కొవిడ్ 19 కేసులు పెరుగుతున్నాయి... సినిమా ఇండస్ట్రీలో ఒకరి తర్వాత మరొకరు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఓ వైపు కరోనా బారిన పడిన ప్రముఖులు కోలుకుని ఆరోగ్యంగా తిరిగి వస్తుంటే... మరోవైపు కొత్తగా వైరస్ బారిన పడుతున్న ప్రముఖులూ ఉంటున్నారు. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాల దర్శకుడు తరుణ్ భాస్కర్ తాజాగా కరోనా బారిన పడ్డారు. హలో ఫ్రెండ్స్... నాకు కొవిడ్ వచ్చింది. రెస్ట్ తీసుకుంటున్నాను. ఆ దరిద్రాన్ని సీరియస్‌గా తీసుకోండి అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ ఫలక్‌నుమా దాస్ లో నటించారు. ఆ తర్వాత మీకు మాత్రమే చెప్తా సినిమాలో హీరోగా చేశారు. దర్శకుడిగా మూడో సినిమాకు తరుణ్ స్క్రిప్ట్ రెడీ చేశారని సమాచారం. ఇటీవలే ఆయన కొత్త ఆఫీసు ప్రారంభించారు. గురువారమే తరుణ్ భాస్కర్‌కు కొవిడ్ సోకింది. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కూడా తనకు కొవిడ్ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. నటి, తమిళ బిగ్ బాస్ ఫేమ్ పావని రెడ్డి కూడా కరోనా బారిన పడ్డారు. ఆహా ఓటీటీలో విడుదలైన సేనాపతి సినిమాలో ఆమె నటించారు. అలాగే, తెలుగులో సీరియల్స్ కూడా చేస్తున్నారు.