: క్షణికావేశం ఇద్దరి ప్రాణాలు తీసింది... కడపలో తల్లి, కూతురు దారుణ హత్య
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి