హైదరాబాద్ శివారులోని హయత్ నగర్‌లో దారుణం జరిగింది. తల్లిదండ్రులు గొడవ పడగా.. మధ్యలో వారి కుమారుడు బలి కావాల్సి వచ్చింది. కొడుకును పెంచి పెద్ద చేసి ప్రయోజకుడ్ని చేయాల్సిన తల్లే ముక్కు పచ్చలారని ఏడు నెలల బిడ్డను బలి తీసుకుంది. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లోని హయత్ నగర్‌లో జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్షణికావేశంలో ఆమె తీసుకున్న నిర్ణయంతో బాలుడి ప్రాణాలు పోగా.. ఆమెకు మాత్రం ఒంటిపై గాయాలను మిగిల్చింది.
పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రమావత్ వెంకటేశ్, సువర్ణ దంపతులు హయత్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండల పరిధిలోని ముస్తాపలి గ్రామం రాజ్య తండాకు చెందిన రమావత్ వెంకటేష్‌తో రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బొడకొండ తండాకు చెందిన రమావత్ సువర్ణ (30)కు ఆరు సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు కన్నయ్య (7 నెలలు) ఉన్నారు. వీరంతా కలిసి హయత్ నగర్‌లోనే ఓ ఇల్లు అద్దెకు తీసుకొని నివసిస్తున్నారు.
Also Read: హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు వాడాల్సిన మందుల లిస్టు ఇదే.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటన
అయితే, ఈ భార్యా భర్తలు తరచూ గొడవ పడుతూ ఉండేవారు. ఆ క్రమంలోనే దంపతులు ఈ నెల 11న కూడా కాస్త ఎక్కువగానే తగువులు ఆడుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భార్య సువర్ణ.. తన భర్త వెంకటేశ్ బయటకు వెళ్లిన సమయంలో తప్పుడు నిర్ణయం తీసుకుంది. తన కొడుకుపై, తనపై శానిటైజర్ డబ్బాలోని మొత్తం ద్రావణాన్ని గుమ్మరించుకుంది. వెంటనే ఒంటికి నిప్పంటించుకుంది.
Also Read: Chittoor: భర్తను చంపి తలను సంచిలో పెట్టుకున్న భార్య.. వెంటనే ఆటో ఎక్కి ఎక్కడికి వెళ్లిందంటే..!
ఆ మంటల బాధకు ఇంట్లోంచి సువర్ణ, బాలుడి ఏడుపులు, కేకలు వినిపించడంతో ఇరుగుపొరుగు వారు హుటాహుటిన వచ్చి తలుపులు తెరిచి మంటలు ఆర్పారు. గాయపడిన సువర్ణను, కుమారుడిని హయత్ నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమించడంతో అఫ్జల్ గంజ్ వద్ద ఉన్న ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వారం రోజులపాటు మృత్యువుతో పోరాడిన పసివాడు బుధవారం అర్ధరాత్రి చనిపోయినట్లుగా పోలీసులు తెలిపారు. సువర్ణ కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు. బాలుడి నాయనమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.