కర్నూలు జిల్లా అంటేనే ఫ్యాక్షన్ కు పెట్టింది పేరు. గత కొంతకాలంగా జిల్లాలో ఫ్యాక్షన్ గొడవలు జరగడం తగ్గింది. కానీ గత వారం రోజులుగా పత్తికొండ పరిసర ప్రాంతాల్లో నాటు బాంబులు కలకలం రేపుతున్నాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు పత్తికొండ అటవీ ప్రాంతాల్లో వారం రోజుల క్రితం పొలాల్లో పని చేసుకుంటున్న మహిళలకు నాటు బాంబులు దొరికాయి అవి బాంబుల కాదా అని తెలుసుకునే ప్రయత్నం మహిళలు చేశారు. ఆ ప్రయత్నంలోనే ఒక మహిళ చేయి కోల్పోయింది.
గత వారం రోజులుగా ఫ్యాక్షన్ జోన్ మరియు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పత్తికొండ పరిసర ప్రాంతాలలో నాటు బాంబుల కోసం ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా నిన్న అర్ధరాత్రి పత్తికొండ పట్టణంలోని ఎరుకల ఎల్లయ్య ఇంటిలో 26 నాటు బాంబులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు ఫ్యాక్షన్ జోన్ పోలీసులు. ఇంకా ఈ బాంబులు తయారీలో సూత్రధారులు ఎవరెవరు ఉన్నారు, ఎందుకోసం తయారు చేశారో అనే కోణాల్లో నిందితులను విచారించి మరిన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తామని పత్తికొండ పట్టణ సీఐ ఆదినారాయణ రెడ్డి అన్నారు.
పత్తికొండ ప్రాంతం గతంలో బాంబుల సంస్కృతి ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కానీ పత్తికొండ పరిసర ప్రాంతంలో ఒక్కసారిగా బాంబులు పేలడంతో మళ్లీ బాంబుల గోలతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన మహాబలేశ్వర్ గుప్తను అసెంబ్లీలో అడుగుపెట్టక ముందే పత్తికొండ నడిబొడ్డున బాంబులతో దారుణంగా హత్యచేశారు.
అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన శేషి రెడ్డి ని బాంబు దాడుల్లోనే హత్య చేశారు. మరో ఎమ్మెల్యే ఎర్రగుడి ఈశ్వర్ రెడ్డి సైతం ఇదే తీరుగా దారుణహత్యకు గురయ్యారు. పత్తికొండ పట్టణంలో భారీ ఎత్తున బాంబులు దొరకడంతో ఇవి ఎవరిని అంతం చేయడానికి తయారు చేశారోనని రాజకీయ నాయకులు ఉలిక్కిపడ్డారు. వారం రోజుల కిందట పత్తికొండ పట్టణ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న పొలాలలో పని చేసుకుంటున్న మహిళలకు నాటు బాంబులు పేలి ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పత్తికొండ పోలీసులు.
పత్తికొండ అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న పొలాలలో రైతులు రోజువారి మాదిరిగానే తమ పత్తి పొలంలో పనులు చేసుకుంటూ ఉండగా పొలంలో గుర్తుతెలియని వ్యక్తులు ఒకచోట నిల్వ ఉంచిన బాంబులు కనిపించాయి వాటిని మహిళలు పరిశీలించగా నాటు బాంబులు లాగా ఉన్నాయని ఒకటి తీసుకుని బయటికి విసిరారు అది పేలకపోవడంతో ఈ బాంబులు కాదని నిర్ధారించుకున్న మహిళలు తమ పనులను యద విధిగా చేస్తుండగా అక్కడ నిల్వ ఉన్న బాంబులు ఒక్కసారిగా పేలడంతో ఆయాదుబి అనే మహిళకు అక్కడికక్కడే చేయి తెగిపోగా మరొక మహిళ తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో భయబ్రాంతులకు గురి అయిన పొలంలోని వ్యక్తులు దూరంగా పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి గాయపడ్డ మహిళలను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Also Read: Weather Updates: తెలంగాణను కమ్మేసిన దట్టమైన మేఘాలు.. ఏపీలో పెరిగిన చలి తీవ్రత, మళ్లీ అకాల వర్షాలు